మొన్న కేంద్ర హోం శాఖామాత్యులు అమిత్ షా లోక్‌సభలో ఒక బిల్లును ప్రవేశ పెట్టారు. అదే జమ్మూకశ్మీర్ రీ-ఆర్గనైజేషన్ బిల్లు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019లో రాజ్యాంగంలో 370 ప్రకరణం రద్దుచేసి దాని కింద పొందుపరిచిన జమ్మూకశ్మీర్ రాష్ర్టానికి ఉన్న ప్రత్యేక హోదాను తొలగించింది. ఆ సందర్భంగా ఆ రాష్ర్టాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే.
అప్పటినుంచి ఆ ప్రాంతాలు లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలనలో ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ ప్రజాస్వామ్య ప్రక్రియను పునరుద్ధరించే దిశగా మొన్న రీ-ఆర్గనైజేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అంటే అక్కడ చట్టసభలను ఏర్పాటు చేయాలని ఆ బిల్లు ఉద్దేశం. అది హర్షణీయమైన చర్యగానే చూడాలి. అయితే ఆ బిల్లులో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో కూడా ఎన్నికలు జరపాలన్న అంశాన్ని చేర్చడం చర్చనీయాంశమైంది.
POK | ఇక్కడ క్లుప్తంగా చరిత్ర గురించి చెప్పాలి. మనకు బ్రిటిష్ వారు స్వాతంత్య్రం ప్రకటించినప్పుడు రాజవంశీకుల అధీనంలో ఉన్న సంస్థానాల విషయం ఏమీ తేల్చకుండా వారి ఇష్టానికి వదిలేసింది. అంటే ఈ సంస్థానాలు స్వతంత్రంగా ఉండవచ్చు లేదా భారత్‌లో కానీ పాకిస్థాన్‌లో కానీ చేరవచ్చు. ఉదాహరణకు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న నిజాం పాకిస్థాన్‌లో చేరాలనుకున్నాడు. అది చారిత్రక సత్యం. అలాగే జమ్మూకశ్మీర్ అనేది మహారాజ హరిసింగ్ ఆధీనంలో ఉన్నది స్వాతంత్య్రం వచ్చేనాటికి. హరిసింగ్ స్వతంత్రంగానే ఉంటాను గానీ ఏ దేశంలోనూ చేరను అని తీర్మానించుకున్నారు. అయితే అక్కడ ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు తిరుగుబాటు చేశాయి హరిసింగ్‌కు వ్యతిరేకంగా. అప్పుడు ఆయన భారత ప్రభుత్వ సహాయాన్ని అర్థించాడు. భారత ప్రభుత్వం సహాయం కావాలంటే ఆయనను భారతదేశంలో చేరమని ప్రతిపాదించింది అప్పటి ప్రభుత్వం.
ఆ సూచన మేరకు హరిసింగ్ భారతదేశ సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచారం వంటి అంశాల మీద అధికారాలు భారత ప్రభుత్వానికి బదలాయించడం జరిగింది. అయితే ఆ రాష్ర్టానికి ఒక ప్రత్యేక స్థానాన్నిచ్చింది భారత ప్రభుత్వం. అక్కడ ఆ రాష్ర్టానికి చెందని భారతీయులు ఆస్తి కొనుగోలు చేసే అవకాశం లేదు. వారికొక రాజ్యాంగం, ఒక జెండా గట్రా ఉండేలా చేసింది ఆ ఒప్పందం కిందనే. క్రమేపీ జమ్మూకశ్మీర్ భారత భూ భాగంలో విడదీయరాని విధంగా కలిసిపోయింది. అయితే మహారాజు హరిసింగ్ మీద జరిగిన తిరుగుబాటు సందర్భంగా జమ్మూకశ్మీర్‌లోని కొంత భూ భాగం పాకిస్థాన్ ఆక్రమణలోకి వెళ్లింది. అదే ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్‌గా గుర్తింపు పొందిన ప్రాంతం. ఇది పాకిస్థాన్ ఆధీనంలో ఉన్నదనేది ఎవరూ కాదనలేని వాస్తవం. కానీ, మనం మాత్రం అది భారత భూ భాగమే అని అంటున్నాం.
పాక్ ఆక్రమిత కశ్మీర్, భారత ఆధీనంలోని కశ్మీర్ భూ భాగాల మధ్య ఉన్నదాన్ని వాస్తవ ఆధీన రేఖగా పిలుస్తారు. ఆ వాస్తవ ఆధీనరేఖ దాటి మనం అటు వెళ్లం, వాళ్లు ఇటు రారు. ఆ రేఖను దాటి అవతలికి వెళ్లి పాకిస్థాన్ సైన్యానికి బందీగా చిక్కిన అభినందన్ వర్ధమాన్ అనే భారత వాయుసేన పైలెట్ పేరు నేడు ఎంతమందికి గుర్తుందో కానీ, ఆనాడు దేశం అంతా కూడా వర్ధమాన్ సురక్షితంగా స్వదేశం రావాలని ప్రార్థించారు. మన ప్రార్థనలు ఫలించి ఆయన క్షేమంగా తిరిగివచ్చారు. మళ్లీ చెక్కుచెదరని, మొక్కవోని స్థయిర్యంతో ఆయన వాయుసేన విధుల్లో చేరారు. యావత్ దేశం హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నది. ఈ రేఖకు అటూ ఇటు ఇరుసైన్యాలు మోహరించి ఉంటాయి.
కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం.. జమ్మూకశ్మీర్‌కు అసెంబ్లీ సీట్ల పునర్విభజనతో పాటు, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతానికి కూడా కొన్ని సీట్లు కేటాయించారు. అది భారత భూభాగమే కావున అక్కడ కూడా ఎన్నికలు జరుపుతామని కేంద్రం అంటున్నది. మన ఆధీనంలో లేని ప్రాంతంలో మనం ఎలా ఎన్నికలు జరుపుతామనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొద్దిరోజుల్లో పార్లమెంటుకు ఎన్నికలు జరుగనున్న తరుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎన్నికలు జరుపుతామని పార్లమెంటులో ప్రకటించటం ఇరుదేశాల మధ్య కొత్త వివాదాన్ని లేవనెత్తే ప్రయత్నంగా చూస్తున్నారు విశ్లేషకులు. మనకు హక్కున్నప్పటికీ మన ఆధీనంలో లేని దాన్ని తిరిగి పొందాలంటే దౌర్జన్యంగా లాక్కోవాలి. అలా చేస్తే అవతలి వారు ఊరుకోరు కదా? అందువల్లనే తగాదాలు వస్తుంటాయి. రెండు సైన్యాల మధ్య తగాదా అంటే యుద్ధమే అనుకోవాలి కదా! అణ్వాయుధాలు కలిగి యుద్ధం చేసిన చరిత్ర ఉన్న ఇరుదేశాల మధ్య ఘర్షణ అంటే అది రెండువైపులా అలజడి, ఆందోళన కలిగించే అంశం అనటంలో సందేహం లేదు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ మహారాజు హరిసింగ్ రాజ్యంలోని అంతర్భాగమే. అది తిరుగుబాటు ద్వారా పాకిస్థాన్ ఆధీనంలో ఉందిగానీ హరిసింగ్‌తో జరిగిన ఒప్పందం ప్రకారం ఆ ప్రాంతం మనదే అన్నది మన వాదన. వాదన ఎలా ఉన్నప్పటికీ వాస్తవంగా అది మన ఆధీనంలో లేదు. ప్రతిపాదిత అసెంబ్లీలో ఆ ప్రాంతానికి కూడా కొన్ని సీట్లు కేటాయించటం వరకు సరే. ఆ ప్రాంతం మనది కాబట్టి అక్కడ కొన్ని సీట్లు కేటాయించటం సమంజసమే. అట్లా చెయ్యకపోతే దానిమీద మనం హక్కును వదులుకున్నట్టుగానే భావించే ప్రమాదం ఉన్నది. కశ్మీర్లో ఎన్నికలు జరిగినా, ఆ సీట్లు అలాగే ఖాళీగా ఉంటాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు కేటాయించిన సీట్లు అలాగే ఖాళీగా ఉంటాయి. అత్తారింటికి దారేదిలో సునందకు చెందిన షేర్లూ కుర్చీ అలాగే ఎవరూ కూర్చోకుండా ఖాళీగా ఉంచినట్టు. ఏదో ఒకరోజు తిరిగి రాకపోతుందా అన్న ఆశ ఉంది అక్కడ. మనం కూడా సెంటిమెంటల్‌గా ఆ సీట్లను ఖాళీగా ఉంచటం వరకు ఓకే. మనది కాబట్టి మన ఆధీనంలో లేకపోయినా అక్కడికి పోయి ఎన్నికలు జరుపుతామనుకోవటంలో సెంటిమెంటల్ అంశం కాస్తా మెంటల్ అంశంగా మారి లేనిపోని అనర్థాలకు దారితీసే ప్రమాదం ఉన్న విషయాన్ని మనం మరువరాదు!
ఎందుకంటే పాకిస్థాన్ ఆధీనంలో ఉన్న భూ భాగంలో మనం ఏ విధంగా ఎన్నికలు జరుపుతాం?ఆ భూమి మనదే అనటం ఒక ఎత్తు. అక్కడికి పోవాలనుకోవటం మరో ఎత్తు. అక్కడికి పోయే అవకాశం లేకపోయినా అక్కడ కూడా ఎన్నికలు జరుపుతామనటం ఉత్తర కుమార ప్రగల్భాలు అనుకోవాలి. ప్రగల్భాలతో సరిపెడితే సరే. అంతవరకూ ఏ ఇబ్బంది లేదు. కానీ పార్లమెంటుకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఎన్నికల సమయానికి ప్రభుత్వానికి సాధించామని చెప్పుకోవటానికి ఏ అంశమూ లేక ఏదో చేశామని చూయించుకోవటానికి ఏదైనా సాహసానికి దిగితే అది ఇరుదేశాల మధ్య తీవ్ర సమస్యగా పరిణమించే ప్రమాదం ఉన్నది. ఇదే విజ్ఞులను, విశ్లేషకులను, పరిశీలకులను భయపెడుతున్నది.
అంతర్గత విషయాలను విదేశీ వ్యవహారాలు ప్రభావితం చెయ్యటమనేది ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు కొత్తేమీ కాదు. 1971లో పాకిస్థాన్ యుద్ధం చేసి బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన తర్వాత మన పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఆ సంఘటన ప్రభావం చాలా ఉన్నది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని అపరకాళితో పోల్చింది యావత్ భారతదేశం. నేటి బీజేపీ ప్రభుత్వానికి ఇప్పటిదాకా అంశం ఏదీ లేదు ప్రజలకు చూయించుకోవటానికి.
బీజేపీకి ఉన్న అంశాలన్నీ అనుత్పాదక అంశాలే. అయోధ్యలో మందిర నిర్మాణం కానీ, నూతన పార్లమెంటు భవన నిర్మాణం కానీ, 370 అధికరణం రద్దు గానీ, చంద్రయాన్-3 విజయం కానీ ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసే ఉత్పాదక అంశాలు కావు. భావోద్వేగ అంశాలే కానీ, దేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచామని చెప్పుకోవటానికి పనికొచ్చే అంశాలు కాదు. అటువంటి సందర్భాల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే అవకాశం ఉన్న అంశం ఇది. అందుకే ప్రజాభిప్రాయం స్థిరంగా నిలిచి ప్రభుత్వ ఆలోచనకు బ్రేకు వేసేదిగా ఉండాలి. ఇరు దేశాల మధ్య ఇప్పుడున్న సమస్యలు చాలు. కొత్త సమస్యలు అవసరం లేదు. రెండువైపులా ప్రజలు శాంతినే కోరుకుంటున్నారు. అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో నివసించే భారతీయులు, పాకిస్థానీయులు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. ఇద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలను నెలకొల్పే ఉమ్మడి అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటిని పెంపొందిద్దాం. సుహృద్భావ వాతావరణం కోరుకుందాం.
గుమ్మడిదల రంగారావు