మొన్నటి బేస్తారం నాత్రి ఏడు గొడ్తున్నది. నా పెండ్లాం భాగ్య బుక్కెడంత బువ్వ వెడ్తె తిని ఇట్ల శెయి కడ్గిన్నో, లేదో… ‘స్వామన్నా..ఓ స్వామన్నా..’ అని పిల్సుకుంట సుధాకర్, సమ్మయ్య, మహేశ్రానే అచ్చిర్రు మా ఇంటికి. అందరి శేతుల్ల టార్చి లైట్లున్నయి.ఈళ్లందరూ నా పొలం సుట్టుముట్టుండే తోటి రైతన్నలు.మాయి అడివి పక్కకుండే పొలాలు గదా? అందుకే, అందరం గల్సిపొలం కాడికి వోతం, ఒక్కకాడ నిర్ద వోతం. నాత్రిపూట పాములో,తేళ్లో.. గుడ్డెల్గులో, తోడేళ్లో వస్తే ఒకరికొగరం ఇమ్మతన్నట్టు…
భూపాలపల్లి జిల్లా, మహదేవ్పూర్ మా ఊరు. మా ఇంటికాడికెళ్లి మా పొలాలు కిలోమీటరు దూరంలుంటయి. మెడలో తువ్వాల, ఓ శేతిల కట్టె, ఇంకో శేతిల టార్చిలైట్. ఎల్తురు ముందు పోతా ఉంటే దానెన్క మా తొవ్వ పొలం కాడికి సాగుతున్నది. ఎండకు తిరిగీ తిరిగీ పాపం నెరివడ్డదో మన్నో నాగుంబాము.. మా సమ్మిగాడు దాని తోక మీన కాలేసేసరికి ఒక్కసారి బుస్సుమని లేసింది. ‘సమ్మిగా నాగుంబాము లేసిందిరా… కాటెయ్యగల్లా సూడురో..’ అని సుధాకర్ గాడు ఒర్రేసరికి కుడిశేతిల ఉన్న కట్టెతోని పామును కొట్టినంత బరాబర్ జేసిండు సమ్మిగాడు. ఆ భయానికి నాగుంబాము సర్రున ఎల్లిపోతనే ఉన్నది. ఇది మాకు కొత్తేం గాదు. రోజుకు కనీసం మూడు, నాల్గు నాగుంబాములన్న కనవడ్తనే ఉంటయి. గట్టిగ జెప్పాల్నంటే పాములు, తేళ్లు మాతోనే సావాసం జేస్తయన్న మాట.. పాములు, తేళ్లు కుట్టి గూడ సచ్చిపోయినోళ్లు మస్తుమందే ఉన్నరనుకోర్రి…
మా తొవ్వ వడ్ల కుప్పల దగ్గర ఆగిపోయింది. నాది ఆరు టాక్టర్ల వడ్ల కుప్ప కావట్టి కొంచెమంత పెద్దగనే కనవడ్తున్నది. ‘హే.. స్వామన్నా… ఈసారొచ్చే వడ్ల పైసలతోని నీ పెద్ద బిడ్డ అనూష లగ్గం ఎల్లిపోతది పో..’ అని సుధాకర్ గాడు అంటా ఉంటే సంబురం మా అయింది గనీ.. ఒక్క పైసనా, రెండు పైసలా.. లక్షా అరువై వేల రూపాలు… మూడు పైసల మిత్తికి దెచ్చి… నాటేసిన నాల్గు నెలల కింది రోజులు మతికొచ్చినయి. ‘వారి, సుధాకరూ.. నీకు తెల్వదారా… రైతుబంధు బందైపాయె.. క్రాప్‌లోన్ మాఫీ గాక బేంకులట్లనే పెండింగులుండె.. ఈ వడ్లకొచ్చే పైసలతోని అప్పు దేర్పి, క్రాప్‌లోన్ గట్టినంక నా పెద్ద బిడ్డ పెండ్లికి తోకమట్ట కాడ మిగుల్తయారా పైసల్..’ అన్న. నా ఒక్కనిదే గాదు, నా సుట్టూ ఎన్నో వడ్ల కుప్పలున్నయి. ఈ సర్కార్ కొనుగోలు కేంద్రాలోళ్లను ఎప్పుడు పంపిస్తదో, వడ్లెప్పుడు కొంటదోనని పిట్టకు వెట్టినట్టు సూత్తర్రు రైతులు.
ఎడమ శేతికున్న గడియారంల టైం తొమ్మిది గొడ్తున్నది. ఇంతల మహేశ్ గాడొచ్చి.. ‘ఏ స్వామన్నా పందాం పటె… ఎగిలివారంగ లెవ్వాలె, వడ్లనారవొయ్యాలె. లేకుంటే ఆ కాంటా జోకేటోడు తేమ ఉన్నదని మర్రిపోతడు’ అన్జెప్పంగనే అరిగడ్డి వర్సుకొని అందరం నడుమాల్శినం… గిట్ల కన్నంటుకున్నదో లేదో.. ‘స్వామన్నా.. ఓ స్వామన్నా.. లెవ్వే.. మబ్బు పాడుగాను ఎటో ఉరుముతున్నది’ అని సుధాకర్ గాడు లేపితే మేలికైంది. ఆడన్నది నిజమే. మబ్బులు మీదికొచ్చినట్టే నల్లగా ముసురుకున్నయి. ఓర్నీ.. గిదెక్కడి గోసరా అని మన్సుల అనుకుంటనే ఉన్న.. శిటపట శిన్కులు అక్కడోటి అక్కడోటి రాల్తనే ఉన్నయి. ‘అరేయ్.. సంచులందుకోర్రో.. కుప్పల మీన కప్పుర్రో..’ అని మొత్తుకుంటా ఉంటే ఎవ్వని వడ్లు వానికే ఉండె.. ఆ ఆపతికి ఎవ్వడొస్తడు. ఎవ్వని పనిమీన వాడే ఉన్నడు. అటు సంచులు తీస్కచ్చుడు, ఇటు వడ్ల మీన గప్పుడు. అవి గాడ్పు దువారానికి లేసిపోవుడు… ఎంతకని జేస్తం. అక్కడోటి, అక్కడోటి మొదలైన శిన్కులు చిక్కగైనయి. ఎదురుంగున్న మన్షి గూడ కనవడ్తలేడు. దూరం కెళ్లి టార్చిలైట్ ఎల్తురు కనవడ్తున్నది. గీ వానల ఎవ్వల్రా అచ్చేటోళ్లు అని జూసేసరికి భాగ్య, ఇద్దరి పిల్లల్ని వట్టుకొని వడ్ల కాడికి ఉర్కి రానే అచ్చె. అస్తేం ఫాయిదా? ఆరు టాక్టర్ల వడ్లు వానెల్సిపోయేసరికి మూడు టాక్టర్లయినయి. వాన వరదకు వడ్లు కొట్టుకపోతనే ఉన్నయి అడవిలకు. మిగిలిన మూడు టాక్టర్ల వడ్లన్న మంచిగున్నయా అని రాసి మీదికెక్కి జూస్తే మోకాళ్ల లోతున్నయి నీళ్లు.
నాలుగు నెల్ల కట్టం కండ్లముందు కొట్టుకపోతా ఉంటే గుండె పిస్కినట్టయింది. నా పెండ్లాం భాగ్య రెండు శేతులు నెత్తి మీన వెట్టుకొని శోకమందుకున్నది. నా ఇద్దరు బిడ్డలొచ్చి బొత్తనల్ముకొని ఏడుస్తనే ఉన్నరు. మా ఏడ్పులు బైటికినవడ్తున్నయి, కండ్లళ్ల నీళ్లేమో వానతోని గల్సి అడివి మొకాన జారిపోతనే ఉన్నయి. మేమే గాదు, మా సుట్టుముట్టోళ్లందరిదీ అదే పరిస్థితి. ఆ శీకట్ల ఏం జేసుడో, ఎవ్వని దగ్గరికి వోవుడో అర్థం గాక వడ్ల కుప్ప పక్కపొంటే గూసున్న. వాన తగ్గినా, వరద మాత్రం ఇంకా తగ్గలే. నా కాళ్లకు తాకుకుంటా వరద ఎల్లిపోతా ఉన్నది. ఆ వరదల కొట్టుకుపోతున్న వడ్ల గింజలు కాళ్లకు తాకినా కొద్ది గుండెను గుండు పిన్నుతోని కుచ్చినట్టయితున్నది. మూడు పైసల మిత్తికి అప్పుదెచ్చిన లక్షా అరువై వేల రూపాలు కండ్లళ్ల మెరుస్తున్నయి. వడ్ల కుప్పను జూస్తే అసలేమో గానీ, మిత్తి గూడ తేరేటట్టు లేదు. అప్పిచ్చినోడు ఊకుంటడా..? తిర్గు కాయిదం పెట్టుకోకుంటే ఇజ్జద్దీస్తడు. తిర్గు కాయిదం పెట్టుకుంటె ఏమన్న ఉన్నదా? ఉన్న నాలుగెకరాల భూమి అమ్ముడువోయినా ఆచ్చర్యం లేదు. ఒక్కసారిగా పెండ్లికెదిగిన పెద్ద బిడ్డ అనూషను దగ్గర్కి దీస్కొని లోలోపల కుమిలి కుమిలిపోయిన. నిలవడ్డ కన్లు నిలవడ్డట్టే ఉన్నయి. ఎగిలివారంగ ఆరు గొడ్తున్నది. ఇగ నేనే గుండెను రాయి జేస్కున్న. ‘భాగ్య.. ఓ భాగ్య.. నోటికాడి బుక్కల వాన వడ్డదే.. ఎంత మొత్తుకున్నా ఫాయిదా లేదే.. ఇగ ఇంటికి నడుద్దాం పా..’ అని అంటే బల్మీట్టికి అక్కన్నుంచి లేసింది భాగ్య.
శుక్లారం బాయె, శనారం బాయె, ఐతారం అచ్చేటందుకుండె. పొలం కాడికి వస్తున్న.. పోంగ మిగిలిన వడ్లు ఆరవోస్తున్న, మళ్లా ఇంటికి వోతున్న. ఒక్కడొచ్చినోడు లేడు, పాపమన్నోడు లేడు. వాని నాము నర్క, వాన్ని శీరి శింతగ్గట్ట. మా గోతి మేమే తవ్వుకుంటిమి గదరా? కర్మానికన్న ఏత్తిమి గదరా..
-గడ్డం సతీష్
99590 59041