అవమానాలు, అసమానతలు పోవాలని వ్యవస్థపై తిరగబడ్డ స్త్రీవాద రచయిత్రి ఓల్గా. ‘మంచి అన్నది కొంచెమన్నా పెంచుమన్నా’
అంటూ సామాజిక చిత్రాలే తీస్తారు దర్శకుడు అక్కినేని కుటుంబరావు. వారిద్దరూ ‘ఒక మంచి ప్రేమ కథ’ను తెరకెక్కించారు.ప్రేమంటే ఏమిటో చెప్పడానికి రోహిణి అట్టంగడి, రోహిణీ మొల్లేటి, సముద్రఖని ప్రధాన పాత్రల ఫ్యామిలీ డ్రామా ఓటీటీలో విడుదలైంది. ‘ఒక మంచి ప్రేమ కథ’ కేరళా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ముంబయి ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శనకు ఎంపికైంది. అయోధ్య ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ (రోహిణీ అట్టంగడి) అవార్డులు గెలుచుకుంది. తల్లీ బిడ్డల ప్రేమ కథతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటున్నది! ఈ సందర్భంగా ఓల్గా, కుటుంబరావులను ‘జందగీ’ పలకరించింది.
అనేక ప్రేమ కథలు సినిమాలుగా వచ్చాయి. ఈ ప్రేమ ప్రత్యేకత ఏమిటి?
కుటుంబరావు: ఈ సినిమాలో చాలా మంచి ప్రేమను చూపించాం. ప్రేమంటే యువతీ యువకుల మధ్యే కాదు, తల్లీకూతుళ్లు, తండ్రీకూతుళ్ల మధ్య కూడా ప్రేమ ఉంటుంది. కుటుంబ సంబంధాల్లో, స్నేహితుల్లో ప్రేమ ఉంటుంది. చూసిన తర్వాత ఇది ‘ఒక మంచి ప్రేమ కథ’ అని ప్రేక్షకులకూ అర్థమవుతుంది.
ఓల్గా: తెలుగు సినిమాల్లో ప్రేమ ఒక మూసలో ఉంది. ప్రేమ యువతీయువకుల మధ్యనే తిరుగుతుంది. టీనేజ్ నుంచి ఇరవైలలోఉండే ఆడామగా మధ్య ఆకర్షణ, ప్రేమ, అది వివాహం దాకా వెళ్లడం, వెళ్లలేక పోవడం ఈ పరిధిలోనే కథ తిరుగుతుంది. దానిని నుంచి కొంచెం విముక్తి చేసి, ఒక విశాలమైన అర్థాన్నిద్దామనే ప్రయత్నంలో ఈ సినిమా తీశాం. అందుకే ‘ఒక మంచి ప్రేమ కథ’ అని టైటిల్ పెట్టాం.
మీ సినిమా.. ఎవరి ప్రేమ?
కుటుంబరావు: ఇప్పుడున్న ఉరుకులు, పరుగుల్లో ఎవరి బతుకులు వాళ్లు బతుకుతున్నారు. మనుషులెవరిలో ప్రేమ లేదని కాదు. నిజంగా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను చూపించుకోలేరు. అందుకు సమయం లేదు. కాబట్టే మానవ సంబంధాల్లో ప్రేమ కనబడట్లేదు. ఇలాంటి సందర్భంలో ప్రేమను ఎట్లా అర్థం చేసుకోవాలి. ఈ ప్రేమను తిరిగి ఎలా పొందాలని ఈ సినిమా చేశాం. తల్లీకూతుళ్ల మధ్య బంధానికి సంబంధించిన సినిమా. తల్లిదండ్రులకు, పిల్లలకు దూరమవుతున్న సంబంధాల గురించి చర్చించిన సినిమా. తల్లిదండ్రులు ఎడల పిల్లలు, పిల్లల ఎడల తల్లిదండ్రులు ఎలా ఉండాలనే చర్చ నడుస్తుంది.
ఈ సినిమా చెప్పే ప్రేమ సత్యం ఏమిటి?
ఓల్గా: ఈ సినిమాలో ప్రేమంటే ఏమిటని అనేకసార్లు ప్రస్తావన వస్తుంది. తల్లీ, కూతురు మధ్య ప్రేమ ఎలా డెవలప్ అయిందో ఉంటుంది. భార్యాభర్తలు కొద్దికాలం విడిగా ఉంటారు. భార్య పుట్టింట్లో ఉంటుంది. ‘నా భార్య మీద నాకు ఎంతో ప్రేమ’ని అత్తగారితో అల్లుడు చెబుతాడు. ‘ప్రేమంటే ఫిక్స్డ్ డిపాటిజ్ కాదు. బ్యాంకులో వేసుకోగానే వడ్డీలా పెరిగిపోదు’ అంటుంది. ప్రేమకు పోషణ ఉండాలి. ఒక మొక్కను ఎలా పెంచుతామో… అలా! రోజూనీరు పోసి, అప్పుడప్పుడూ ఎరువు వేసి మొక్కను పెంచుకున్నట్టే ప్రేమనూ పెంచుకోవాలి. ఉంది కదా అని నిర్లక్ష్యం చేస్తే అది వాడిపోతుంది. చివరికి పూర్తిగా ఎండిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రేమను పంచాలని ఈ సినిమా చెబుతుంది.
సందేశాలకు డబ్బులు రాలవు కదా!?
ఓల్గా: మేం ఆశా జీవులం. మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం ఉంది. మా సినిమాలన్నిటినీ ఆదరించారు. కమర్షియల్ ఎలిమెంట్స్ లేవనే కారణంగా ప్రదర్శనకు థియేటర్లు దొరకవు. అన్ని సినిమాలకూ కష్టాలు ఉంటాయి. మంచి సినిమాకు మరీ ఎక్కువగా ఉంటాయి. ఓటీటీలో ఇప్పుడు అవకాశం ఉంది. లక్షల మందికి చేరుతుంది. కాకపోతే డబ్బులు వస్తాయా? రావా? అనేదే సందేహం.
కుటుంబరావు: బాల కార్మికుల గురించి ‘భద్రం కొడుకో’ తీశాం. బాల్యం ఇంత అన్యాయంగా ఉంటుందా అని చెప్పాలనుకున్నాం. మంచిగా ఆడింది. ఓడియన్, దుర్గా, కళామందిర్ లాంటి పెద్ద థియేటర్లలో విడుదలైంది. ఆ థియేటర్లలో హౌజ్‌పుల్ కలెక్షన్లతో నడిచింది. మిగతా సినిమాలకు అంత డబ్బు రాలేదు. కానీ, ప్రేక్షక ఆదరణ ఉంది. అంతకుమించి అవార్డులు వచ్చాయి.
మీ సినిమాలకు మీరే కథ రాసుకుంటున్నారు. వేరే కథా రచయితల భాగస్వామ్యం ఎందుకు ఉండదు?
కుటుంబరావు: వేరే రచయితలతో తీయకూడదని ఏం లేదు. మృణాళిని, అంపశయ్య నవీన్, విజయలక్ష్మి, సలీం రచనలతో సీరియల్స్ తీశాం. టెలిఫిల్మ్స్ కూడా తీశాను.
ఓల్గా: నా రచనల్లో కొన్నే సినిమా తీశాం. నాకు స్క్రిప్ట్ రాయడంలో పదేళ్ల అనుభవం ఉంది. స్క్రిప్ట్ రాయడంలో మెలకువలు తెలుసు. కథే నాదైనప్పుడు స్క్రిప్ట్ వేరేవాళ్లకు ఇవ్వాల్సిన అవసరం రాలేదు.
సినిమా కథలో మార్పు చేయాల్సి వస్తే.. ఎవరు డామినేట్ చేస్తారు! ఎవరు రాజీ పడతారు?
ఓల్గా: చిన్న మార్పు చేయాల్సి వచ్చినా ఇద్దరం చర్చించుకుంటాం. ఎందుకు ఇలా చెబుతున్నానని నేను వివరిస్తాను. తను చెప్పదల్చుకున్నది ఏమిటో తను చెబుతాడు. ఈ రెండిటి మధ్య ఎక్కడో ఒక చోట సామరస్యం కుదురుతుంది. ఎవరి డామినేషన్ ఉండదు. కాబట్టి రాజీపడాల్సిన అవసరమూ రాదు. అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు.
కుటుంబరావు: ఇద్దరికీ ఒకే రకమైన భావాలు ఉండటం వల్ల ఆ కథని ఇష్టపడతాం. దానిని డెవలప్ చేసుకుంటాం. దానిలో డిఫరెంట్ ఒపీనియన్ ఉండదు. ఏం చెబుతున్నామనే విషయంలో క్లారిటీ కోసం మాట్లాడుకుంటాం. కానీ, పోట్లాడుకోం.
మీవన్నీ సామాజిక సినిమాలు.. అనుభవాల నుంచి కథ రాస్తారా? అధ్యయనం చేసి రాస్తారా?
కుటుంబరావు: కార్మికులు గురించి ఒక నవల రాయాలనుకున్నాను. దాని కోసం పన్నెండు సంవత్సరాలు రీసెర్చ్ చేశాను. నేను బాలకార్మికుడినే. సనత్‌నగర్‌లో కార్మికుడిగా పనిచేశాను. కార్మికులు, కార్మిక నాయకుల్ని కలిసి మాట్లాడేందుకు తిరుగుతుంటే.. ప్రతి చోటా బాల కార్మికులు కనిపించారు. కార్మిక గీతం నవల పూర్తయిన తర్వాత బాల కార్మిక గీతం రాయాలనుకున్నాను.
ఓల్గా: తొంబయ్యో దశకం నాటికి బాల కార్మిక సమస్య తీవ్రంగా ఉండేది. బాల కార్మికుల హక్కుల కోసం కొన్ని సంఘాలు పనిచేస్తూ ఉండేవి. ఆ వార్తలు పేపర్లలో వస్తూ ఉండేవి. ఇవన్నీ చూసి.. రైల్వే స్టేషన్లకు వెళ్లి, పిల్లలతో మాట్లాడాం. ఓ ఆరు నెలలపాటు వారిని కలవడం, మాట్లాడటం చేశాం.
కుటుంబరావు: బాల కార్మికుల గురించి నవల రాస్తే వెయ్యి కాపీలు అమ్ముడుపోతాయి. అదే సినిమా తీస్తే లక్షల మందికి చేరుతుంది. కాబట్టి సామాజిక సమస్యను మాస్ మీడియాలో తీసుకుపోవాలనుకున్నాను. 39 మంది స్నేహితుల సహకారంతో ‘భద్రం కొడుకో’ సినిమా తీశాం. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ తప్ప.. మిగతా టెక్నిషియన్లు, నటులు అంతా కొత్తవాళ్లమే. బాల నటుడుడికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది.
ఓల్గా: చెత్త ఏరుకునే పిల్లలు, బాలకార్మికులు థియేటర్లకు వచ్చి ముందు రెండు, మూడు వరుసల్లో కూర్చునేవాళ్లు. ఆ పిల్లలు కాగితాలు చింపి, విసిరేవాళ్లు. అది మాటలకందని ఆనందం. ఆ సినిమా తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ వాళ్లు చర్యలు తీసుకున్నారు. ఆ సినిమా చూశాక.. రైళ్లలో పిల్లలు అడిగితే ‘పోరా పో’ అనలేకపోతున్నామని చాలామంది చెప్పారు.
ఇద్దరూ.. రచనా రంగం, సినిమా రంగంలో ఉన్నారు. మీకు వీటిలో సంతృప్తినిచ్చేది ఏది?
ఓల్గా: నాకు కాగితాలు, పెన్ను ఇష్టం. ఈ ఏరియా ప్రశాంతంగా ఉంటుంది. సినిమా కోసం స్క్రిప్ట్ రాస్తాను. కానీ, షూటింగ్, లొకేషన్లు, హడావిడి, పని ఒత్తిడి నచ్చదు. అందుకే రచనా రంగమే సంతోషం.
కుటుంబరావు: నాకు సినిమాలే సంతోషం. అందుకే డైరెక్టర్ అయ్యాను. పన్నెండేళ్ల పాటు సీరియస్‌గా నాటకాలు వేశాను. జనసాహితీలో పనిచేశాను. సాంస్కృతిక రంగానికి ఇంచార్జిగా ఉన్నాను. ఏ సినిమా డైరెక్టర్ దగ్గరా అసిస్టెంట్‌గా పని చేయలేదు. టెక్నిషియన్స్ చక్కగా సాయమందించారు.
తక్కువ సినిమాలు చేశారెందుకు?
కుటుంబరావు: ఎక్కువ సినిమాలు తీయాలంటే ఆర్థిక వనరులు కావాలి. పెద్ద సినిమా నిర్మాతల దగ్గరికి వెళ్తే పెద్ద సినిమాలే చేయాలి. వాళ్లకు నచ్చే సినిమానే చేయాలి. ఆ టైప్ సినిమా చేయడానికి చాలామంది ఉన్నారు. వాళ్లు నాకంటే ఇంకా బాగా చేయగలరు. కమర్షియల్ సినిమాలు నేను చేయలేను. ఒక ఐటమ్ సాంగ్, నాలుగు ఫైట్లు నేను చేయలేను. నన్ను సంప్రదించిన వాళ్లతోనూ అదే చెప్పాను. జీవితమే సినిమా తీయాలి. అదే నేను చేయగలను.
ఓల్గా: సినిమాతో డబ్బులు సంపాదించాలని కోరుకోలేదు. కమర్షియల్ సినిమాలు తీయాలని మేం అనుకోలేదు. తక్కువ సినిమాలు తీసినా మంచి సినిమాలు తీశామనే సంతృప్తి మిగిలింది. అంతే చాలు!…?
-నాగవర్ధన్ రాయల
గడసంతల శ్రీనివాస్