జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికలు రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రధానంగా రెండేండ్ల రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ఈ ఎన్నికల తీర్పు దిక్సూచి కానున్నది. పాలనా వైఫల్యాలు, కుమ్ములాటలు, అనైక్యత, అవినీతి ఆరోపణలు, బుల్డోజర్ కూల్చివేతల నేపథ్యంలో ఈ ఎన్నికలు రాష్ట్ర మంత్రిమండలి భవితవ్యంతో ముడిపడి ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం సైతం ఇక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నది.
జూబ్లీహిల్స్‌లో మూడు దఫాలు గెలిచి నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి, అన్ని వర్గాల మన్ననలు పొందిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నికలు వచ్చాయి. సాధారణ పరిస్థితుల్లో ఎమ్మెల్యే చనిపోతే సానుభూతితో ఏకగ్రీవం చేయాలనే వాదన వస్తున్నది. మానవతా దృక్పథం కంటే రాజకీయ ప్రయోజనాలే పరమావధి కావడంతో జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. గోపీనాథ్ సేవలకు గుర్తుగా బీఆర్ఎస్ పార్టీ ఆయన సతీమణి సునీతను పోటీలో నిలిపింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డిలు ప్రధాన పార్టీల వారు కాగా, ఇతర అభ్యర్థులూ బరిలో ఉన్నారు.
హైదరాబాద్‌కు గుండెకాయ: జూబ్లీహిల్స్ హైదరాబాద్‌కు గుండెకాయ వంటింది. సకల సమాహారాల సమ్మేళనంగా ఉన్నది. ఒకవైపు మిద్దెలు, మేడలు. మరోవైపు బస్తీలు, కాలనీలున్నాయి. ప్రముఖుల నివాస ప్రాంతమే కాకుండా సామాన్య ప్రజలకు ఆలవాలంగా నిలుస్తున్నది జూబ్లీహిల్స్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. అందులో భాగంగానే అభివృద్ధిలో హైదరాబాద్‌ను అగ్రగామిగా నిలిపింది. ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రహదారులతో పాటు గల్లీల్లోనూ సిమెంట్ కాంక్రీట్ రోడ్లు వచ్చాయి. ఫ్లై ఓవర్లు, పేదల కోసం రెండు పడక గదులను నిర్మించింది.
మెట్రో రైలు వచ్చింది. రూ.900 కోట్లతో ఎయిమ్స్ తరహాలో టిమ్స్ నిర్మాణం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డలో మొదలైంది. దేశంలో తొలిసారిగా బోరబండలో దళితుల కోసం సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఏర్పాటైంది. పార్కుల సుందరీకరణ, మంచినీటి సరఫరా తదితర సౌకర్యాలతో జూబ్లీహిల్స్ అన్నివిధాలుగా అభివృద్ధి చెందింది. గోపీనాథ్ పనితీరు వల్ల ఆయన మూడుసార్లు అక్కడ గెలిచారు. 2023 ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా గోపీనాథ్ నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో ముందునిలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపుతో ఈ నియోజకవర్గానికి నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది. అయినా, తన పోరాట పంథాతో గోపీనాథ్ ముందుకుసాగారు. ఆయన మరణం తర్వాత ఉప ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గంపై దృష్టి సారించింది. హడావుడిగా శంకుస్థాపనలు మొదలయ్యాయి. గత రెండేండ్లుగా ఏ మాత్రం పట్టించుకోకపోయినా ఇప్పుడు మాత్రం అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజలకు దూరంగా పాలన: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. అభివృద్ధి పూర్తిగా పడకేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలైన దళితబంధు, బీసీ బంధు రద్దయ్యాయి. బతుకమ్మ చీరల పథకాన్ని ఎత్తేసింది. ముస్లింలకు రంజాన్ కానుకలు, క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు నిలిపివేసింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామన్న హామీని గాలికి వదిలేసింది. బీఆర్ఎస్ తెచ్చిన ఆసరా పింఛన్లు మాత్రమే లబ్ధిదారులకు వస్తున్నాయి. వాటిని రెట్టింపు చేస్తామన్న కాంగ్రెస్ హామీ బూటకమైంది. రెండు పడక గదుల ఇండ్లను రద్దు చేసింది. పేదల ఇండ్లను కూల్చివేసేందుకు హైడ్రాను దించింది. ఇందిరమ్మ ఇండ్ల జాడలేదు.
జూబ్లీహిల్స్ సహా అన్ని నియోజకవర్గాల్లో రోడ్లు అధ్వాన్నంగా మారాయి.వాటి పునరుద్ధరణ లేదు. కొత్త రోడ్ల నిర్మాణం జరగడం లేదు. కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, కంటి వెలుగు పథకాలను అటకెక్కించింది. మరోవైపు పాలన గతంలో ఎప్పుడూ లేనంత అధ్వాన్నంగా మారింది.
కమీషన్లు, లం చాలు, పైరవీలు లేనిదే ఏ పనీకావడం లేదు. అవినీతి నిరోధక శాఖకు చేతినిం డా పని వస్తోంది. ఉద్యోగులు, పెన్షనర్ల బిల్లులు నిలిచిపోయాయి. వారు 20 శాతం కమీషన్ ఇస్తేనే బిల్లులు వస్తాయనే బాధతో ఉన్నారు. పం టలు నష్టపోతే రైతులకు పరిహారం లేదు. రైతుభరోసా లేదు. బోనస్ సరిగా రాలేదు. అంగన్వాడీ లు, ఆశాలు ఇలా అందరూ అసంతృప్తితో ఉన్నా రు. పొరుగు సేవల ఉద్యోగులకు ఏడు నెలలుగా వేతనాలు రావడం లేదు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు కాంగ్రెస్ ప్రభు త్వం నియామక పత్రాలను పంపిణీ చేయడం తప్ప కొత్తగా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఆ పార్టీపై అసంతృప్తితో నిరుద్యోగులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు పాలనపరంగా ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య సఖ్యత లేదు. మంత్రి కొండా కూతురు సుస్మిత నేరుగా సీఎంపై, ఆయన సోదరులపై అభియోగాలు, విమర్శలు చేయడం సంచలనమే అయింది.
ఇతర రాష్ర్టాల్లో ఇలాంటి ఆరోపణలు వస్తే సీఎం రాజీనామా చేసేవారని అన్ని పార్టీల వారంటున్నారు. సీఎం పాలన, సమీక్షలు, సమావేశాలు, రాష్ట్ర పర్యటనల కంటే తరచూ ఢిల్లీ పర్యటనలకు, అధిష్ఠానాన్ని కలిసేందుకు, కాంగ్రెస్ ప్రముఖుల ఇండ్లల్లో కార్యాలకు వెళ్లివస్తున్నారనే విమర్శలున్నాయి. కీలక నేతలకు చావో రేవో అన్న పరిస్థితి ఉన్నందున ఈ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతున్నది. అభ్యర్థులను వడబోసి గతంలో మజ్లిస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన నవీన్ యాదవ్‌ను అభ్యర్థిగా నిలిపింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్‌ను బుజ్జగించేందుకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి సిఫారసు చేయగా అది నిలిచిపోయింది. దీంతో ఆయన అసంతృప్తిగా ఉండటంతో ఆ ప్రభావం మైనారిటీలపై పడుతుందనే భయంతో ఆగమేఘాల మీద మంత్రిపదవి ఇచ్చింది. ఆయన ప్రాధాన్యం గల హోంశాఖను ఆశిస్తే, అదివ్వకుండా దళితమంత్రి లక్ష్మణ్‌కుమార్ వద్ద గల మైనారిటీ శాఖను ఇచ్చింది. తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్ష బీజేపీకి ప్రతికూలంగా మారింది.
విజ్ఞతతో తీర్పు: జూబ్లీహిల్స్ ఓటర్లు అన్నింటిని బేరీజు వేసుకొని విలక్షణ తీర్పు ద్వారా రాష్ర్టానికి దిశానిర్దేశం చేస్తారని రాష్ట్ర ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. ప్రధానంగా గాడితప్పిన ప్రభుత్వాన్ని దారిలో పెట్టేందుకు ఈ తీర్పు బ్రహ్మాస్త్రమే కావాలి. దారితప్పిన నేతలకు కర్రుకాల్చి వాత పెడితేనే వారు ఒళ్లు దగ్గర పెట్టుకొని, బాధ్యతలను గుర్తెరిగి పనిచేస్తారు. ఓటుకు నోటు, మ్యాచ్ ఫిక్సింగ్, రౌడీ షీట్, బ్లాక్‌మెయిలింగ్, గన్‌కల్చర్, బుల్డోజర్ల ప్రభావం ఏ మాత్రం పడకుండా నిత్యం శాంతి సామరస్యాలతో ప్రగతిశీలకంగా, ప్రశాంతంగా, సుఖ సంతోషాలతో నియోజకవర్గం ముందుకు సాగేందుకు ప్రతీ ఒక్కరు ప్రతినబూని ఓటు వేసి తమ సత్తా చాటాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లేలా రాష్ర్టానికి ఆదర్శం కావాలి.
(వ్యాసకర్త: బీఎన్‌రావు పౌండేషన్ చైర్మన్)
ఎవరికి అనుకూలం: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండేండ్ల పాలనకు చేరువైంది. ఈ తరుణంలో జూబ్లీహిల్స్ ఎన్నికలు కీలకంగా మారాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్వర్గీయ గోపీనాథ్, తమ పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, ఆయన భార్య సునీత బరిలో ఉండటం వల్ల తాను విజయం సాధిస్తాననే నమ్మకంతో ఉన్నది. సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. బీజేపీకి ఈ స్థానంపై పెద్దగా ఆశల్లేవు. మరోవైపు కాంగ్రెస్ భయాందోళనలతో ఉన్నది. అనేక చిక్కుల్లో ఉన్న ఆ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గండంగా మారింది.
-డాక్టర్ బీఎన్ రావు
98668 34717