Chandrababu Naidu | ఏదో బుగులు.. ఏదో అపశకునం
తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణానికి సిద్ధం కండి’ అని ఎన్టీఆర్ భవన్లో తనను కలవడానికి వచ్చిన వారితో చంద్రబాబు అన్నారు. ‘తెలుగు జాతి ఉన్నంత వరకు తెలంగాణ గడ్డపై పసుపు జెండా ఎగురుతూనే ఉంటుంది.
ఈ నెల ఆరవ తేదీన హైదరాబాద్‌లో జరిగిన రెండు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశానికి అవసరానికి మించిన పబ్లిసిటీ వచ్చింది. పునర్విభజన చట్టంలో మిగిలిపోయిన అంశాల సంగతేమిటో గానీ గురుశిష్యుల సంబరమే అక్కడ వెల్లివిరిసింది. ఏ ఒక్క అంశాన్ని ఈ సమావేశంలో ముఖాముఖిగా తేల్చకుండా అధికారులతో, మంత్రులతో కమిటీలు వేస్తామనే నిర్ణయానికి ఇంతటి హంగామా అవసరమే లేదు. అయితే అది అక్కడితో ఆగకుండా మర్నాడే హైదరాబాద్ నడిబొడ్డున చంద్రబాబు నోట తెలంగాణ ప్రజలు ఎన్నడూ నమ్మని ‘రెండు కండ్ల సిద్ధాంతం’ మాటను మళ్లీ పలికించింది.
‘తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణానికి సిద్ధం కండి’ అని ఎన్టీఆర్ భవన్లో తనను కలవడానికి వచ్చిన వారితో చంద్రబాబు అన్నారు. ‘తెలుగు జాతి ఉన్నంత వరకు తెలంగాణ గడ్డపై పసుపు జెండా ఎగురుతూనే ఉంటుంది. ఏపీలో పరిస్థితులు సరిచేసి ఇక్కడికి వస్తాను’ అని ఆయన అన్నట్టు పత్రికల్లో వచ్చింది. పునర్విభజనలోని పెండింగ్ అంశాలను చర్చించడానికి చంద్రబాబు చొరవ తీసుకున్నట్టుగా రేవంత్ రెడ్డికి ఎందుకు లేఖ రాశారో, దాని అంతరార్థమేమిటో తెలంగాణ ప్రజలు గ్రహించాల్సిన సమయమిది.
Chandrababu Naidu | పక్కపక్కన ఉన్న రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కలుసుకోవడం గొప్ప విషయమేమీ కాదు. దానికి అంత ప్రచారం అవసరం లేదు. కానీ, పసుపు మీడియా కావాలని ఆ భేటీని గొప్పగా చిత్రిస్తోంది. కొన్ని టీవీ చానళ్లు చంద్రబాబు కదలికలను గంటల పాటు లైవ్‌లో చూపించాయి. చంద్రబాబు, రేవంత్ ఇళ్ల ముందు కెమెరాలు పెట్టి ‘ఆయన వస్తున్నాడు, ఈయన వచ్చేశాడు’ అంటూ అడుగడుగునా కవరేజీ చేశాయి. ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్‌కు చంద్రబాబు రావడాన్ని తెలంగాణ పండుగలా మీడియా పొంగించింది. దాన్ని ఆసరా చేసుకొని తానే హైదరాబాద్ నవనిర్మాతనని చంద్రబాబు రాగమందుకున్నారు. ఇక్కడ పాలకులే లేరు, తెలంగాణ ప్రగతికి తన అవసరం ఉందన్న రీతిలో ఆయన మాట్లాడుతుంటే.. తెలంగాణ ప్రభుత్వం నోరు మెదపడం లేదు.
కొన్ని పత్రికల విర్రవీగుడుతనం చూస్తుంటే.. ఏపీలో బాబు గెలుపుతో ‘మళ్లీ మనపై ఆంధ్రా పెత్తనం మొదలైందా’ అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణ సాధకుడిగా జనం గుండెల్లో నిలిచిన కేసీఆర్ మాటలను ఎద్దేవా చేసేందుకు ఆయా పత్రికలు ఎగబడుతున్నాయి. పదేండ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ప్రధాన విపక్ష నేతగా ఉన్న వ్యక్తిని ఓ సినిమాలోని డైలాగ్‌ను ఉదహరిస్తూ కించపరచడం దుస్సాహసమే. ప్రస్తుత ప్రభుత్వం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికి, ఆయనతో రాసుకు పూసుకోవడమే ఆ తెగింపునకు బలమిచ్చిందని చెప్పాలి. చంద్రబాబు, రేవంత్ గురుశిష్యులే. 2015లో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి పన్నిన ఓటుకు నోటు కేసులో వారు నిందితులు. ఆ కుట్రలో ఒకరు డైరెక్టర్ అయితే, మరొకరు యాక్టర్ అని వీడియో స్పష్టం చేస్తున్నది.
అసలు ‘కలిసి మాట్లాడుకుందాం’ అని చంద్రబాబు లేఖ రాయడమే ఒక కుట్ర. అదే నిజమైతే అందుకు తగిన ఫైళ్లు, సరంజామా పట్టుకొచ్చి ఒకట్రెండు రోజులు మంత్రులు, అధికారులు కూర్చోని పరిష్కారాలు కనుక్కోవచ్చు. ఎన్నిసార్లయినా సమావేశం కావచ్చు. అందుకు భిన్నంగా ఓ సాకు పెట్టుకొని ఇక్కడికి వచ్చి మళ్లీ తెలంగాణలో తన ప్రాబల్యం పెంచుకోవాలనే దురాశ చంద్రబాబు మాటల్లో బయటపడింది.
ఆయన పక్క రాష్ర్టానికి సీఎం అయినంత మాత్రాన తెలంగాణలో అడుగుపెట్టగానే విమానాశ్రయం నుంచి స్వాగత యాత్రకు, ఊరేగింపునకు అనుమతులు, బందోబస్తు ఎందుకు? ఈ సంబరాలు దేనికి సంకేతం? ఇంత జరుగుతున్నా తెలంగాణ ముఖ్యమంత్రి చూసీచూడనట్టు ఎందుకు ఉంటున్నారు? అనేది తెలంగాణవాదులకు అంతుచిక్కని ప్రశ్న.
‘రెండు రాష్ర్టాల్లోనూ నా హవా నడుస్తుంది’ అన్నట్టు బాబు వ్యవహరిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే 1956లో నెహ్రూ అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. హైదరాబాద్ స్టేట్, ఆంధ్రా కలయికతో ఏర్పడ్డ ఏపీ అవతరణను.. ‘అమాయకపు పిల్లను, గడుసు అబ్బాయికి ఇచ్చినట్టుంది’ అని ఆయన పేర్కొన్నారు. ఆ అమాయకత్వం తెలంగాణను ఇంకా వీడలేదేమో.. మాయమాటలను నమ్మి మళ్లీ బోల్తా పడుతుందేమోననే బుగులు, ఏదో అపశకునం ఇప్పుడు పొడసూపుతోంది.
ఏపీ ఎన్నికల ఫలితాలు రాగానే హైదరాబాద్ రోడ్లపై పచ్చజెండాల బైకుల ఊరేగింపు, వారు చేసిన హంగామా, ఒక్కసారిగా ఏర్పడ్డ ట్రాఫిక్ ఇబ్బందులు ఇంతాఅంతా కాదు. ‘ఇక్కడి ఎన్నికలు కాదు, ఇక్కడి పార్టీ కాదు.. ఎక్కడో జరిగిన ఎన్నికల ఫలితాలకు ఇక్కడ ఈ లొల్లి ఏంద’ని వాహనదారులు విసుక్కోక తప్పలేదు. పోలీసులు ఆ మూకలను నిలువరించలేకపోయారు. పోయిన సెప్టెంబర్‌లో జరిగిన చంద్రబాబు అరెస్టు పట్ల నిరసన ప్రదర్శనలకు హైదరాబాద్‌లో అనుమతి లభించలేదు. ‘పక్క రాష్ట్రంలో జరిగిన దానికి ఇక్కడెందుకు ర్యాలీలు’ అంటూ అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వాటిని ఆపివేశారు. ఇప్పుడు ఆ హద్దులు చెరిగిపోయాయి. గతంలో టీడీపీలో ఉండి ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఏ బెరుకు లేకుండా చంద్రబాబును కలుస్తుంటే.. కాలం ఎటు నుంచి ఎటు తిరుగుతుందో అర్థం కావడం లేదు.
తిరుపతిలో మన ఎమ్మెల్యేల సిఫారసులు చెల్లే అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైదరాబాద్‌లో స్థలాల కేటాయింపు వద్దు. ‘మాకు పోర్ట్ లేదు, మీ తీరంలో మాకు పాలు ఇవ్వండి’ అని రేవంత్ అంటే ఇవ్వడానికి చంద్రబాబు ఎవ్వరు? కొట్లాడి విడిపోయినాక ‘మళ్లీ పొత్తు కూడుదామా’ అని ఇద్దరు ముఖ్యమంత్రులు అనుకుంటే సరిపోదు. ఏపీ అయినా, తెలంగాణ అయినా ఎవరెవరికి ఏమి ఇవ్వాలనే విషయంలో ప్రజాభిప్రాయం కావాలి. ఏపీలో తెలంగాణకు చెందేదేమీ లేదని, ఇద్దరు ముఖ్యమంత్రులు ఏం చర్చించినా దాన్ని లైవ్‌లో టెలికాస్ట్ చేయించాలని ఏపీలో ప్రతిపక్షం అంటోంది. పునర్విభజన చట్టం, 2014లో ఉన్న అంశాలకు పరిష్కారం లభిస్తే చాలు. ఆ తర్వాత ఎవరి బతుకులు వారు బతికితే అదే తెలంగాణకు మేలు.
-బి.నర్సన్
94401 28169
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

