కేసీఆర్ అయితే ఏం చేసేవారంటే..!
దాహం వేసినప్పుడే బావిని తవ్వడం మూర్ఖుల లక్షణం. ఇప్పుడు రేవంత్రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఆ సామెతను గుర్తుచేస్తున్నది. కరువు ముప్పు గురించి వాతావరణశాఖ నుంచి ముందుగానే హెచ్చరికలు వచ్చినా.. నీటి నిర్వహణ, విద్యుత్తు ఉత్పత్తి, పంటల రక్షణపై ప్రభుత్వం పటిష్టమైన కార్యాచరణ చేపట్టలేదు.
తెలంగాణలో ఎల్ నినో ప్రభావంతో కరువు ముప్పు పొంచి ఉన్నది. ప్రస్తుత తరుణంలో.. కేసీఆర్ అధికారంలో ఉంటే ఏం చేసేవారు? ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొనేవారు? అనే ప్రశ్నలకు ఆయన తొమ్మిదిన్నరేండ్ల అద్భుత పాలనానుభవమే సమాధానంగా నిలుస్తుంది. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే విద్యుత్తు సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపట్టి, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటును సరఫరా చేసిన సమర్థ నాయకుడు కేసీఆర్. ఆయన ఇప్పుడు అధికారంలో ఉంటే ముందస్తు ప్రణాళికతో నీటి కొరతను, విద్యుత్తు అంతరాయాలను ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టేవారు. ఎలాంటి సంక్షోభంలో నుంచైనా గట్టెక్కించే దార్శనిక నాయకుడు మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
దాహం వేసినప్పుడే బావిని తవ్వడం మూర్ఖుల లక్షణం. ఇప్పుడు రేవంత్రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఆ సామెతను గుర్తుచేస్తున్నది. కరువు ముప్పు గురించి వాతావరణశాఖ నుంచి ముందుగానే హెచ్చరికలు వచ్చినా.. నీటి నిర్వహణ, విద్యుత్తు ఉత్పత్తి, పంటల రక్షణపై ప్రభుత్వం పటిష్టమైన కార్యాచరణ చేపట్టలేదు. సమీక్షలు నిర్వహించడం, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, పర్యటనలు చేయడం మాత్రమే పాలన కాదు. ఆ ఆదేశాలు క్షేత్రస్థాయిలో, రైతుల పొలంలో ఫలితాలను ఇవ్వాలి. విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తి అంతరాయాలు, బొగ్గు సరఫరాలో భారీ కొరత, రైతుల ఆందోళనలు, సాగునీటి అవసరాలు ఒకవైపు ముంచుకొస్తుండగా, ప్రభుత్వ కంటి తుడుపు చర్యలు ఎంతవరకు ఫలితాలిస్తున్నాయి అనేది ప్రజలకు స్పష్టంగా అనుభవంలోకి వస్తూనే ఉన్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో విద్యుత్తు కొరత ఒక ప్రధాన సవాల్గా ఉండేది. వ్యవసాయం, పరిశ్రమలు, గృహ అవసరాలకు అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయడం కొత్త రాష్ర్టానికి కీలకమైన బాధ్యతగా నిలిచింది. కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరాను అమలు చేయడంతోపాటు విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు భద్రాద్రి, యాదాద్రి వంటి థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టులకు ప్రాధాన్యమిచ్చింది. రాష్ట్ర అవసరాలకు తగిన విద్యుత్తు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో దీర్ఘకాలిక మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టింది.
కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్తు కేంద్రాలు నిర్మించడంతోనే సరిపెట్టలేదు. వాటికి నిరంతర బొగ్గు సరఫరా, సాంకేతిక నిర్వహణ, సకాలంలో మరమ్మతులు, అవసరమైనప్పుడు ప్రత్యామ్నాయ విద్యుత్తు కొనుగోలుపైనా దృష్టి సారించింది. విద్యుత్తు ఉత్పత్తిలో అంతరాయాలు ఏర్పడినప్పుడు వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ఏ కేంద్రంలో ఉత్పత్తి తగ్గింది? ఎందుకు తగ్గింది? దాన్ని పునరుద్ధరించడానికి ఏయే చర్యలు తీసుకోవాలి? అనే కోణాల్లో నిపుణులు, అధికారులతో సమీక్షలు, చర్చలు జరిపింది. సమస్యల పరిష్కార మార్గాలను కనుగొన్నది. కొరత ఏర్పడితే రైతులకు సరఫరా నిలిచిపోకుండా చూసింది. ఎలాంటి సంక్షోభ పరిస్థితుల్లోనైనా ఆ ప్రతికూల ప్రభావం ప్రజలు, రైతులపై పడకుండా చూసుకున్నది. కేసీఆర్ హయాంలో సాధ్యమైన ప్రణాళికలు ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎందుకు కావడంలేదు?
కేసీఆర్ అధికారంలో ఉంటే కరువు ముప్పు ఉన్నప్పుడు కాళేశ్వరం జలాలను ఒడిసిపట్టి జలాశయాల్లో నీటి నిల్వలు పెంచేవారు. చెరువులు, కుంటలు నింపి, భూగర్భ జలాల స్థాయి, పంటల అవసరాలను సమగ్రంగా పరిశీలించేవారు. అందుబాటులో ఉన్న నీటిని తాగు, సాగునీటి అవసరాలకు ప్రాధాన్యతా క్రమంలో వినియోగించేవారు. ఏ ప్రాంతంలో పంటలకు తక్షణ నీరు అవసరమో గుర్తించేవారు. నీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు ముందుగానే సలహాలు ఇచ్చేవారు. వర్షాలు తగ్గిన తర్వాత హడావుడి చేయడం కంటే, వర్షాభావ సూచనలు కనిపించినప్పుడే కార్యాచరణ సిద్ధం చేసేవారు.
కేసీఆర్ పాలనలో విద్యుత్తు, సాగునీరు, రైతు సంక్షేమానికి ఆయన ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిన విషయం స్పష్టం. ఆ అనుభవాన్ని బట్టి, ఇలాంటి సంక్షోభ సమయంలో నీటి నిల్వలు, విద్యుత్తు ఉత్పత్తి, బొగ్గు సరఫరా, పంటల పరిస్థితిపై సమగ్ర సమీక్షకు ప్రాధాన్యమిచ్చేవారు. జిల్లాల వారీగా సమస్యలను గుర్తించడం, నీటి వినియోగానికి ప్రాధాన్య క్రమాన్ని నిర్ణయించడం, విద్యుత్తు ఉత్పత్తి అంతరాయాలను అధిగమించడం, అవసరమైతే ప్రత్యామ్నాయ విద్యుత్తు కొనుగోలు మార్గాల ద్వారా సరఫరాను నిలబెట్టడం వంటి చర్యలు తీసుకునేవారని వారు.
కాంగ్రెస్ పాలకులు ప్రజల సమస్యల గురించి పట్టించుకోకుండా కాలయాపన చేయడం ప్రస్తుత సమస్యలకు పరిష్కారం కాదు. గత ప్రభుత్వంపై ఆరోపణలు, నిందలు వేస్తూ ప్రస్తుత ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోజాలదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రైతులకు విద్యుత్తు సక్రమంగా అందాలి, పొలానికి నీరు చేరాలి, తాగునీటి కొరత రాకుండా చూడాలి. ఎల్ నినోను ఏ నాయకులూ నియంత్రించలేరు. కానీ దాని ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళిక రూపొందించగలరు. ప్రజలకు కావాల్సింది సాకులు కాదు, సాగునీళ్లు. కష్టకాలంలో తమకు అండగా నిలిచే పాలన. కరువు వచ్చిన తర్వాత కంటితుడుపు చర్యల కన్నా, కరువు రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం నిజమైన పరిపాలనా దక్షత. కరువు కాలంలో రైతుల కన్నీళ్లు తుడిచి, ప్రజల దాహార్తి తీర్చేందుకు ఉద్దేశించిందే కాళేశ్వరం సజీవ జలధార. తెలంగాణ లైఫ్ లైన్. అది కేసీఆర్ కలల సాగరం. మరి దానిని ఈ కరువు సమయంలో ఉపయోగించుకోకపోవడమే రేవంత్ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదం. అందుకే ఇప్పుడు కేసీఆర్ను జనం గుర్తుచేసుకుంటున్నారు.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
వీరేంద్ర కాపర్తి
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

