BJP | అత్యంత దుర్భేద్యమైన చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ను విజయవంతంగా దిగబెట్టి ఇస్రో చరిత్ర సృష్టించింది. అయితే, ‘సొమ్మొకడిది.. సోకొకడిది’ అన్నట్టు.. రేయింబవళ్లు నిద్రాహారాలు మాని, మిషన్ సక్సెస్‌కు ఎంతగానో శ్రమించిన శాస్త్రవేత్తల కృషిని కూడా తమ ఘనతగా చెప్పుకోవడానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పెద్దలు ప్రయత్నించారు. దశాబ్దాల కిందట ప్రారంభించిన ఐఐఎస్సీ, టీఐఎఫ్ఆర్, ఐఐటీలు, ఎన్ఐటీలు, బార్క్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు వేసిన బీజాలే ఇప్పుడు వృక్షాలుగా మారి భారత్‌కు శాస్త్ర, సాంకేతిక విజయాలనే ఫలాలనిస్తున్నాయని కమలం పార్టీ నేతలు మరిచిపోకూడదు.
సంపన్న దేశాలు సైతం సాధించలేని అరుదైన ఘనతను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సాధించింది. దీంతో ఆగస్టు 23న సాయంత్రం దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. జాబిలిపై త్రివర్ణపతాక రెపరెపలను తలచుకొని జాతిజనులు పరవశించిపోయారు. మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి నాయకులు ప్రారంభించిన ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలు శాస్త్ర పురోగతికి సాయపడుతూనే అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ను పరాక్రమంగా నిలబెట్టాయన్న విషయాన్ని ఎవరు విస్మరించకూడదు.
స్పాట్లైట్లోకి మోదీ
చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ దిగుతున్న ఆఖరి క్షణాల్లో నేను రెండు విషయాలను గమనించా. నిర్ణీత ప్రాంతంలో ల్యాండర్ దిగుతున్న మరుపురాని క్షణం ఇందులో ఒకటైతే, ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురవడం రెండోది. ఎలాంటి సందర్భాన్నైనా వ్యూహాత్మకంగా తనకనుకూలంగా మార్చుకొని తద్వారా ప్రచారాన్ని పొందడంలో నరేంద్ర మోదీ దిట్ట అనే విషయం ఇదివరకే పలు సందర్భాల్లో రుజువైంది. యావత్తు ప్రపంచం వేయికండ్లతో ఎదురుచూస్తున్న చంద్రయాన్-3 చివరి ఘట్టాన్ని ప్రచారం కోసం వినియోగించుకోకుండా ఆయన వదులుకుంటారని ఎందుకు అనుకుంటాం? ఊహించినట్టుగానే, ఆయన అదేపని చేశారు. బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణాఫ్రికాలో ఉన్నప్పటికీ, వర్చువల్‌గా తెరపై మోదీ చంద్రయాన్-3 చివరి కీలక ఘట్టంలో ప్రత్యక్షమయ్యారు. అంతే, అప్పటివరకూ సెంటర్ ఆఫ్ ఇంట్రెస్టింగ్గా ఉన్న విక్రమ్ ల్యాండింగ్ పక్కకు జరిగి, ప్రధాని స్పాట్లైట్లోకి వచ్చేశారు. అయితే, గత కొన్నేండ్లుగా ఎందరో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ప్రఖ్యాత సాంకేతిక విద్యాసంస్థల అవిరళ కృషి ఫలితంగానే చంద్రయాన్-3 వంటి విజయాలను మనం సాధిస్తున్నామన్న విషయాన్ని ఎవ్వరమూ మరిచిపోవద్దు. భారత్ ప్రస్తుతం సాధిస్తున్న శాస్త్ర, సాంకేతిక విజయాలు ఏ ఒక్కరి వల్ల సాధించినవి కాదు. ఎందరో శాస్త్రవేత్తల, ఇంజినీర్ల, సంస్థల నిరుపమాన కృషి వల్లే ఇది సాధ్యపడింది.
భారత్ విజయాల్లో చారిత్రక మూలాలెన్నో..
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడానికి మునుపే శాస్త్రీయ రంగంలో పరిశోధనల పర్వం కొనసాగింది. దేశం అభివృద్ధి పథంలో ముందుకుపోవడానికి విద్య, పరిశోధనలే కీలకమన్న విషయాన్ని అప్పటి దార్శనికులు ముందుగానే పసిగట్టారు. బ్రిటిష్‌కాలంలో పరిశోధనలకు ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ, భావిభారతం శాస్త్ర ఉషస్సులతో ప్రకాశించాలన్న ధృఢ సంకల్పాన్ని మదిలో నింపుకొన్న అప్పటి శాస్త్రవేత్తలను వలస పాలకుల ఆంక్షలకు ఏ మాత్రం వెరవలేదు. అలా నవీన శాస్త్ర, సాంకేతిక భారతానికి పునాదులు వేశారు. ఇదే దేశంలో శాస్త్ర, సాంకేతిక విద్యా, పరిశోధన సంస్థలు నెలకొల్పేందుకు బాటలు వేసింది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)
1909లో బెంగళూరులో స్థాపించారు. ఫిజిక్స్ నుంచి కెమిస్ట్రీ వరకు, బయోలజీ నుంచి మ్యాథమేటిక్స్ వరకు.. ఇలా ఒక్కటేమిటీ… శాస్త్రీయరంగంలో కొత్త ఆవిష్కరణలను చూడాలనుకొన్న వారి పరిశోధనలకు ఓ కల్పతరువుగా మారింది. పరిశోధనల్లోనే కాదు, భవిష్యత్తు భారత శాస్త్రీయ నిర్మాణంలో కీలక భూమిక పోషించింది.
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్)
1945లో ముంబైలో ఏర్పాటుచేశారు. ప్రాథమికస్థాయి పరిశోధనలతోనే ఏ ఆవిష్కరణలైనా సాధ్యమన్న లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దేశ శాస్త్రీయ రంగంలో పరిశోధనలకు, నిబద్ధతతో కూడిన ఆవిష్కరణలకు ఈ సంస్థ ఓ కేంద్రంగా మారింది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)
రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ఏ ప్రకారం భారత శాస్త్ర, సాంకేతికరంగాన్ని మరింతగా పరిపుష్ఠం చేసే ఉద్దేశంతో మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ దూరదృష్టితోనే.. దేశవ్యాప్తంగా ఈ ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటు జరిగింది. ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా 1951లో ఖరగ్‌పూర్‌లో ఐఐటీని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత ఐఐటీ బాంబే (1958), ఐఐటీ మద్రాస్ (1959), ఐఐటీ కాన్పూర్ (1959), ఐఐటీ ఢిల్లీ (1961), ఐఐటీ గువాహటి (1994)తో పాటు మరికొన్ని సంస్థలు ఏర్పాటయ్యాయి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్): ఆరోగ్య రంగంలోనూ కొత్త ఆవిష్కరణలకు దోహదం చేసేలా 1956లో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేశారు. నైపుణ్యం కలిగిన మెడికల్ ప్రొఫెసర్లను తయారుచేయడంతో పాటు వైద్యపరిశోధనల్లో ఎయిమ్స్ కొత్త మైలురాళ్లను చేరుకొంటున్నది.
రిజినల్ ఇంజినీరింగ్ కాలేజీలు (ఆర్ఈసీలు-ఎన్ఐటీలు)
భారత శాస్త్ర, సాంకేతికరంగం ఆభివృద్ధిలో రిజినల్ ఇంజినీరింగ్ కాలేజీల పాత్రను కూడా విస్మరించలేం. తర్వాతికాలంలో వీటిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లుగా మార్చారు.
ఇస్రో పుట్టుక ఇలా..
భారత అంతరిక్ష పరిశోధనల కోసం 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (ఐఎన్‌సీవోఎస్‌పీఏఆర్)ను ఏర్పాటుచేశారు. ఇదే 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏర్పాటుకు బాటలు వేసింది. శాస్త్ర, సాంకేతిక రంగంలో ప్రపంచవేదికపై భారత్‌ను నిలబెట్టాలన్న ఉద్దేశంతో నెహ్రూ ఇస్రో ఏర్పాటుకు కృషిచేశారు. సైన్స్, టెక్నాలజీ, అటామిక్ రీసెర్చ్‌లో ఇస్రో ఎన్నో మైలురాళ్లను అధిగమించింది.
విక్రమ్ సారాభాయ్ వారసత్వం కొనసాగింపు..
1974, 1998లో పోఖ్రాన్లో నిర్వహించిన అణుపరీక్షలతో.. న్యూక్లియర్ టెక్నాలజీలో దేశాలకు తామేమీ తీసిపోమని భారత్ నిరూపించింది. ప్రాదేశిక భద్రతలో స్వావలంబన సాధించామన్న విషయాన్ని ఈ పరీక్షలు రుజువు చేశాయి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన న్యూక్లియర్ రియాక్టర్ల వల్ల శిలాజ ఇంధనాల వాడకం తగ్గింది. 2014లో మంగళ్యాన్ పేరిట అంగారకుడి మీదకు రాకెట్‌ను పంపడంలో ఇస్రో ఘనవిజయం సాధించింది. అత్యంత చౌకగా, తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. చంద్రుడి మీద నీటిజాడను చంద్రయాన్-1 కనిపెట్టగా, చంద్రుడి దక్షిణ ధ్రువానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని చంద్రయాన్-2 రాబట్టింది. భారీ పెలోడ్లను రోదసిలోకి పంపేందుకు వీలుగా స్వదేశీ పరిజ్ఞానంతో క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీని అభివృద్ధి చేసి ఇస్రో మరో ఘనతను సాధించింది. ఇవన్నీ ఏ ఒక్కరి వల్లనో సాధ్యపడలేదు. వందలాది మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల ఆహోరాత్రుల శ్రమతోనే ఇదంతా సాకారమైంది. ఇక్కడ మరో విషయం.. ఇస్రో పురుడు పోసుకోడానికి, రోదసిరంగంలో భారత్ విజయవిహారం చేయడానికి డాక్టర్ విక్రమ్ సారాబాయ్ కృషిని ఎవ్వరం మరిచిపోలేం. ఈయన వారసత్వాన్ని కే.శివన్, ఎస్.సోమనాథ్ కొనసాగిస్తున్నారు.
శ్రమ ఒకరిది.. గొప్పలు మరొకరివి..
ఇంతటి ఘన విజయాలు సాధించిన ఇస్రో వంటి సంస్థలు కూడా కొన్ని సందర్భాల్లో పొలిటికల్ ఎజెండా బాధిత వర్గంలో చేరడం విషాదకరం. బీజేపీ చేష్టలే దీనికి మంచి ఉదాహరణ. చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ రోజున వర్చువల్‌గా మాట్లాడిన ప్రధాని.. మీడియా మొత్తాన్ని తన వైపునకు తిప్పుకొనే ప్రయత్నం చేశారు. అంతేకాదు, బ్రిక్స్ సదస్సును ముగించుకొని సరాసరి బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి శనివారం ఆయన వెళ్లారు. శాస్త్రవేత్తలతో ఇష్టాగోష్ఠి నిర్వహించిన ఆయన పనిలోపనిగా చంద్రయాన్-3 ల్యాండర్ దిగిన ప్రాంతానికి ‘శివశక్తి’ అని, చంద్రయాన్-2 క్రాష్ అయిన ప్రాంతానికి ‘తిరంగా పాయింట్’ అని నామకరణం చేశారు. అలా చంద్రయాన్-3 విజయాన్ని కూడా తన ఖాతాలోనే వేసుకొనే ప్రయత్నం చేశారు. క్రెడిట్ మొత్తం తనొక్కడికే దక్కడానికి అన్నట్టు.. తనను ఆహ్వానించడానికి ఎయిర్‌పోర్ట్‌కు రావాలనుకొన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను పక్కనబెట్టి మరీ ప్రధాని ఇస్రో కేంద్రానికి వెళ్లడం గమనార్హం. కొవిడ్-19 సంక్షోభంలో తెలంగాణ సీఎం కేసీఆర్ విషయంలోనూ దాదాపుగా ఇలాగే జరిగింది. కొవాగ్జిన్ టీకాను తయారు చేసిన హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ పరిశోధకులను అభినందించడానికి 2020లో ప్రధాని హైదరాబాద్‌కు వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొనాలి. అయితే, అలా జరుగకుండా కేసీఆర్‌ను ఆ కార్యక్రమంలో పాల్గొనకుండా చేసి ప్రధాని సోలో క్రెడిట్ కోసం పాకులాడారు. ఇక, కరోనా విలయంలో పౌరుల మరణాలను చూసి చలించిపోయిన వందలాది మంది వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు నిద్రాహారాలు మానేసి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. అయితే, టీకా సర్టిఫికెట్లపై పీఎం మోదీ ఫొటోను ముద్రించి.. అదంతా తమ ఘనతగా ప్రచారం చేసుకొన్నారు. కష్టపడింది ఒకరైతే.. ఫలాల్ని అనుభవించాలనుకొన్నది మరొకరు.
1975లోనే భారత్ ఆర్యభట్ట పేరిట తొలి ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపించింది. దీనివెనుక అప్పటి ప్రధానుల, శాస్త్రవేత్తల కృషిని మరువలేం. ఇప్పుడు చంద్రయాన్-3 విజయంలోనూ వందలాది మంది శాస్త్రవేత్తల కృషి, పట్టుదల ఉందన్నది నిర్వివాదాంశం. అయితే, రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విజయాలను వాడుకోవడం శాస్త్రవేత్తల కృషి, శ్రమను అవమానించడమే అవుతుంది. శాస్త్ర, సాంకేతిక రంగంలో భారత్ విజయాలు నమోదుచేయడంలో శాస్త్రవేత్తల అంకితభావాన్ని ఇప్పటికైనా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇస్రో కేంద్రానికి మోదీ ప్రధాని హోదాలో వెళ్లడంలో తప్పులేదు. కానీ, ఈ ఘనతకు కారకులైన మాజీ ప్రధానులు, శాస్త్ర ప్రముఖుల పేర్లను ప్రస్తావించకపోవడమే శోచనీయం.
2013 నవంబర్ 5న మార్స్ మీదికి శాట్‌లైట్ ప్రయోగం జరిగింది. అప్పుడు మన ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు. ఇది మార్స్ కక్ష్యలోకి ప్రవేశపెట్టేటప్పటికి (2014, సెప్టెంబర్ 24) 300 రోజులకు పైగా పట్టింది. అప్పుడు ప్రధానిగా మోదీ ఉన్నారు. మరి మార్స్ మిషన్ విజయం ఎవరి ఘనత? ఈ ఘనత నాదేనని మోదీ చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం? శాస్త్ర ప్రయోగాల విజయాలు శాస్త్రవేత్తలవే. ఆ ఘనత వారికి దక్కడమే సముచితం.
-బి.వినోద్‌కుమార్
(రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు)