కొట్లాడి ఒక రాష్ర్టాన్ని తీసుకురావడం అసాధ్యం. కానీ, కొట్లాడితే మళ్లీ అధికారంలోకి రావడం చాలా చిన్న విషయం. ఇప్పుడు కాకుంటే ఇంకో నాలుగు రోజులకైనా కచ్చితంగా వచ్చే అవకాశం ఉన్న అధికారం కోసం ఎవ్వరైనా కొట్లాడుతారు. కానీ, ఎప్పుడొస్తదో తెల్వని ఒక రాష్ట్రం కోసం, అసలు వస్తదో లేదో కూడా తెల్వని రాష్ట్రం కోసం, ఎంతకాలం కొట్లాడాలో కూడా తెల్వని లక్ష్యం కోసం, తెగించి నిలబడి కొట్లాడాలంటే మాత్రం అతను కేవలం నాయకుడు ఐతే సరిపోదు, ఒక మహా నాయకుడు అయ్యుండాలి. లక్ష్యం కోసం పదవులను మాత్రమే కాదు, తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టగలిగే దమ్మున్న యోధులు మాత్రమే తాము పెట్టుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. అలాంటి అసాధ్యమైన లక్ష్యమే తెలంగాణ, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన యోధుడే కేసీఆర్.
ఆనాడు పదవులు వదులుకోవటానికే భయపడి పారిపోయినోళ్లంతా తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి కొట్లాడిన కేసీఆర్‌ను పట్టుకుని ఒక్క ఓటమితో అతని పనయిపోయిందని మాట్లాడుతున్నారు. ఆ రోజు ‘జై తెలంగాణ’ అని నినదించడానికే భయపడి చచ్చినోళ్లు, ఆ తెలంగాణ రాష్ర్టాన్నే సాధించిన కేసీఆర్ కొట్లాడే శక్తిని అవహేళన చేస్తున్నారు. ఈ దేశపు మ్యాప్‌లోనే లేని రాష్ర్టాన్ని తెచ్చిన వ్యక్తి కేసీఆర్. అలాంటి కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేస్తామని బహిరంగంగా చెప్తున్నారు.
మీరంతా పదవుల కోసం కొట్లాడేటోళ్లయితే, అతను కొట్లాడటం కోసమే పదవులు వదులుకున్న నాయకుడు. అలాంటి మనిషి ఒక్కసారి పదవి పోతే నిరాశపడుతడా? ఒక్కడు కూడా లేనినాడే ఆయన ఒక్కడే ఈ రాష్ట్రం కోసం పిడికిలెత్తిండు, ఆ పిడికిలి నీడలో కొన్ని లక్షల పిడికిళ్లు, కోటి గొంతుకలై గర్జిస్తే ఒక రాష్ట్రమే వచ్చింది. ఒక్కడిగా మొదలై ఆకాశమంత ఎదిగిన మనిషి నుంచి నలుగురిని లాక్కుంటే అతను బలహీనపడిపోతాడని ఎలా అనుకుంటున్నారు? అతనికి ప్రతిపక్షం కొత్త కాదు, కొట్లాడటం కొత్త కాదు, ఒక్కడిగా మొదలైన కేసీఆర్‌తోనే ఈ రాష్ట్రం వచ్చింది. అది కూడా కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండి కొట్లాడినపుడే ఈ రాష్ట్రం వచ్చింది. అందుకే సమూహంగా ఉండే కేసీఆర్ కంటే, ఒక్కడిగా ఉండే కేసీఆర్ చాలా శక్తిమంతుడు. అధికారంలో ఉండే కేసీఆర్ కంటే, ప్రతిపక్షంలో ఉండే కేసీఆర్ చాలా బలవంతుడు. మహా సముద్రాలను అవలీలగా ఈదుకుంటూ వచ్చిన కేసీఆర్ ముంగట పిల్ల కాలువలు తొడకొడుతూ అతని పని ఖతం చేస్తామంటుంటే ఎలా నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి.
40 వేల చెరువులను నింపిన ఒక మహా ఆత్మైస్థెర్యాన్ని, ఈ చెరువులను మూడు నెలల్లోనే ఎండగొట్టిన వాళ్లు బద్దలుకొడుతాం అంటుంటే నవ్వురాకపోతే ఇంకేం వొస్తుంది? ముగ్గురు ముఖ్యమంత్రులు మారితే తప్ప ఒక్క ప్రాజెక్టును పూర్తిచేయటం చాతకానివాళ్లు, కేవలం మూడే మూడేండ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించి, మొత్తం తెలంగాణ రాష్ర్టాన్ని పచ్చని మాగాణంగా మార్చి, దేశంలోనే వరి ఎక్కువగా పండించే రెండో రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేసీఆర్ సంకల్పాన్ని వీళ్లు చెదరగొడుతాం అంటుంటే కామెడీ కాకపోతే ఇంకేం అవుతుంది?
కుంగిపోయిన రెండు పిల్లర్లను బూచిగా చూపెట్టి మొత్తం కాళేశ్వరమే ఒక వృథా ప్రాజెక్టు అని బురదజల్లిన వీళ్లు, అదే కేసీఆర్ రైతుల దగ్గరికి వస్తున్నాడని తెలియగానే రాత్రికి రాత్రి అదే కాళేశ్వరం నీళ్లను దొంగచాటుగా ఎత్తిపోస్తున్న వీళ్లు కేసీఆర్‌ను మానసికంగా క్రుంగిపోయేలా చేస్తామంటుంటే ఎవరైనా పగలబడి నవ్వకుండా ఎలా ఉంటారు? లక్షల కిలోమీటర్ల పైప్‌లైన్‌తో ఇంటింటికీ నీళ్లిచ్చి రోడ్ల మీద ఒక్క బిందె కూడా కనపడకుండా చేసిన కేసీఆర్ ధైర్యాన్ని, మూడే మూడు నెలల్లో ట్యాంకర్లు కొనుక్కునే స్థాయికి దిగజార్చిన వాళ్లు చెదరగొడుదామని సవాళ్లు విసురుతుంటే వీళ్ల హాస్య చతురతను మెచ్చుకోకుండా ఎలా ఉండగలం? దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటల కరెంటు ఇచ్చిన ఉక్కు సంకల్పం కేసీఆర్ అయితే, మూడు నెలల్లోనే కరెంట్ కోతలతో మళ్లా జనరేటర్ల కాలం తెచ్చిన తుక్కు సంకల్పం వీళ్లది.
కేసీఆర్‌ను ఆపటం వీళ్లతోని ఐతదా? 11 సార్లు సరిగ్గా దున్నకాల టైంకి టంగ్టంగ్మని రైతుబంధు వేసిన కమిటెడ్ లీడర్ కేసీఆర్ అయితే, ఒక్క రైతుబంధు కూడా సక్కగ ఇయ్యకుండా కథలుపడ్తున్న వీళ్లు కేసీఆర్ పని ఖతం చేస్తారా? ఇంటికి పెద్ద దిక్కు ఐన రైతు కూలిపోతే దినవారం లోపు రూ.5 ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడిన పెద్ద దిక్కు కేసీఆర్ ఐతే, అసలు రైతుబీమా ముచ్చట కూడా ఎత్తకుండా, రైతు ఆత్మహత్యల కాలం మళ్లా తెచ్చిందే కాక, ఆ ఆత్మహత్యలను హేళన చేస్తున్న వీళ్లు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారా? అరువై ఏండ్లుగా నల్లగొండకు మంచినీళ్లు ఇవ్వలేకపోయిన వాళ్లు, ఫ్లోరైడ్ బండని బద్దలుకొట్టి శాశ్వతంగా మంచినీటి సమస్యను పరిష్కరించిన కేసీఆర్ చరిత్రను చెరిపేస్తామంటే ఆ బండరాళ్లు సైతం పగలబడి నవ్వుతాయి. అద్దంలా మెరిసిపోతున్న పల్లెటూర్లు, మండుటెండల్లో అలుగులు దుంకుతున్న చెరువులు, గొర్రెలు, చేపలు, ఈత వనాలతో మళ్లీ ప్రాణం పోసుకున్న కులవృత్తులు, గురుకులాలు, మెడికల్ కాలేజీలు, ఐటీ హబ్‌లు, పెట్టుబడులు, మారుమూల ఊర్లల్లో సైతం కోట్లల్లో పెరిగిన భూముల ధరలు, పెరిగిన సాగు, పెరిగిన పంట విస్తీర్ణం, పెరిగిన భూగర్భ జలాలు, పెరిగిన తలసరి ఆదాయం, తగ్గిపోయిన వలసలు, బాల్య వివాహాలు, మాతా శిశు మరణాలు, తగ్గిపోయిన పేదరికం.. ఇవన్నీ కండ్లముందే ఉన్న నిజాలు. ఇట్లా చెప్పుకొంటూ పోతే సవాలక్ష అద్భుతాలు..
మీరు 60 ఏండ్లలో సాధించలేకపోయిన రాష్ర్టాన్ని ఒక వ్యక్తి కేవలం పద్నాలుగేండ్లలోనే సాధించాడు. అంటే మీరు 60 ఏండ్లలో చేయలేకపోయిన అభివృద్ధిని అతను కేవలం తొమ్మిదిన్నరేండ్లలోనే నిజం చేసి చూపెట్టిండు. అంటే, ఆ మనిషి సంకల్పం ఎంత గొప్పదో మీకు అర్థం అయ్యుండాలి. ఆ మనిషి ఆత్మస్థయిర్యాన్ని ఆ దేవుడు కూడా తగ్గించలేడనే విషయాన్ని మీరు బుర్రలోకి ఎక్కించుకుని ఉండాలి. కేవలం ఒక్క శాతం ఓట్లతోనే కేసీఆర్ ఓడిపోయిండనే నిజం మీ మైండ్లోకి ఎక్కించుకోవాలి. ఇదంతా ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని సంక్షేమం ప్రతీ ఇంటికీ అద్భుతంగా అందుతున్నా, దేశంలో ఎక్కడా కనిపించని అభివృద్ధి తెలంగాణలో కండ్లముందే కనిపిస్తున్నా, జనాలు మీరు ప్రచారం చేసిన అబద్ధాలను నమ్మిన్రు. మీరు ఇచ్చిన హామీలను నమ్మిన్రు.
కానీ, మీ మాటలు అన్నీ అబద్ధాలే అనీ, మీరు చేసిందంతా మాయేననే విషయం జనాలకు అర్థం కావటానికి ఎంతో టైం పట్టదు. ఇయ్యాళ ఎండిపోతున్న ప్రతీ పొలం, ఆడుగంటిపోతున్న ప్రతీ చెరువు మళ్లీ కేసీఆర్‌ను జనాలకు గుర్తుచేస్తాయి. ఎండకాలం రాకముందే మొదలైన కరెంటు కోతలు, 24 గంటలు కరెంటు ఇచ్చిన కేసీఆర్‌ను మళ్లీ గుర్తుచేస్తాయి. ఇలా మీరు తప్పే ప్రతీ మాటా, మాట ఇవ్వకపోయినా ఎన్నో పథకాలు ఇచ్చిన కేసీఆర్‌ను చాలా బలంగా జనాలకు గుర్తు చేస్తాయి. ఇలా మీరు వేసే ప్రతీ తప్పటడుగూ, మీ అసమర్థత, మీరు చేసే తప్పులు, ఇవన్నీ కేసీఆర్ మీద జనాల్లో మీరు సృష్టించిన భ్రమలను తొలగించి వాళ్లకు నిజాలను చూపిస్తాయి. అందుకే మీరు కేసీఆర్‌నో, అతని పార్టీనో ఖతం చేసే పనులు మానేశి, మీరిచ్చిన హామీలు నెరవేర్చడం మీద మాత్రమే దృష్టిపెట్టడం మంచిది.
నాలుగు పిట్టలు ఎగిరిపోతే, ఒక మహావృక్షం కూలిపోతదా? నాలుగు కొమ్మలు విరిగిపోతే, అడవి అంతం ఐపోతదా? ఆయన తెచ్చిన రాష్ర్టానికి మీలాంటి ముఖ్యమంత్రులు వస్తారు, పోతారు. కానీ, ఆయన ఆకాశం, తెలంగాణ ఉన్నంతవరకూ ఉంటాడు. నలుగుర్ని గుంజుకుంటే అతని పని ఐపోతదనుకుంటే అది మీ మూర్ఖత్వమే అవుతుంది. ఈ రాష్ర్టాన్నే తయారుచేసిన నాయకుడు అతను. లీడర్లను తయారుచేయడం అతనికి పెద్ద విషయం కాదు. అతను కింద పడ్డాడని మీరు హేళన చేస్తున్నారు. కానీ, మీకు అర్థం కాని విషయం ఏమంటే అతను రెండు కాళ్ల మీద నిలబడి కొట్లాడినపుడే ఈ రాష్ట్రం తెచ్చిండు. అతను ఇప్పుడు మూడు కాళ్ల కేసీఆర్, ఇప్పుడు తెలంగాణ ఆగం కాకుండా ఉండటం కోసం మూడు కాళ్ల మీద నిలబడి కొట్లాడుతున్నాడు.
కేసీఆర్ ఆలోచనలు, కేసీఆర్ తెలివి, అతని వ్యూహాలు, అతని సంకల్పం, అతని శక్తి… ఇవి తెలిసినవాళ్లెవరూ కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసే ఆలోచన కలలో కూడా చెయ్యరు. తెలంగాణ అనేది మీకు రాష్ట్రం మాత్రమే కావొచ్చు, కానీ, తెలంగాణ అనేది కేసీఆర్ ప్రాణం. తెలంగాణ తెచ్చుడు కోసమే కాదు, ఆ తెలంగాణ ఆగం కాకుండా ఉండటం కోసం సైతం తన ప్రాణం పెట్టి కొట్లాడటం కేసీఆర్‌కు ఉద్యమం నేర్పిన విద్య. ఇందులో ఏ మాత్రం సంశయం అక్కర్లేదు.
-ఇంగ్లీష్ రమేశ్
90630 92644