దేశ సమస్యలకు కారణం ఉద్యోగులా?
ఎన్పీఎస్ (నూతన జాతీయ పెన్షన్ విధానం) ప్రపంచ బ్యాంకు రచించిన పెన్షన్ సంస్కరణల్లో భాగంగా వచ్చిన పథకం. దీన్ని భుజాన వేసుకుని మోయడానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ 9-10-2026 నాటి ఆంధ్రజ్యోతి పత్రికలో శాయశక్తులా ప్రయత్నం చేశారు.
ఎన్పీఎస్ (నూతన జాతీయ పెన్షన్ విధానం) ప్రపంచ బ్యాంకు రచించిన పెన్షన్ సంస్కరణల్లో భాగంగా వచ్చిన పథకం. దీన్ని భుజాన వేసుకుని మోయడానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ 9-10-2026 నాటి ఆంధ్రజ్యోతి పత్రికలో శాయశక్తులా ప్రయత్నం చేశారు. అందులో భాగంగా పరిపాలన, విద్యారంగం వంటి అంశాలను కూడా చర్చించారు. కానీ ఎన్పీఎస్ ద్వారా ఉద్యోగులకు వచ్చే లాభమేందో చెప్పలేదు. ఓపీఎస్ పునరుద్ధరించాలన్న డిమాండ్ మొత్తం సమాజ సమస్యగా చిత్రీకరించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. విషయాన్ని పక్కదారి పట్టించడానికి కృషి చేసినట్టు తెలుస్తున్నది. ఉద్యోగ విరమణ తర్వాత చెల్లించాల్సిన ప్రయోజనాలకు, ఓపీఎస్ అమలు చేయాలనే డిమాండ్‌కు, ప్రజా సమస్యలకు సంబంధమేందో జేపీకే తెలియాలి.
2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు దేశంలోనే అత్యంత మిగులు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని జేపీ తన వ్యాసంలో పేర్కొన్నారు. ఈ పదేండ్ల కాలంలో ప్రభుత్వం ఖర్చులకు కూడా కష్టపడుతున్నది అని చెప్పుకొచ్చారు. ఆయన వాదన ప్రకారం 2004లోనే ఓపీఎస్ అమలు చేసిన తర్వాత ప్రభుత్వ పరిస్థితి మరింత మెరుగ్గా మారాలి కదా! ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారింది? పైగా ఖర్చులకు వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి రావడానికి ఉద్యోగులే కారణమనే విధంగా రాశారు. ఈ 12 ఏండ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థతో సంబంధం లేకుండా దుబారా చేసిన విషయం, అనుత్పాదక వ్యయాలు, వ్యవస్థలోని అవినీతి వల్ల ప్రజాధనంపై ఎంత ప్రభావం పడుతున్నదనే విషయం జేపీ చెప్పలేదు. ఉద్యోగులు కనీస ప్రమాణాలతో కూడిన జీవితాన్ని గడపడానికి కావలసిన వేతనాలు అందించాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ, యునెస్కో లాంటి సంస్థల సిఫారసులకు అనుగుణంగా వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఆ విషయాన్ని విస్మరించి సమస్త ఆర్థిక ఇబ్బందులకు ఉద్యోగుల కోరికలే కారణమన్నట్టుగా జేపీ వాదించారు. ఎన్పీఎస్ ద్వారా సీపీఎస్‌లో పెట్టుబడి పెట్టిన డబ్బు ఎక్కడికీ పోదని, ఉద్యోగి చనిపోతే కుటుంబ సభ్యులకు వెళ్తుందని అన్నారు. కానీ రిటైరైన ఎన్పీఎస్ ఉద్యోగుల పరిస్థితి భిన్నంగా ఉన్నది. వారికి రూ.1,000-రూ.1,500 మాత్రమే పెన్షన్‌గా వస్తున్నది.
ప్రైవేట్ పెట్టుబడిదారుల ద్వారా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి తద్వారా వచ్చే గ్యారెంటీ లేని లాభాల నుంచి పెన్షన్ చెల్లించడమే ‘నూతన పెన్షన్ విధానం’. ఈ విధానానికి మద్దతు పలకడం అంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి ప్రతినెలా చందాగా వసూలు అయ్యే నిధులను ప్రైవేట్ పెట్టుబడిదారులకు ధారాదత్తం చేయడాన్ని సమర్థించడమే. అంతేకాదు ఈ వాస్తవాలను భయాలుగా చెప్తూ, అందుకు పరిష్కారంగా ‘యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్’ తెచ్చారంటూ పెట్టుబడిదారీ శక్తులకు జేపీ మద్దతు పలికారు.
ఓపీఎస్ విధానం ద్వారా పెన్షన్ చెల్లిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా తీస్తుందన్న పెద్దమనిషి, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌లో 50% వేతనాన్ని గ్యారెంటీగా పెన్షన్‌గా చెల్లిస్తే ఆర్థిక పరిస్థితి తలకిందులు కాదా? మరి దాన్ని ఎట్లా సమర్థిస్తారు? పైగా తెలంగాణలో ఓపీఎస్ పునరుద్ధరించకుండా యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని అమలు చేయాలంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. రాష్ట్రంలో పరిపాలన సంతృప్తికరంగా లేకపోవడానికి, పాఠశాల విద్య దిగజారడానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓపీఎస్‌ను కోరడమే కారణమని చెప్పడానికి జేపీ తీవ్రంగా ప్రయత్నించినట్టు కనిపిస్తున్నది.
సామాన్య ప్రజల పన్నులపై మొసలి కన్నీరు కార్చే జేపీకి దేశాధినేతలు గుప్పెడు మంది పెట్టుబడిదారులైన 43 కార్పొరేట్ కంపెనీలకు రద్దు చేసిన రూ.3.53 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు, లా ట్రిబ్యునల్ రద్దు చేసిన వేల కోట్ల రుణాలు కనిపించలేదా? కార్పొరేట్ సంస్థలకు ఏటా మాఫీ చేసే పన్నుల రాయితీలు చూడటంలేదా?
కాంట్రాక్టు పద్ధతుల్లో ఉద్యోగుల నియామకాల ద్వారా ఉద్యోగభద్రత లేకుండా పోయింది. టైమ్ స్కేల్ లేకుండా, పెన్షన్‌లేని పరిస్థితులను ప్రభుత్వాలు సృష్టిస్తున్నాయి. ఇటువంటి పరిణామాలను సూచించకుండా తెలివిగా ఉద్యోగులంతా ప్రభుత్వాల ఖజానాలోని సొమ్మును కాజేసే దొంగలు అన్నట్టుగా జేపీ చిత్రీకరిస్తున్నారు. నిజానికి నిత్యావసర ధరలు పెరుగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదే! ఆ బాధ్యత సక్రమంగా నిర్వహించలేని పరిస్థితుల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు సవరించాలనే డిమాండ్లు ఉద్యోగుల నుంచి సహజంగానే వస్తాయి. దాన్ని తప్పు అని జేపీ వాదిస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు పెంచితే, ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తే ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థ నడుము విరుగుతుందా? ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అనుత్పాదక ప్రాజెక్టులు, అనవసర ఖర్చులు, అవినీతి వల్ల నడుము విరుగదా? ఇవన్నీ కూడా జేపీ చర్చించాలి కదా! మరి ఈ విషయాల్ని జేపీ ఎందుకు తెలివిగా దాటవేశారు? పాలనలో ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేది ఉద్యోగులే అయినప్పటికీ, కావలసిన ప్రణాళికలు రచించడం, అందుకు కావలసిన నిధులను, మౌలిక సదుపాయాలను సమకూర్చడం ప్రభుత్వ బాధ్యత. ఇవేవీ లేకుండా అన్ని అవకతవకలకు ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లే కారణం అన్నట్టు జేపీ వాదించారు. దేశంలో, రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులకు, విధానాల అవకతవకలకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేస్తున్న డిమాండ్లే కారణమన్నట్టు జేపీ తన వ్యాసంలో వాదించారు.
అమెరికా, ఫ్రాన్స్ లాంటి పాశ్చాత్య దేశాల విధానాలు, అక్కడ ఉద్యోగులకు చెల్లించే పెన్షన్ల గురించి జేపీ వ్యాసంలో ప్రస్తావించారు. అయితే అక్కడ మొత్తంగా ప్రైవేట్ పెట్టుబడిదారుల ఉద్యోగులు ఉంటారని, వారికి ప్రైవేట్ సంస్థలే పెన్షన్లు చెల్లిస్తాయనే విషయం ఆయనకు తెలియదని అనుకోవడంలేదు. మౌలిక విధానాల గురించి గందరగోళపరిచే విధంగా ప్రజలను జేపీ పక్కదారి పట్టిస్తున్నారు.
సామాన్య ప్రజల పన్నులపై మొసలి కన్నీరు కార్చే జేపీకి దేశాధినేతలు గుప్పెడు మంది పెట్టుబడిదారులైన 43 కార్పొరేట్ కంపెనీలకు రద్దు చేసిన రూ.3.53 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు, లా ట్రిబ్యునల్ రద్దు చేసిన వేల కోట్ల రుణాలు కనిపించలేదా? కార్పొరేట్ సంస్థలకు ఏటా మాఫీ చేసే పన్నుల రాయితీలు చూడటంలేదా? ఇదంతా ఏ ఆర్థిక వ్యవస్థ మేలు కోసమని జేపీ భావిస్తున్నారు? జేపీతోపాటు అలా ఆలోచించేవారు, ప్రజల సంక్షేమం గురించి, ప్రజల సంక్షేమం గురించి పని చేస్తున్న ఉద్యోగుల గురించి ఆలోచించాలని ఆశిద్దాం!
(వ్యాసకర్త: విద్యారంగ నిపుణుడు)
కె.వేణుగోపాల్
98665 14577
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

