ఏ వాణిజ్య, వ్యాపార సంస్థ అయినా తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడానికి ఆర్థిక, మానవ వనరులు అవసరం. స్టార్టప్‌లకూ అంతే. అయితే ఈ స్టార్టప్‌లకు మూలధనం ఎఫ్ఎఫ్ఎఫ్ (ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫూల్స్), ఏంజెల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్స్, గ్రోత్ క్యాపిటల్స్, ఐపీఓల రూపంలో వివిద దశల్లో చేకూరుతుంది.
గత దశాబ్దకాలంలో ఎన్నో పేరొందిన యూనికార్న్ స్టార్టప్‌లు తమకు కావలసిన విత్త పెట్టుబడి, వృద్ధి మూలధనాన్ని చైనా, హాంకాంగ్, జపాన్, యూఎస్ఏతో పాటుగా మన దేశీయ వెంచర్ క్యాపిటలిస్ట్స్ సంస్థల నుంచి పెద్ద మొత్తంలో సమకూర్చుకొన్నాయి. అయితే నేడు చైనా, హాంకాంగ్, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఆర్థికమాంద్యం వచ్చే సంభావ్యత నూటికి ఇరవై శాతానికి మించి ఉండటం వల్ల నేడు స్టార్టప్‌లకు ఆర్థిక వనరుల సముపార్జన క్లిష్టతరంగా మారింది. పర్యవసానంగా స్టార్టప్స్‌కు మూలధనం అందుబాటులో లేక వ్యాపార నిర్వహణ ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ రేటు గణనీయంగా పెరగడం వల్ల ఆర్థిక వనరుల లభ్యత స్టార్టప్‌లకు అందని ద్రాక్షగా మారింది.
అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్య భయాలు దేశీయ స్టార్టప్‌లపై అమాంతంగా ఒత్తిడి పెంచేశాయి. వాటిని ఎంఏ (మెర్జర్స్, అక్విజిషన్స్) వైపుగా పయనింపజేస్తున్నాయి. ఈ పరిణామం స్టార్టప్‌లలో పనిచేసే మానవ వనరుల ఉద్వాసనకు కూడా దారితీస్తుంది. ఇలాంటి కీలక సమయంలో, ఆర్థికపర అడ్డంకుల మూలంగా స్టార్టప్‌లు మంచి నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఉద్యోగాల్లో నియమించుకోలేక, ఉన్నవారిని కొనసాగించలేక నానా తంటాలు పడాల్సి వస్తున్నది. కానీ కొన్ని పేరొందిన స్టార్టప్‌లు ఈ గడ్డుకాలంలోనూ ఉద్యోగులకు జీతభత్యాలను స్టాక్ ఆప్షన్స్ రూపంలో ఇవ్వజూపే ప్రయత్నం చేస్తున్నాయి. అంతేకాకుండా గత రెండేండ్లుగా ఉద్యోగులు ఇంటినుంచే పనికి అలవాటు పడిపోయి, నేడు హైబ్రిడ్ విధానంలో పనిచేయటానికి అలవాటు పడుతున్నారు. కానీ వర్క్ ఫ్రం ఆఫీస్ అనగానే ఉద్యోగులు ఆఫీసుల వైపు మొహం చాటేస్తున్నారు. ఈ తరహా విధి నిర్వహణాపరమైన అంశాల వల్ల నైపుణ్యం కలిగిన మానవ వనరులను స్టార్టప్‌లు అతి క్లిష్ట సమయంలో కోల్పోయే ఆస్కారం లేకపోలేదు.
స్టార్టప్‌ల ఫౌండర్లు యువకులు. వారికి ఎలాంటి వ్యాపార నేపథ్యం లేకపోవడం వల్ల వ్యాపార కార్యకలాపాల్లో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వీరికి అనుభవ మెంటార్స్ చేయూత అవసరం. గత రెండేండ్లలో స్టార్టప్‌ల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. అయితే వీటిలో చాలావరకు ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు సభ్యులతో యజమానులుగా, వారే ఉద్యోగులుగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఈ తరహా స్టార్టప్‌ల పరిస్థితి ఏ విధంగా ఉండబోతున్నదో వేచి చూడాలి.
ఈ కీలక సమయంలో స్టార్టప్‌లు వ్యయ నియంత్రణను కొనసాగిస్తూ నగదు నిల్వలను కాపాడుకోవాలి. వ్యాపార నిర్వహణ నిర్విరామంగా కొనసాగించే ప్రయత్నం చేయాలి. మారుతున్న కొనుగోలు ధోరణులను త్వరితగతిన పసిగడుతూ అమ్మకాల వ్యూహాలను మారుస్తుండాలి. అలాగే వినియోగదారులను తగ్గకుండా చూసుకోవాలి. సంస్థకు అవసరమైన సాంకేతికతను సాధ్యమైనంత మేర అద్దె ప్రాతిపదికన పొందాలి. క్లిష్ట పరిస్థితుల్లో వచ్చే సవాళ్ళను అవకాశాలుగా మార్చుకొని అడుగులు వేయాలి. వ్యాపార చక్రాలు కాలానుగుణంగా పైకి లేస్తూ, కిందకు పడిపోతుంటాయి. కాబట్టి స్టార్టప్‌లు తమ సృజనాత్మక ఆలోచనలను ఎప్పటికప్పడు కొనసాగిస్తూ నవకల్పనలను సృష్టిస్తూ నిలదొక్కుకోవాలి.
(వ్యాసకర్త: ప్రోగ్రాం హెడ్, పీజీడీఎం-బీఎఫ్ఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, హైదరాబాద్)
డాక్టర్ మైలవరం
చంద్రశేఖర్ గౌడ్
81870 56918