ఉరుమురిమిన ఆకాశం మెరుపు కరవాలంతో
మబ్బులను వెంటేసుకొని బయల్దేరింది
చేసేది దండయాత్ర కాదు ధర్మాగ్రహ యాత్ర
విజయలక్ష్మిని వరించే ఆశల జాతర
ఇంట గెలిచిన కోడి ఊరంతా మేల్కొల్పడానికి
కూత మొదలుపెట్టింది అందర్నీ కలగలుపుకొంటూ
సమూహాలు కదిలివస్తాయన్న ధీమాతో
పాములెన్ని కాపేసినా నిచ్చెనలెక్కిన అనుభవంతో
సింహం సింగిల్గానే ముందుండి నడిపిస్తది
మతం మదమెక్కిన ఏనుగుది ఘీంకారం
భయోత్పాతం సృష్టించే పద ఘట్టనలు
నక్కల గుంపునకు నాయకత్వం
కార్పొరేట్ పందికొక్కులతో సహవాసం
సత్తెపూసలు, సుద్దపూసలు లేని రాజకీయంలో
అభిమన్యుడెవరో, అర్జునుడెవరో, కర్ణుడెవరో
రథం నడిపించే సూత్రధారి దిగాడు రంగంలోకి
బలం, బలగం తేల్చేది భవిష్యత్తే
లక్ష్యాన్ని ఛేదించే దిశగా ఆశాజీవి నడక
కొండను ఢీకొంటే పొట్టేలు కొమ్ములిరుగుతాయి సరే
చీమలు కలిసుంటే కొండచిలువనైనా చంపేస్తాయి
చిన్న ఎలుకలే ఎంత కొండకైనా కన్నమేస్తాయి
కోట ముట్టడికి దారికనిపెడ్తాయి
జెండా ఎగరేసి జాతీయగీతం ఆలపిస్తాయి
కొమురవెల్లి అంజయ్య
98480 05676