కాకతీయ చక్రవర్తులలో చివరి రాజుగా ప్రశస్తి పొందినవాడు ప్రతాపరుద్ర మహారాజు. ఇతడు కాకతి రుద్రమ మనుమడు. రుద్రమ, గణపతిదేవచక్రవర్తి అడుగుజాడల్లోనే ప్రతాపరుద్రుడు కూడా తన శౌర్య ప్రతాపాలతో కాకతీయ సామ్రాజ్యాన్ని రక్షించి, నిరంతరం శత్రురాజులతో యుద్ధాలు సలుపుతూ చివరకు ఢిల్లీ సుల్తానుల చేతుల్లో పరాజితుడైనాడు. ఇతని కాలంలో అనేక శాసనాలు వేయించారు. అందులో ఒకటి నల్లగొండ జిల్లా, రామన్నపేట కు సమీపంలోని దుప్పల్లిలో ఉన్నది. శాసన కాలం శ.సం.1228 = క్రీ.శ. 1306, పరాభవ సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి.
కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి పాలనా కాలంలో బొల్లమరాజు ఒక పాలు, రంగ య రుద్రదేవులు మూడు పాళ్ళుగా దుప్పల్లి నాయంకరాన్ని 1:3 గా పరిపాలిస్తున్నారు. వారిద్దరు అష్టాదశ ప్రజల సమక్షంలో దుప్పల్లిలోని కాశ్మీరదేవుని రంగభోగానికి రెండు కార్లు పండే భూమిని సర్వమాన్యంగా సమర్పించినారు. ఈ భూమి సబ్బి సముద్రము వెనక నేరడ్ల చేను లో ముయ్యడ్డ (మూడు అర్ధలు), నాగుల తూములో కుట్రుచేనులో 1 మర్తురు, నారాయణదేవర చెరువు వెనుక తామ ర పడెచేనులో ముయ్యడ్డలు మొత్తం నాలుగు మర్తురుల భూమిని స్వామికి సమర్పించినారు.
ఇంకా వీరు కొంత నగదు రూపంలో కూడా ద్రవ్యాన్ని స్వామి కైంకర్యాలకు సమర్పించినారు. ప్రతి మాడకు పాతిక వంతు సమర్పించాలి. దీనికి గాను ప్రతి గ్రామంలో సాలుసరి ఆదాయంలో ప్రతి మాడకు 1 1/4 వంతు చిన్నము వసూలు చేసి సమర్పించేవారు. గ్రామస్థులు ఈ పన్నులను ఎవరిదైతే నాయంకరం వంతు వస్తుందో వారికి చెల్లించేవారు. ఈ దానానికి ఎవరు విఘ్నం కలిగించినా కూడా గంగాతీరంలో ఆవులను పొడిచిన దోషం పొందుతారు. అదేవిధంగా మరిన్ని దైవద్రోహాలు, సమయ ద్రోహాలు (పరస్పర అంగీకారంతో చేసుకున్న ఒప్పందాలను ఉల్లఘించడం) చేసినవారగుదురు.ఇంకా నాయంకరం లోని సమస్త ప్రజలు భండాలలో (అమ్మకం జరిగే దుకాణాలు / ప్రదేశాలు) కొనే అన్ని వస్తువులకు మాడకు వీస చొప్పున స్వామి దీపాలకై సమర్పించినారు. ఇది పాటించనివారు శివాలయమును భిన్నం చేసిన పాపం పొందుతారని చెప్పబడింది.
ఈవిధంగా నాయంకరంలో దేవునికి సమర్పించే దానానికి ఆ నాయంకరంలోని సమస్త ప్రజలు అనుమతి తీసుకునేవారని, వారు కూడా దేవుని భోగానికి, ధూప దీప నైవేద్యాలకు తమ ఆదాయంలో కొంత భాగాన్ని సమర్పించేవారని తెలుస్తున్నది.
-భిన్నూరి మనోహరి