పల్లవి: వేష భాష యాసలతో వెలుగొందిన ప్రాంతము
కట్టు బొట్టు పట్టులతో కట్టేసిన అందము
హరిత చరిత ఘనతలతో విరబూసిన చందము
ఆంధ్ర వలస పాలనలో వెనుకబడిన వైనము
చరణం: బతుకమ్మ ఆటల్లో కలగలిసిన బతుకులు
జానపదుల పాటల్లో జతకలిసిన మెతుకులు
కోలాటమాటలతో కోటొక్క విందులు
పీరీల పండుగకు దరువేసిన చిందులు
చరణం: వీధి వీధిన ఆడిన వీధి బాగోతం
మన గోడును మన గొడవను వినిపించిన భారతం
బుర్రలను శుద్ధి చేసే బుర్రకథల సారము
చిందు బాగోతులు చిందేసిన వీరము
చరణం: సాహిత్యపు తోటలో విరబూసిన పువ్వులు
పోతన్న సోమన్న కాళన్నల కవితలు
గొంతెత్తి పాడగా తెలగాణ మాగాణ
దాశరథి నేర్పుతో మోగించే మదివీణ
చరణం: దశాబ్దాల కలల కోసం కలబడిన పోరాటం
సకల జనుల సమ్మెతో నినదించిన ఆరాటం
మా పాలన మాకంటూ గొంతెత్తిన జనము
అమరుల త్యాగాలతో అవతరించె రాష్ట్రము
చరణం: అగ్రగామిగా నిలిచి అలరించెను పనులను
ఆదర్శమైన పాలనతో ఆదరించె జనులను
సంక్షేమ పథకాలతో సాధించెను ప్రగతిని
అభివృద్ధి ఫలాలతో మెప్పించెను జగతిని
– గంగాపురం శ్రీనివాస్, 96763 05949