‘కొండను తవ్వి ఎలుకను పట్టుకున్న’ చందంగా ఉన్నది రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ తీరు. ‘ఫార్ములా-ఈ’ కార్ రేస్‌లో అవినీతి జరిగిందంటూ ఏడాది నుంచి వెతికి వెతికి మరీ ‘చెయ్యి’ కాల్చుకున్నది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను ఏదో ఒక రకంగా జైలుకు పంపాలనే ఫ్రస్టేషన్‌తో ఉన్న ప్రభుత్వం ‘అడవికి కట్టెలు మోసినట్టు’ పసలేని అంశాన్ని భుజానికెత్తుకొని అభాసుపాలయ్యే చర్యలు చేపట్టింది. నిజానికి గడిచిన ఏడాది కాలాన్ని రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ సరిగ్గా ఉపయోగించుకొని ఉంటే, ఇటీవల ముగిసిన మహారాష్ట్ర ఎన్నికల్లోనే కాదు, జాతీయస్థాయిలో కాంగ్రెస్ అధిష్ఠానం చేస్తున్న ‘మార్పు’ నినాదం భవిష్యత్తుకు బాటలు చూపేది. కానీ, దుందుడుకుతనం, వెగటు మాటలు, అనవసర చర్యలతో చారిత్రక అవకాశాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేజేతులా పాడుచేసుకున్నది. ఫలితంగా ఏడాది కాలంలోనే ఎనలేని వ్యతిరేకతను మూటగట్టుకున్నది.
ఇప్పుడు రాష్ట్ర నలుమూలలా కాంగ్రెస్, రేవంత్‌రెడ్డి పేరెత్తితేనే ప్రజలు రాయలేని భాషలో తిడుతున్నారు. రైతులు, యువకులు, మహిళలు, బలహీన వర్గాలు, దళితులు తదితర వర్గాల్లో సర్కార్‌పై సన్నగిల్లిన విశ్వాసానికి సంబంధించిన సమాచారం, ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారానో లేదా సర్వే సంస్థలు, మీడియా వర్గాల ద్వారానో ముఖ్యమంత్రి చెవిలో పడకుండా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏడాది నిండాకైనా నింపాదిగా ఆలోచించి, ప్రభుత్వానికి పరువు నష్టం కలిగించిన పాలనా చర్యలపై ఆత్మవిమర్శ చేసుకోవాలి. కానీ, దురదృష్టవశాత్తు సీఎం రేవంత్‌రెడ్డితో సహా మొత్తం మంత్రిమండలి తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్టు మొండిగా వ్యవహరిస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో అమలు జరిగిన పథకాలపై నిత్యం అవినీతి ఆరోపణలకే రేవంత్ రెడ్డి సర్కార్ కాలమంతా ఖర్చు పెడుతుండటం విడ్డూరం. ఇప్పటికే కాళేశ్వరం, విద్యుత్తు ఒప్పందాలపై కమిషన్ల విచారణ పేరిట వితండవాదన వినిపిస్తున్నది చాలదన్నట్టు తాజాగా ‘ఫార్ములా-ఈ’ రేస్‌ను ముందటేసుకున్నది. రాజకీయ ఆయుధంగా ఈ అంశాన్ని వాడేందుకు కాంగ్రెస్ సర్కార్ కాలుదువ్వుతుండటం మేకపోతు గాంభీర్యాన్ని గుర్తుచేస్తున్నది. అంతేకాదు, రాష్ట్రంలోని ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. లగచర్ల, గురుకులాలు తదితర అనేక సమస్యలపైనే కాకుండా, ఆరు గ్యారెంటీల అమలు కోసం కూడా కేటీఆర్ క్రియాశీలకంగా పోరాడుతుండటం, ప్రభుత్వానికి కంటగింపుగా మారిందనే సంగతి పలు సందర్భాల్లో ప్రభుత్వ పెద్దల మాటల వల్ల తేటతెల్లమైపోయింది.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత కంటగింపుగా మారినా, ప్రభుత్వ పెద్దలు మోపే నేరారోపణల్లో కనీస వాస్తవికత ఉండకపోతే, తెలంగాణ సమాజం ఎంత ఈసడించుకుంటుందో ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోతే ఎలా? ప్రభుత్వానికి లక్ష్యంగా మారిన కేటీఆర్‌పై మోపబడిన కేసులను పరిశీలిస్తే, రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దారుణమైన ధోరణులను ప్రవేశపెడుతున్నదో అర్థమైపోతున్నది.
అసలు ప్రభుత్వం ‘ఫార్ములా-ఈ’ రేస్ కేసు విచారణను అవినీతి నిరోధక శాఖకు అప్పగించడమే అవగాహన లోపానికి, కక్షపూరిత దృక్పథానికి అద్దం పడుతున్నది. ఈ మొత్తం ‘ఫార్ములా-ఈ’ రేస్ వ్యవహారంలో కేటీఆర్ గాని, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గాని వ్యక్తిగత ప్రయోజనాలకు నయా పైసా వాడుకోనేలేదనే సత్యం విజ్ఞులెవరికైనా తేలికగానే అర్థమవుతుంది. ‘ఫార్ములా-ఈ’ కార్ రేసింగ్ నిర్వహణ వెనుక నాటి ప్రభుత్వ ఉద్దేశంలో, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రతిష్ఠతో ముడిపడిన లక్ష్యాలు తప్ప ఇతర ఏ విధమైన అవినీతి ఆలోచనలకు ఆస్కారమే లేదు.
వివిధ వర్గాలపై అక్రమ కేసుల నమోదులో రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే అరుదైన రికార్డును నమోదు చేసుకున్నది. చివరికి ప్రధాన విపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై కూడా అన్యాయమైన కేసులు పెట్టే దుస్సాహసానికి ఒడిగడుతుంటే, ప్రజలకు పూర్తి సత్యాలు తెలియాల్సిన అవసరం ఉన్నది. కానీ, కుట్రదారుడికి సత్యాలను ఎదుర్కొనే ధైర్యం ఎక్కడుంటుంది? అందుకే శాసనసభలో అధికార పార్టీ దాడులతో దిగజారి వ్యవహరించింది. పవిత్రమైన చట్టసభలో షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ ఏకంగా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు చెప్పులు చూపించడం కాంగ్రెస్ పార్టీ రౌడీయిజానికి నిలువెత్తు నిదర్శనం.
నిర్వహణ ఉద్దేశంలో పారదర్శక దృష్టి కోణం ఉండబట్టే మొదటి దఫా రేస్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి, ‘గ్రీన్ కో’ అనే ప్రైవేట్ పెట్టుబడిదారీ సంస్థను ఒప్పించి, వారితో రూ.110 కోట్ల ఖర్చు పెట్టించింది.
ప్రభుత్వం అతి తక్కువ ఆర్థిక భారంతో అంతర్జాతీయ స్థాయి ‘ఫార్ములా-ఈ’ రేస్ మొదటి ధఫా ఈవెంట్‌ను, నాటి కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ వేదికగా సమర్థవంతంగా, అత్యద్భుతంగా నిర్వహించింది. దానివల్ల ప్రత్యక్ష, పరోక్ష మార్గాల ద్వారా రాష్ర్టానికి దాదాపు రూ.700 కోట్ల లాభం చేకూరిందని ప్రఖ్యాత నీల్సన్ సర్వే సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. ఆర్థిక ప్రయోజనమే కాదు, విపణి హృదయంలో మన హైదరాబాద్ నగరం కొత్త ప్రఖ్యాతిని పొందింది. దీంట్లో అవినీతి ఎక్కడుంది? దీనిపై విచారణాధికారం ఏసీబీకి ఎక్కడిది? నిజానికి రేస్ నిర్వహణ బాధ్యత మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వమే తీసుకోవాల్సిన పరిస్థితి, తర్వాతి ఏడాది రేస్ నిర్వహణ భాగస్వామ్యం నుంచి ప్రభుత్వం కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే ‘గ్రీన్ కో’ అనే ప్రైవేట్ సంస్థ చేతులెత్తేయడం ద్వారానే ఏర్పడింది.
అయితే, ప్రైవేట్ సంస్థ ఒప్పంద ఉల్లంఘన చేసినట్టు, అంతర్జాతీయ సంస్థ విషయంలో బాధ్యతాయుతంగా నడుచుకునే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించలేదు కదా! పదేండ్ల పాలనలో తెలంగాణ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో దేశానికి తలమానికంగా నిలబెట్టే పాలనా విధానాలు అమలుచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ కార్ రేస్ వ్యవహారంలో వెనకడుగు వేసి, రేవంత్‌రెడ్డి సర్కార్ మాదిరిగా రాష్ర్టానికి పరువునష్టం కలిగించలేదు కదా? అందుకే గ్రీన్ కో తప్పుకున్నా, నాటి సర్కారే అన్నీ తానై రెండో దఫా రేస్‌ను మరింత ఘనంగా నిర్వహించే లక్ష్యంతో నిర్ణయాలు తీసుకున్నది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ చెడిపోరాదనే సదుద్దేశం ఉందేకానీ, మరో సంకుచిత ఆలోచన ఎక్కడుంది? వాస్తవానికి గత ప్రభుత్వం అద్వితీయంగా నిర్వహించిన ‘ఫార్ములా-ఈ’ రేస్‌ను కొనసాగిస్తే, మళ్లీ కేటీఆర్ పేరు ఎక్కడ వినపడుతుందోనని జడిసి, కుట్రపూరితంగా ఎఫ్ఈవోతో జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. దాన్ని దాచి కేటీఆర్‌పై అవినీతి నిరోధక చట్టం-1988 సెక్షన్ 13(1), (ఏ) సెక్షన్13 (2) కింద అభియోగాలు మోపడం రేవంత్‌రెడ్డి సర్కార్
అరాచకానికి నిదర్శనం.
పైగా అల్పబుద్ధితో రెండో దఫా ‘ఫార్ములా-ఈ’ రేస్‌కు మోకాలొడ్డిన హస్తం ప్రభుత్వమే, తెలంగాణకు పేరు తెచ్చిన కేటీఆర్‌పై ఐపీసీ సెక్షన్ 409, 120 బీ లాంటి కేసులు పెట్టడం రేవంత్ రెడ్డిలోని అమానవీయతను తేటతెల్లం చేస్తున్నది. ఈ సత్యాలను శాసనసభ ద్వారా రాష్ట్ర ప్రజల ముందుంచాలనే బీఆర్ఎస్ పార్టీ ‘ఫార్ములా-ఈ’ రేస్ అంశాన్ని శుక్రవారం నాడు సభలో చర్చకు పెట్టాలని డిమాండ్ చేసింది. వివిధ వర్గాలపై అక్రమ కేసుల నమోదులో రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే అరుదైన రికార్డును నమోదు చేసుకున్నది. చివరికి ప్రధాన విపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై కూడా అన్యాయమైన కేసులు పెట్టే దుస్సాహసానికి ఒడిగడుతుంటే, ప్రజలకు పూర్తి సత్యాలు తెలియాల్సిన అవసరం ఉన్నది. కానీ, కుట్రదారుడికి సత్యాలను ఎదుర్కొనే ధైర్యం ఎక్కడుంటుంది? అందుకే శాసనసభలో అధికార పార్టీ దాడులతో దిగజారి వ్యవహరించింది. పవిత్రమైన చట్టసభలో షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ ఏకంగా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు చెప్పులు చూపించడం కాంగ్రెస్ పార్టీ రౌడీయిజానికి నిలువెత్తు నిదర్శనం.
అయితే, ఇంకా దిగ్భ్రాంతికి గురిచేసే అంశమేమిటంటే, సభలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్లు అధికార పార్టీకి వంతపాడి, ప్రజా వ్యతిరేక సర్కార్‌ను ఆకాశానికి ఎత్తడం. ఎంఐఎం ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో సామాన్యులకూ అంచనా ఉన్నది. అయితే కమ్యూనిస్టు పార్టీ ఏకైక ఎమ్మెల్యే కూనంనేని శైలే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బాకాలూదనంతగా, రేవంత్‌రెడ్డి సర్కార్‌ను ఆకాశానికెత్తడం శాసనసభ సమావేశాలు చూస్తున్నవారందరికీ అసభ్యంగా అనిపించకమానదు. ఏదేమైనా పదేండ్లలో హైదరాబాద్ వైభవానికి, ఐటీ ఎదుగుదలకు, నగర పాలికల నడవడికకు నూతన చైతన్యాన్ని కల్పించి, ప్రగతిపథంలో నడిపించిన కేటీఆర్ గురించి రాష్ట్రంలోని వారికే కాదు, దేశంలోని బుద్ధి జీవులందరికీ తెలిసిందే. పని రాముడి ప్రతిష్ఠకు కళంకం తేవాలనే సర్కార్ కుట్రలు ఎప్పటిలాగే ఇప్పుడు కూడా పటాపంచలవ్వడం పక్కా.
– (వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
డాక్టర్ ఆంజనేయ గౌడ్