నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు ఇటీవల కొన్ని రోజులపాటు నిర్వహించిన ఆందోళన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సీజేపీ ఆందోళన దేశంలోని వాస్తవ స్థితిగతులను ప్రతిబింబించింది. ఒక్క ప్రశ్నపత్రాల లీకేజీనే కాదు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, అప్పులు, రూపాయి క్షీణత వంటివి ఎన్డీయే పాలనపై విద్యార్థులు, యువత, ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని బహిర్గతం చేశాయి.
ఎన్డీయే అధికారంలో ఉన్న ఈ 12 ఏండ్లలో దేశం పురోగమనం చెందిందని బీజేపీ, దాని మిత్రపక్షాలు డప్పు కొట్టుకుంటున్నాయి. కానీ, దేశంలోని ఏ వర్గంలోనూ సంతృప్తి లేదు. పేదరికం ఆనవాళ్లు పోలేదు. విదేశాల్లో దాచిపెట్టిన నల్లధనాన్ని భారతదేశానికి తెప్పించి ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తామని నమ్మించిన ఎన్డీయే ఆ తర్వాత మొండిచేయి చూపింది. దేశంలో నిరుద్యోగమే ప్రధాన సమస్యగా ఉన్నది. అది యేటేటా పెరుగుతూ ప్రస్తుతం 16 శాతానికి చేరింది. యేటా విద్యావంతులు, పట్టభద్రులు, పీజీ, పీహెచ్‌డీల సంఖ్య పెరుగుతున్నా వారికి ఉద్యోగాలు, ఉపాధి గగనంగా మారాయి. దేశంలో చదువుకు తగిన ఉద్యోగం చేస్తున్న పట్టభద్రులు కేవలం 8.25 శాతం మంది మాత్రమే. కేంద్రం నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో విఫలం కావడంతో దేశంలో 22 కోట్ల మంది పట్టభద్రులు నిరుద్యోగులుగా ఉన్నారు. సాధారణ పట్టభద్రుల్లో 84 శాతం మంది, ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో ప్రతి 10 మందిలో 8 మందికి కొలువులు రావట్లేదు. యేటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ సర్కార్ ఇచ్చిన హామీ బూటకంగా మిగిలిపోయింది. విద్యావ్యవస్థలో సమూల మార్పులు జరగడం లేదు. నిత్యం విద్యార్థుల ఆత్మహత్యలు, ర్యాగింగ్లు, వేధింపులు జరుగుతున్నాయి. ఉపాధి ఆధారిత విద్యావిధానం అమలుపై దృష్టి సారించడం లేదు. మతం పేరిట భావోద్వేగాలను రెచ్చగొట్టి విద్యార్థులకు సైతం పావులుగా వాడుకుంటున్నది తప్ప వారి జీవితాల్లో కొత్త వెలుగులు తెచ్చేందుకు ఏ మాత్రం ప్రయత్నించడం లేదు.
నిత్యావసరాల ధరల మీద నియంత్రణ లేదు. బియ్యం, పాలు, వంటనూనె, పప్పులు, గోధుమపిండి, చక్కెర, ఇతర వినియోగ వస్తువుల ధరలు 12 ఏండ్లలో 40 శాతం నుంచి 400 శాతం వరకు పెరిగాయి. వంటగ్యాస్, చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరాయి. ఎన్నికల సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో పెట్రో ధరలు పెంచడమే లక్ష్యంగా కేంద్రం వ్యవహరిస్తున్నది. 120 ప్రభుత్వరంగ సంస్థలను అతి తక్కువ ధరకే బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారు. రైతాంగం పరిస్థితి దయనీయ స్థితికి చేరుకున్నది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు పెరిగాయి.
రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. నిత్యం రైతాంగం ఆందోళన చేస్తుంటే వారిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నదే తప్ప సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదు. పేదలు, రైతులకు రుణమాఫీకి వ్యతిరేకమని చెప్పిన కేంద్రం పెద్ద పెద్ద కంపెనీలకు రుణ రాయితీలిచ్చి ఇచ్చి వాటిపై ప్రేమను చాటుకుంటున్నది. 2024లో 10,546 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది.
67 ఏండ్లు పాలించిన ప్రభుత్వాలు రూ.55 కోట్ల లక్షల అప్పు చేస్తే ఎన్డీయే సర్కార్ ఇప్పటికే రూ.155 లక్షల కోట్లు అప్పు చేసింది. అంటే దేశంలో ప్రతి ఒక్కరిపైనా అప్పు లక్షా ఇరవై వేలకు చేరింది. పెద్ద నోట్ల రద్దు వల్ల భారత ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది. దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులకు గురికాగా, బడాబాబులు కుబేరులయ్యారు. భారత్‌లో తయారీ (మేకిన్ ఇండియా)ని విశ్వవ్యాప్తంగా చేస్తామని బీజేపీ చెప్పగా చివరికి విదేశాల నుంచి దిగుమతులు పెంచింది. దేశ రైతాంగాన్ని, పారిశ్రామికరంగాన్ని దెబ్బతీసేలా అమెరికా, బ్రిటన్ వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నది.నైతిక విలువలకు తిలోదకాల్చి రాజకీయ పార్టీలను చీల్చడం, బలహీనపరచడం, ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోస్తున్నది. తమ మాట వినని ప్రతిపక్ష పార్టీల నేతలను వివిధ స్కామ్‌లలో ఇరికించి జైలుపాలు చేయడం ఆనవాయితీగా మారింది. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఆదాయ పన్ను శాఖలు రాజకీయ లక్ష్యాల సాధనకు ఉపయోగపడుతున్నాయి.
ఈడీ ఇప్పటివరకు 121 కేసులు నమోదు చేయగా 95 శాతం విపక్ష నాయకులపై మనీ లాండరింగ్ చట్టం కింద పెట్టిన కేసులు 5,420. అందులో 5,150 కేసులు ప్రతిపక్ష నేతలపైనే ఉన్నాయి. వివిధ రాజకీయ పార్టీల నేతలపై 149 రాజద్రోహం కేసులు నమోదయ్యాయి.
విద్యావ్యవస్థ మరింత దెబ్బతిన్నది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, ఉత్పాదకత, పౌర స్వేచ్ఛ, లింగ సమానత్వం, విద్య, వైద్యం వంటి రంగాల్లో మనదేశం ర్యాంకు యేటేటా తగ్గుతున్నది. 2014లో మోదీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గడిచిన 12 ఏండ్లలో దేశంలో 68 ఉగ్రదాడులు జరిగాయి. ఆయా ఘటనల్లో 360 మంది వరకు సైనికులు, పోలీసులు అమరులయ్యారు. 230 మంది పౌరులు మృతి చెందారు. 2014 నుంచి ఇప్పటివరకూ ఒక్క జమ్ముకశ్మీర్‌లోనే 11 ఉగ్రదాడి ఘటనలు జరిగాయి. 2016లో జరిగిన ‘ఉరి’ ఉగ్రదాడి, 2019లో జరిగిన ‘పుల్వామా’ దాడి, గత యేడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడి, ఎర్రకోట దగ్గర కారు పేలుడుతో యావత్తు దేశం వణికిపోయింది.
మన విదేశాంగ విధానం సరిగా లేదు. సమయస్ఫూర్తి లోపించడం వల్ల అనేక దేశాలతో అంతరం క్రమేణా పెరుగుతున్నది. దిగుమతులపై ఆధారపడిన దేశానికి ఈ విధానాలు సమస్యగా మారి సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. అధికారపక్షాన్ని నిలదీసి ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకోవాల్సిన గురుతర బాధ్యత విపక్షాలకే ఉంటుంది. కానీ ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఆ దిశగా ఎదగడం లేదు. పోరాటపంథా లోపించి ఎన్డీయేను ఢీకొట్టడంలో అది విఫలమవుతున్నది. 2024 ఎన్నికల సందర్భంగా విపక్షాల బలం పెరిగినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాయి. అన్ని విపక్షాలను ఏకం చేసి ఎదుర్కొనే అవకాశం ఉన్నా అలాంటి చొరవ కాంగ్రెస్‌లో లోపిస్తున్నది. దేశంలో అత్యధిక విపక్ష ఎంపీలున్న డీఎంకే వంటి పార్టీని వీడి, అధికారంలో పాలుపంచుకోవడానికి తమిళనాడులో విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీతో చేతులు కలుపడం ఆ పార్టీ వ్యూహరాహిత్యాన్ని బహిర్గతం చేసింది. కాంగ్రెస్‌లో సమర్థులున్నా వారి సేవలను ఆ పార్టీ వినియోగించుకోలేక రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలపైనే ఆధారపడుతున్నది. మరోవైపు దేశంలోని మీడియాను ఎన్డీయే ప్రభుత్వం గుప్పిట్లోకి తీసుకొంటున్నది. విపక్షాలు విఫలమైనపుడు ఆ పాత్ర పోషించాల్సిన మీడియో ప్రేక్షకపాత్ర, అధికారపక్షానికి వంతపాడటానికే ప్రాధాన్యం ఇస్తున్నది.
జంతర్ మంతర్‌లో సీజేపీ ఆందోళన సందర్భంగా మీడియా వైఖరిపై విద్యార్థులు, యువత ఆగ్రహం ప్రదర్శించారు. సీజేపీ ఆందోళన ఎన్డీయే ప్రభుత్వానికి గుణపాఠమైంది. కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు, మీడియాకు సైతం కనువిప్పు కలిగించింది. దేశంలోని విద్యార్థి, యువత, రైతులు, అన్ని వర్గాల ప్రజలను చైతన్యపరిచింది.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు నిర్వీర్యమైనా, మీడియా అధికారపక్షానికి కొమ్ముకాసినా ఆ పాత్రను వారే పోషిస్తారనే సత్యాన్ని వెల్లడించింది. ఇది మున్ముందు పెనుమార్పులకు దారితీస్తుంది. సామదానభేద దండోపాయాలతో వ్యవహరిస్తున్న కేంద్రం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో మరింత ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. మీడియో సైతం తన ధోరణిని మార్చుకోవాలి. ప్రజల కోణంలో ఆలోచించి నడుచుకోవాలి.
(వ్యాసకర్త: బీఎన్ రావు ఫౌండేషన్ చైర్మన్)
విద్యావ్యవస్థ మరింత దెబ్బతిన్నది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, ఉత్పాదకత, పౌర స్వేచ్ఛ, లింగ సమానత్వం, విద్య, వైద్యం వంటి రంగాల్లో మనదేశం ర్యాంకు యేటేటా తగ్గుతున్నది. 2014లో మోదీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గడిచిన 12 ఏండ్లలో దేశంలో 68 ఉగ్రదాడులు జరిగాయి. ఆయా ఘటనల్లో 360 మంది వరకు సైనికులు, పోలీసులు అమరులయ్యారు. 230 మంది పౌరులు మృతి చెందారు.
-బీఎన్‌రావు