పోయిన్నెల ఆషాఢ మాసంల మా ఊరి పోశమ్మకు బోనమెత్తినం. సంక్రాంతి పండుక్కు వోకున్నా ఏం ఫరక్ పడదు గని, పోశమ్మ బోనాల్జేసేటప్పుడు పోకుంటే మాత్రం మా ఇల్లు శిన్నవోతది. అందుకే ఓ పొంటె ఇంటిమొకాన వొయి మంచిశెడ్డలర్సుకొని అస్తే దప్ప నాకు పానం నిమ్మలం గాదు. పోశమ్మకు సాక వోసి, ఆ తల్లి బొట్టు ముడితే గానీ మావోళ్లకు తుర్తి గాదు. నేనే గాదు, నా అసొంటోళ్లు మస్తు మంది యాడున్నా.. ఆ యాళ్ల మాత్రం తప్పకుండా ఊరికి శేరుకుంటరు.
ఏ ఇంటి ఆడిబిడ్డ ఆ ఇంటి బోనమెత్తి ముందు నడిస్తే, ఆమె ఎన్క ఇంటోళ్లందరు నడుస్తరు. మా ఊళ్లె మా మున్నూరు కాపోళ్లయి దగ్గెర దగ్గెర ఓ నూటిరువై గడ్పలుంటయి గావొచ్చు. ఆ నూటిరువై బోనాలు ఒక్కకాడ గూడితే, వాళ్లకు పోశమ్మ తొవ్వ సూపేది మాత్రం మాదిగి సప్పుడే. ఆ డప్పుసప్పుళ్ల మజ్జన ఎగురుకుంటా, దున్కుకుంటా పోశమ్మకు బోనాలు తీస్కపోతాంటే ‘అగ్గొ సూసినారుల్లా… కాపుదనపోళ్ల బోనాలు ఎంత సక్కంగున్నయో’నని ఊరంతా సంబురవడుతరు. మా కాపుదనపోళ్ల బోనాలంటే ఊరంతా పండుగ లెక్కనే. పొద్దుగాళ్ల పది గొట్టంగ బైలెల్లిన బోనాలు పోశమ్మకాడికి శేరేసరికి ఒంటిగంట గొట్టింది. ఒకెలెన్కొగలు పోశమ్మకు బోనం ముట్టజెప్పేసరికి మూణ్నాలుగయ్యే అందాద గొడ్తున్నది. ఇంటినుంచి బోనం బైలెల్లంగ గెరువిచ్చిన వాన పోశమ్మ గుడి కాడికి చేరుకోంగనే మళ్లా అందుకున్నది. అందుకే మా సోపతిగాళ్లందరం సైగలు జేస్కొని పోశమ్మ ఎన్క ఉండే గుడ్శెకాడికి శేరుకున్నం.
గుడిసెల కూసున్న మావోళ్లను ‘కాకా… మీ పోలీసోళ్లు కొట్టుడు షురూ జేసిర్రట గద నిజమేనా?’ అనడిగిన. ‘నేన్ కొడ్తలేను గని, ఠాణాలళ్ల కొట్టుడు మాత్రం మళ్లా షురువైంది బిడ్డా’ అన్జెప్పుకుంటా బాధపడవట్టిండు మా కాక. ఇంకో పోలీసు.. తమ్ముడైతడు. ‘పదేండ్లాయె అన్న శేతులకు పన్జెప్పక, ఇప్పుడు కొంచెం శెయ్యి సాఫైతున్నది’ అని సంబురపడ వట్టిండు. కొట్టుడంటే పోలీసోళ్లకు ఎంత సంబురమో అని నాది నేను మనసులనుకున్న. ఇట్లా ఓ గడే సేపు ప్రభుత్వం, పోలీసోళ్లు.. వాళ్లు కొట్టే లాఠీదెబ్బల గురించే ముచ్చట నడ్శింది. ‘ఇగ్గొ మీరెన్నన్న జెప్పుర్రి.. ఏమన్నుంటే కోర్టుకు అప్పజెప్పాలె గని, కొట్టే అధికారం మీకెక్కడిది?’ అని వాళ్లతోని లొల్లి వెట్టుకున్నంత పన్జేసిన. అసలు పోలీసులు, లాఠీదెబ్బల చర్చ అప్పుడక్కడ ఎందుకొచ్చినదంటే…?
కరీంనగర్ జిల్లా రామడుగు పోలీస్‌స్టేషన్ పరిధి వెలిశాల అనే ఊళ్లె గొర్లు దొంగతనమైనయి. ఈ దొంగతనం జరిగింది ఏప్రిల్‌లో అయితే, జూన్ 11వ తారీఖు దాన్క అక్కడి పోలీసులు నిర్ద లెవ్వలే. గొర్లు పోయినాయిన తనకున్న పతారతో కాంగ్రెస్ నాయకులతో ఒత్తిడి చేపిచ్చిండు. అప్పుడు నిర్ద లేసిన రామడుగు పోలీసులు ఆఖరికి ఎరుకల సామాజికవర్గానికి చెందిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నరు! జూన్ 11వ తారీఖు మబ్బుల నాలుగ్గొట్టంగా వెలిశాలలోని ఓ ఇంటికి వొయిన పోలీసులు కుతాడి కన్కయ్యను స్టేషన్‌కు పట్కవోయిండ్రు. అదేరోజు పొద్దున్నుంచి పగటీలి దాన్క ఆ ఎస్టీ యువకున్ని ఒక కొట్టుడు గాదు, థర్డ్ డిగ్రీ ప్రయోగించిన్రు.
దరఖాస్తు ఇచ్చినాయన ముందే, తను సూడంగనే ఈ తతంగమంతా నడిసిందట! ఆడ సాలదన్నట్టు కుతాడి కన్కయ్యను ఇంకో స్టేషన్‌కు తీస్కవొయి గూడ పొట్టు పొట్టు కొట్రిన్రు. జూన్ 25వ తేదీ దాన్క లాఠీ దెబ్బలకు గెరువిచ్చిన పోలీసులు ఆ ఎస్టీ యువకుడిని 26వ తారీఖు గూడ స్టేషన్‌కు పిలిపించుకున్నరు. ‘వాళ్ల శేతులకు జెట్టలు వుట్ట! ఆ రోజు గూడ నా పెనిమిటిని పొట్టు పొట్టు కొట్టిన్ర’ని కుతాడి కన్కయ్య పెండ్లాం ఏడ్సుకుంటా చెప్తాంటే విన్నోళ్లు గూడ ఏడ్వవట్టిర్రు. కనికరం లేని ఖాకీ దెబ్బలు ఓర్సుకోలేక కన్కయ్య ఆఖరికి ప్రభుత్వ దవాఖాన్ల షరీఖైండు. అంటే పోలీసులు ఆయ్నను ఎంతగనం చిత్రహింసలు వెట్టిర్రో అర్థం జేస్కోర్రి.
కుతాడి కన్కయ్య నిజంగనే గొర్లను దొంగతనం జేసిండనుకుందాం! అయితే మాత్రం అంతగనం కొట్టేటందుకు అసలు ఈ పోలీసులెవలు? ‘మాకు న్యాయం జెయ్యిర్రి సారూ..’ అని కన్కయ్య బంధువులు, కుల సంఘాల నాయకులు, మానవ హక్కుల సంఘాల నేతలు ఎన్ని నిరసనలు తెలిపినా కన్కయ్యపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన రామడుగు ఎస్సైపై కనీసం ఈగ గూడ ఆలలేదు. సాక్షాత్తూ రాష్ర్టానికి చెందిన ఓ మంత్రే ఆయన ఎన్కున్నంక ఈగెందుకాలుతది గని! కొట్టడమే తప్పంటే, కొట్టిన ఎస్సైని ఆ మంత్రి ఎన్కేసుకొని రావడమేందో? కుతాడి కన్కయ్య కేసు ఇలా ఉంటే.. మొన్నటికి మొన్న సునీత అనే ఓ దళిత మహిళకు నిక్కర్ తొడిగించి, కన్న కొడుకు ముందే పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన్రు? సైబరాబాద్ కమిషనరేట్‌లోని షాద్‌నగర్ సాక్షిగా.. చేయని నేరాన్ని ఒప్పుకోవాలంటూ ఆ దళిత మహిళను ఓ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ హింసించడం దారుణం. ఇవి రెండే గాదు, బయటికిరాని థర్డ్ డిగ్రీలు ఇంకా ఎన్ని ఉన్నయో..!
మన తెలంగాణ మనకొచ్చినంక పదేండ్ల పాటు పోలీసు స్టేషన్లలో కొట్టుడనే మాట మాయమైంది. రాష్ట్రంల రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అట్లా కొలువుదీరిందో లేదో, ఇట్లా పోలీసుల శేతులు మళ్లా లేస్తున్నయి. వాళ్ల పైత్యానికి అమాయక ప్రజలు బలైతున్నరు. ఇదైతే మంచి పద్ధతి గాదు. రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసిన ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను కొనసాగించకపోతే కుతాడి కన్కయ్య పెండ్లాం లెక్కనే ప్రజలు గూడ ‘మీ శేతికి జెట్టలు వుట్ట’ అనే శాపనార్థాలు వెడ్తరు. ఆ శాపం అటు పాలకులకు, ఇటు పోలీసులకు కచ్చితంగా తాకుతది.
– (వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
– గడ్డం సతీష్ 99590 59041