భారతదేశంలో నూతన కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా కొత్తగా ప్రమాణం చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ మూడో తరం నేత ఒమర్ అబ్దుల్లాది ఇతర ముఖ్యమంత్రులెవరికీ లేని అపూర్వ పరిస్థితి. ఎన్నికైన తొలి షేక్ అబ్దుల్లా మనవడు, ప్రస్తుత ఎన్సీ అధ్యక్షుడు, మాజీ సీఎం ఫారూఖ్ అబ్దుల్లా కుమారుడైన 54 ఏండ్ల ఒమర్ కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణం చేశారు.
Jammu Kashmir | ఒమర్ తాత షేక్ అబ్దుల్లా జమ్మూకశ్మీర్ తొలి ముఖ్యమంత్రి. షేక్ మరణానంతరం ఆయన కుమారుడు డాక్టర్ ఫారూఖ్ అబ్దుల్లా (ఇప్పు డు వయస్సు 87) కూడా తండ్రి మాదిరిగానే మూడుసార్లు కల్లోలిత కశ్మీరానికి ముఖ్యమంత్రిగా సేవలందించారు. డాక్టర్ కుమారుడు, మూడో తరం అబ్దుల్లా అయిన ఒమర్ కూడా కశ్మీర్ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆరేండ్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మూడు తరాలకు చెందిన ఈ ముగ్గురు అబ్దుల్లాలు 1948 నుంచి 2015 జనవరి 8 వరకూ దాదాపు 30 ఏండ్లు ముఖ్యమంత్రి పదవిలో రాష్ర్టాన్ని దశ ల్లో పాలించారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒక రాష్ట్రంలో పదవి చేపట్టడం ఇదే మొదటిసారి. ప్రత్యేక సామాజిక, భౌగోళి క పరిస్థితులున్న కశ్మీర్లో ఇది సాధ్యమైందని భావించవచ్చు. అయితే, స్వల్పంగా భూభాగం తగ్గిన నూత న కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ ఇప్పుడు ఏ ముఖ్యమంత్రికీ లేని ప్రత్యేక సవాళ్లున్నాయి.
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి (అటానమీ) లేదా ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగ అధికరణ 370ను భారత రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తొలగించారు. తర్వాత భారత పార్లమెంటు చట్టం ద్వారా జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌ను రెండు వేర్వేరు ప్రాంతాలు గా విడదీసి కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడంతో అక్కడ ఎన్నికలు మొదట ప్రధానాంశమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇటీవల జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిపించా రు, 90 మంది సభ్యులున్న అసెంబ్లీలో జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్‌కు సొంతంగా మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్ వెలుపలి నుంచి ఇచ్చే మద్దతుతో రాష్ట్ర మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో ఎన్సీ సర్కార్ అధికారంలోకి వచ్చింది.
రాష్ట్ర హోదా కోల్పోవడంతో ఇదివరకు కశ్మీర్‌కు ఉన్న శాసనమండలి (విధాన పరిషత్తు) కూడా రద్దయింది. దీంతో కశ్మీర్ మంత్రిమండలి సభ్యుల సంఖ్య తగ్గిపోవడంతో మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు కోరినన్ని మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదని ఒమర్ తేల్చిచెప్పారు. ఫలితం గా, హస్తం పార్టీ బయటినుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్రపాలిత ప్రాంతంగా మారడం వల్ల ఇలా అనేక సమస్యలు
తలెత్తుతున్నాయి.
కేంద్రంలో కాంగ్రెస్ లేదా బీజేపీ ఏది చెలాయిస్తున్నా.. సాధారణ పరిస్థితులు ఉండే ఇతర రాష్ర్టాల్లో సైతం గవర్నర్ల పెత్తనం ఏ స్థాయిలో ఉం టుందో చూస్తూనే ఉన్నాం. ఇక జమ్మూకశ్మీర్‌లో వివాదాస్పద గవర్నర్ జగ్మోహన్ నుంచి పలువురు గవర్నర్లు రాష్ట్ర సర్కార్లును సతాయించినవారే. కేంద్ర ప్రభుత్వాల కనుసన్నల్లో మెలుగుతూ బీజే పీ నాయకత్వంలోని కేంద్ర సర్కార్ల ఆదేశానుసారం వారు వ్యవహరించిన తీరు ప్రజలు ఇంకా మరిచిపోలేదు. ఏదైనా కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ, ముఖ్యమంత్రి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాని లెఫ్టినెంట్ గవర్నర్లు ఎలా సీఎంపై పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తారో గత కొన్నేండ్లుగా ఢిల్లీలో చూస్తూనే ఉన్నాం.
ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండగా, ఆ తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్లు తమ అధికారాన్ని ఏ స్థాయిలో చెలాయించారో రుజువు చేశారు. మరి ఈ లెక్కన తీవ్రవాదం, పొరుగు దేశంతో తరచూ ఉద్రిక్తతలు నెలకొనే పరిస్థితులున్న సరిహద్దు ప్రాంతం జమ్మూ కశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహారశైలిని బట్టి ఒమర్ అబ్దుల్లా పాలన ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 370వ అధికరణ పునరుద్ధరించాలని కోరుతూ ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గం అసెంబ్లీ తీర్మానం చేయించాలని నిర్ణయించింది.
ఈ తీర్మానం కేంద్రపాలిత ప్రాంత శాసనసభ ఆమోదించి లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రానికి పం పితే అది ఎంతవరకు ఆచరణ రూపం దాల్చుతుందో ఊహించడం కష్టం కాదు. అదీగాక, జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇవ్వడానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ సుముఖమే గానీ, అది ఎప్పుడు చేస్తా రో చెప్పడం కష్టం. ఇక ప్రత్యేక హోదా ప్రసాదించే 370 అధికరణ పునరుద్ధరించడానికి జాతీయ పక్షాలు రెండు అనుకూలంగా లేవు. ఇన్ని అననుకూల పరిస్థితుల మధ్య నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం సజావుగా ముందుకు సాగడానికి ఇంకా ఎన్నో సవాళ్లు కనిపిస్తున్నాయి. 90 మంది ఎన్నికైన ఎమ్మెల్యేలు, గవర్నర్ నామినేట్ చేసిన ఐదుగురు ఎమ్మెల్యేలతో ఏర్పడిన ఈ కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీకి పరిమిత అధికారాలే ఉన్నాయి. లెజిస్లేటివ్ కౌన్సిల్ లేకపోవడంతో ముఖ్యమంత్రి ఇంకా తన క్యాబినెట్లోకి తొమ్మిది మందిని మాత్రమే తీసుకునే అవకాశం ఉన్నది. అయితే, ఇప్పటికే ఒమర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆశావహంగా ఉన్నాయి. హిందువుల జనాభా ఎక్కువగా ఉండి, 43 మంది సభ్యులు కలిగి ఉన్న జమ్మూ ప్రాంతం నుంచి తన పార్టీకి చెందిన హిందూ నేత సురీందర్‌సింగ్ చౌదరీని ఉప ముఖ్యమంత్రిగా ఆయన నియమించుకున్నారు.
ఇంకా ముస్లింలు కూడా ఒక మోస్తరు సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతానికి చెందిన సతీశ్ శర్మ, జావేద్ రాణాకు కూడా క్యాబినెట్లో స్థానం కల్పించి మతాలవారీగా సమతూకం పాటించే ప్రయత్నం చేశారు ఒమర్. అయితే, కశ్మీర్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తన చెప్పుచేతుల్లో ఉండేవిధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇటీవల ప్రవేశపెట్టిన జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రభుత్వ పరిపాలనా నియమాలు (రెండో సవరణ) 2024 జూలై 12 ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలు మరింత విస్తృతమయ్యాయి.
లెఫ్టినెంట్ గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారాలు అపరిమితంగా పెరుగుతూ పోయే పాల నావ్యవస్థను కశ్మీర్లో ఏర్పాటు చేయడానికి కేంద్ర సర్కార్ ప్రయత్నిస్తున్న క్రమంలో ఒమర్ అబ్దుల్లా సర్కారు ప్రజలకు గాని, దేశానికి గాని చేయగలిగింది పెద్దగా ఏమీ కనిపించడం లేదని రాజకీయ పండితు లు అభిప్రాయపడుతున్నారు. కశ్మీర్లో కుటుంబ మూలాలున్న తొలి భారత ప్రధాని పండిత నెహ్రూ దగ్గరినుంచి ఆయన మనవడు రాజీవ్‌గాంధీ వరకూ, ఇంకా పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు జమ్మూకశ్మీర్‌పై తమ పట్టును, నియంత్రణను పెంచుకుంటూ పోయా యే గానీ తగ్గించనే లేదు, బీజేపీ ప్రధానులు ఏబీ వాజపేయి, నరేంద్ర మోదీ సర్కార్లదీ ఇదే ధోరణి. ఈ వాస్తవాలను గుర్తించిన ఒమర్ మరి భవిష్యత్తులు జమ్మూకశ్మీర్‌కు కనీసం రాష్ట్ర హోదా సాధించి నా దాన్ని గొప్ప విజయంగా పరిగణించవచ్చు.
-నాంచారయ్య మెరుగుమాల