Namasthe Telangana | నాడూ.. నేడూ నమస్తే తెలంగానం
2011లో అటువంటి ఒకానొక రోజున.. క్షేత్రస్థాయిలో తెలంగాణ అనేదే లేదని నిరూపించదలిచినవాడై చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తున్నారు. పాలకుర్తిలోని ఓ పొలం దగ్గర ఓ రైతు కనిపించాడు.
చంద్రబాబు చక్రాలు తిప్పుతున్న కాలమది! కేంద్రంలో ఎవరున్నా తన మాట చెల్లుబాటు చేసుకోగలిగిన స్థితి ఆయనది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కుర్చీ మాత్రం సీమాంధ్రదే.భవితవ్యం తేలక చౌరస్తాలో నిలబడి చూస్తున్న తెలంగాణ! పంటికింద రాయిలా మారిన ఉద్యమాన్ని ఎట్లా అణచివేద్దామా..? అని ఎత్తులు వేస్తున్న అప్పటి కాంగ్రెస్ సర్కార్. తెలంగాణ ఉద్యమం కల్పితమైనదని, వ్యక్తిగత స్వార్థంతోనే నాయకత్వం దీన్ని నడుపుతున్నదని సీమాంధ్ర మీడియా వక్రకీరణ కథనాలను విచ్చలవిడిగా విరజిమ్ముతున్న రోజులవి.
Namasthe Telangana | 2011లో అటువంటి ఒకానొక రోజున.. క్షేత్రస్థాయిలో తెలంగాణ అనేదే లేదని నిరూపించదలిచినవాడై చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తున్నారు. పాలకుర్తిలోని ఓ పొలం దగ్గర ఓ రైతు కనిపించాడు. చుట్టూ మీడియా భజంత్రీలన్నీ ఉండగా, ఆయన దగ్గరికి వెళ్లిన బాబు.. తనదైన శైలిలో ఏదేదో మాట్లాడబోయాడు. ఎవరి కోసరమో తన పర్యటన అని వివరించబోయాడు. కానీ వడిసెలో రాయిపెట్టి విసిరినట్టు ఒకే ఒక్క ప్రశ్న ఎదురైంది. ‘మాకేమీ వద్దు. మా తెలంగాణ మాకియ్యండి..’ అని కుండబద్దలు కొట్టాడు ఆ రైతు. ఆయన పేరు ఫణికర మల్లయ్య. మా రాష్ట్రం మాక్కావాలె అని సమైక్యాంధ్రకు నిలువెత్తు ప్రతినిధిగా ఉన్న చంద్రబాబు ముందు కరాఖండిగా చెప్పగలిగిన ఓ అతిసాధారణ రైతు మల్లయ్య ఓ హీరో. ఆయన చేతుల మీదుగా 2011 జూన్ 6న ఆవిష్కృతమైంది నమస్తే తెలంగాణ! అటువంటి ఆత్మగౌరవ పుత్రిక నేడు 13 వసంతాలను పూర్తిచేసుకొని, 14వ పడిలోకి అడుగుపెట్టింది.
ఉద్యమానికి అక్షరాస్ర్తాలు అందించే పత్రిక లేని చోట.. ఉన్నవి నిలువెల్లా సీమాంధ్ర వాదాన్ని నింపుకున్న చోట.. తెలంగాణ భాష భాషే కాదని అవహేళన చేసిన చోట.. ఇక్కడి గోస గోసకాదని మరుగునపర్చి వెనుకపేజీల్లో కుక్కేసిన చోట.. తెలంగాణ అస్తిత్వ పతాకాన్ని పతాకశీర్షికల్లో ఆవిష్కరించిన అక్షరాయుధం ‘నమస్తే తెలంగాణ’. ఆదివారం సంచికను ‘బతుకమ్మ’గా నిలిపింది. తెలంగాణ ‘జిందగీ’పై ఫీచర్స్ను అందించింది. పాఠకుడిని తెలంగాణ సాహిత్యపు ‘చెలిమె’నీళ్లు తాపింది. అందుకే ‘మన పత్రిక.. మన ఆత్మగౌరవం’ అని యావత్ తెలంగాణ ఆదరించింది. అందుకే పటాకులు కాల్చి, డప్పు సప్పుళ్ల మధ్య ‘నమస్తే తెలంగాణ’ తొలిరోజు ప్రతులను స్వాగతించిన పల్లెలు అనేకం. తెలుగు పత్రికారంగ చరిత్రలో ఇదో అరుదైన ఘట్టం.
‘తెలంగాణోళ్ల కోసం ఒక పత్రికా? వాళ్లకు నడుపొస్తదా?’ అని ఆధిపత్య భావజాలంతో అవహేళన చేసిన వాళ్లెందరో! ‘కేసీఆర్ ఎప్పుడో మూసేస్తడు’ అని నీరసపర్చాలని ప్రయత్నించి భంగపడినవాళ్లెందరో! కానీ ‘నమస్తే తెలంగాణ’ నడక ఆగలేదు. కుట్రల కత్తుల వంతెన మీద అక్షర కవాతును ఆపలేదు. ప్రభుత్వ బెదిరింపులకూ వెరవలేదు. ప్రజాకాంక్షను ప్రతిబింబించడమే కాదు.. సమైక్య పాలన దగాతీరును ఎండగట్టింది. పాలకుల గారడీలను, పార్టీల దొంగాటను ప్రజలముందు ఉంచింది.
కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్ వేసిన శ్రీ‘కుట్ర’ కమిటీ అసలు మర్మాన్ని, దాని నివేదికల లోగుట్టును ప్రజలకు విడమర్చి చెప్పింది. అలాగని ‘నమస్తే తెలంగాణ’ అక్షరాలకే పరిమితం కాలేదు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులకు అండగా నిలిచింది. అమరుల కుటుంబాల కష్టాన్ని పంచుకున్నది. తెలంగాణ సమాజాన్ని ఒక్కటిచేసి, ‘నమస్తే తెలంగాణ వెల్ఫేర్ అండ్ రిలీఫ్ ఫండ్’ ఏర్పాటు చేసి సేకరించిన విరాళాలతో వీరుల కుటుంబాల కన్నీటిని తుడిచింది.
పాఠకులు తెలంగాణ వాళ్లు.. పత్రికలు ఆంధ్రావి! కానీ నమస్తే తెలంగాణకు అలాకాదు. యాజమాన్యం, పాఠకులు అందరూ తెలంగాణే! అయినప్పటికీ రెండురాష్ర్టాల ప్రజల మధ్య సుహృద్భావం దెబ్బతినకూడదని ప్రయత్నించింది. ‘రాష్ర్టాలుగా విడిపోదాం.. అన్నదమ్ముల్లా కలిసుందాం’ అని చాటిచెప్తూ సీమాంధ్రలో సాహసయాత్ర చేసింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించాలని కోరుతూ ఊరూరా కరపత్రాలు పంచింది. నమస్తే తెలంగాణ శకటాన్ని అక్కడ కూడా స్వాగతించిన పెద్దమనసులున్నాయి. రాళ్లేసిన చేతులూ ఉన్నాయి. అమలాపురంలో ఏకంగా వాహనంపైనే దాడిచేసి ధ్వంసం చేసినా.. ‘నమస్తే తెలంగాణ’ తన గొంతు వినిపించడం మానలేదు.
ఉద్యమం ఫలించి, ఆకాంక్షలు నెరవేరిన వేళ.. భావి తెలంగాణ బంగారుమయం కావాలని కోరుకున్నది నమస్తే తెలంగాణ. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రజా మ్యానిఫెస్టోను ప్రకటించింది. పసికూన రాష్ట్రంపై పైశాచిక మూకలు విరుచుకుపడకుండా నిరంతరం కాపుకాసింది. రెవెన్యూ వ్యవస్థలో రసికారుతున్న అవినీతి రాచపుండుకు శస్త్రచికిత్స చేసేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేసింది. సగటు పౌరుల తరఫున ధర్మగంట మోగించింది. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ఎలుగెత్తి చాటింది. బతుకమ్మ పాటలను పుస్తకరూపంలో వేసి పత్రికతోపాటు రాష్ట్రమంతా పంచింది. తెలంగాణ కథకు పట్టాభిషేకం చేసింది. తెలంగాణ సాహిత్యవికాసం, ఆలయాల ఆధ్యాత్మిక ఉన్నతిపై పుస్తకాలు ప్రచురించింది. పీవీ శతజయంతి సందర్భంగా ఏడాదిపాటు అందించిన కథనాలతో చరిత్రను గ్రంథస్థం చేసింది. సమైక్య పాలనకు, స్వీయపాలనకూ మధ్య తెలంగాణ ఏం మారిందో వెల్లడిస్తూ ఫొటోలతో పుస్తకాన్ని అందించింది.
ఇజాలకు, వేదికలకు సంబంధం లేకుండా ఉద్యమానికి సద్దిగట్టింది ‘నమస్తే తెలంగాణ’. తెలంగాణ రాష్ట్రం అనే ఓ సామూహిక స్వప్నాన్ని సమష్టిగా సాకారం చేసుకునే దిశగా సాగించిన పోరాటం సగటు ఉద్యమకారుడికన్నా తక్కువేమీ కాదు. స్వరాష్ట్ర నిర్మాణాన్ని భుజానికెత్తుకుని గెలుపు కోసం పడిన తపన ఏ సైనికుడికీ తీసిపోదు. అవతరణ దశాబ్దిని ఇటీవల ఘనంగా జరుపుకొన్న రాష్ట్రం ముందు ఇప్పుడెన్నో సవాళ్లు!
తెలంగాణ మళ్లీ చౌరస్తాలో నిలబడింది.చంద్రబాబు ఇప్పుడు మళ్లీ చక్రం తిప్పబోతున్నారు.. అదే కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది నమస్తే తెలంగాణ మాత్రం తెలంగాణ కోసం తన యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నది.ఉద్యమానికి అక్షరాస్ర్తాలు అందించే పత్రిక లేని చోట.. ఉన్నవి నిలువెల్లా సీమాంధ్ర వాదాన్ని నింపుకున్న చోట.. తెలంగాణ భాష భాషే కాదని అవహేళన చేసిన చోట.. ఇక్కడి గోస గోసకాదని మరుగునపర్చి వెనుకపేజీల్లో కుక్కేసిన చోట.. తెలంగాణ అస్తిత్వ పతాకాన్ని పతాకశీర్షికల్లో ఆవిష్కరించిన అక్షరాయుధం ‘నమస్తే తెలంగాణ’.
-రంగు ప్రవీణ్ కుమార్
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

