ధగధగ మెరిసిపోతున్న ఈ లగ్జరీ బ్యాగ్‌ను చూస్తే ఏమనిపిస్తుంది. బంగారం లేదా ఎంతో ఖరీదైన, నాణ్యమైన లెదర్‌తో దీనిని తయారు చేసి ఉంటారని అనిపించవచ్చు. అయితే మీరు నమ్మినా.. నమ్మకపోయినా ఈ ఖరీదైన బ్యాగ్‌ను అచ్చంగా ఆరంజ్ తొక్కలతో తయారు చేశారు. నారింజ కాయ తొక్కలతో బ్యాగు ఎలా తయారు చేస్తారు? అంటూ నోరెళ్లబెట్టకండి. జోర్డానియన్ ఫుడ్ ఆర్టిస్ట్, మాలిక్యులర్ గ్యాస్ట్రోనమిస్ట్ ఒమర్ సర్తావి, దీనిని చేసి చూపించారు. పండ్లు, కూరగాయల తొక్కల నుంచి తోలు తయారు చేసే విధానాన్ని ఆయన కనిపెట్టారు.
ఒమర్ తొలుత స్థానిక మార్కెట్‌కు వెళ్లి తాజా ఆరెంజ్‌లను కొన్నారు. నారింజ తొక్కలు తీసి దశల వారీగా వాటిని తోలుగా మార్చారు. దీనికి రెండు వారాల సమయం పట్టిందని ఆయన తెలిపారు. ఆరంజ్ తొక్కలతో ఇలా తయారైన తోలుపై డిజిటల్ ఫ్రాబికేషన్తో కావాల్సిన విధంగా అందంగా డిజైన్ చేసుకోవచ్చని చెప్పారు. అనంతరం దానిని లేజర్ ద్వారా కట్ చేసినట్లు తెలిపారు. ‘చేతితో చెక్కిన మలాకైట్ రాయితో బంగారు పూత పూసిన ఇత్తడిపై ఆరెంజ్ పీల్స్ తోలు’ అని పేర్కొన్నారు. బహ్రెయిన్ డిజైనర్ నూఫ్ అల్ షెకర్తో కలిసి ఈ బ్యాగ్ తయారు చేసినట్లు వెల్లడించారు.
కాగా, పండ్లు, కాయగూరల తొక్కల తోలుతో ఒమర్ ప్రయోగాలు చేస్తున్నారు. వంకాయ తోలుతో ముఖానికి మాస్క్‌లు, టెంట్లను కూడా ఆయన తయారు చేశారు. ప్రస్తుతం తాను పండ్లు, కూరగాయల తోలును కొత్త మార్గాల్లో ప్రాసెస్ చేయడం, పర్యావరణ అనుకూల పదార్థంగా ఉపయోగించడం, విలాసవంతమైన బ్రాండ్లుగా మార్చడంపై దృష్టిసారించినట్లు ఒమర్ చెప్పారు. అందుబాటులో ఉన్న సాంకేతికత, ఆధునిక డిజైన్లతో ఖరీదైన ఉత్పత్తులను సృష్టించవచ్చని పేర్కొన్నారు. మరోవైపు రాయిటర్స్ వార్తా సంస్థ విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
‘One of the things I am currently working on is processing the leather of fruits and vegetables in new ways, to be used as environmentally friendly material, to turn it into luxury brands’: Jordanian food artist create luxury handbags out of orange peels pic.twitter.com/qcggKvErbC
— Reuters (@Reuters) January 7, 2022