లేకలేక కలిగినవాడు.. పంచప్రాణాలతో పెంచుకున్నవాడు.. పిల్లాడంటే ఇలా ఉండాలని ఊరూవాడా మురుసుకున్నవాడు.. లోపాలే లేకుండా ఇలాంటివాడిని పుట్టించానా!? అని ప్రకృతే అసూయపడినవాడు… ఏ మురిపెం అసూయగా మారిందో, ఎవరి శాపం తగిలిందో కానీ హఠాత్తుగా తను ఓ ప్రమాదం బారిన పడితే! ఏళ్లకేళ్లు గడుస్తున్నా, వైద్యం కోసం ఇల్లూవాకిలీ వదులుకున్నా కళ్లు తెరవకపోతే! అటు తనకీ, ఇటు కన్నవారికీ నిత్యనరకమే. గుండెను రాయిగా చేసుకుని ఆ స్థితిని కొనసాగించడం ఒకటే దారి. కొన్ని అరుదైన సందర్భాలలో మాత్రం రోగి విపరీతమైన వేదన పడుతున్నాడనో, ఇక కోలుకోలేడని వైద్యులు నిర్ధారించారనో, ఆర్థికంగా అసాధ్యమైన స్థితిలో ఉండబట్టో.. రోగికి విడుదల కల్పించడమే కారుణ్య మరణం. ఇది నైతికంగా సరైందా కాదా అన్న చర్చను పక్కన పెడితే… ఇటీవల సుప్రీం కోర్టు ఓ కేసులో కారుణ్య మరణానికి అంగీకరించడం ఓ అరుదైన సందర్భం. దీని వెనుక చాలానే చరిత్ర ఉంది.

అరుణా రామచంద్ర షాన్ బాగ్. తన పదేళ్ల వయసులోనే తండ్రి చనిపోవడంతో, కుటుంబంతో కలిసి ముంబైకి వలస వెళ్లింది. 1960ల కాలంలో అమ్మాయిలు చదువుకోవడమే కష్టమనుకునే రోజుల్లో స్కూల్ చదువు పూర్తి చేసింది. పుస్తకాలు కూడా కొనుక్కోలేని స్థితిలో సీనియర్ల నుంచి పాత బుక్స్ తీసుకుని మరీ చదువుకుంది. కింగ్ ఎడ్వర్డ్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్‌గా చేరింది. అదే చోట పనిచేస్తున్న ఓ న్యూరోసర్జన్తో ప్రేమలో పడింది. త్వరలోనే పెళ్లి చేసుకుని స్థిరపడే కలల్లో ఉన్న సమయంలో ఓ రాక్షసుడి చేతిలో అత్యాచారానికి గురైందామె. ఆ సమయంలో జరిగిన దాడిలో ఆమె మెదడు దెబ్బతిని శాశ్వతంగా మంచానికే పరిమితమైంది.
రోజులు గడుస్తున్న కొద్దీ షాన్ బాగ్ పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేకపోయింది. రాదనే ఆశ కూడా అడుగంటింది. ఏళ్ల తరబడి తనను గమనిస్తున్న తోబుట్టువులు, వాళ్లవాళ్ల జీవితాలతో బిజీ అయిపోయారు. ఇలా ఓ దశాబ్దకాలం గడిచాక, తన యాతన గురించి విన్న పింకి విరానీ అనే సామాజికవేత్త, కారుణ్య మరణం కోసం పోరాడింది. ఆమె పిటీషన్ ఆధారంగా సుప్రీం కోర్టు కారుణ్య మరణానికి సంబంధించి కొన్ని నిబంధనలు
రూపొందించింది కూడా! అయితే కుటుంబం వదిలేసినా కూడా షాన్ బాగ్‌ను 38 ఏళ్లుగా గమనించుకుంటూ వస్తున్న నర్సులు ఆ కారుణ్య మరణాన్ని వ్యతిరేకించడంతో.. తీర్పు ప్రతికూలంగా వెలువడింది. కారుణ్య మరణానికి సంబంధించి దేశంలోనే తొలి అడుగు ఇది.
పరోక్షంగా కారుణ్య మరణంలో చాలా విభాగాలే కనిపిస్తాయి. ప్రత్యక్షంగా రోగికి ఏదన్నా విషం లాంటి పదార్థం ఇచ్చి తన జీవితాన్ని ముగించడం (యాక్టివ్), రోగి ఆత్మహత్య చేసుకునేందుకు సాయం చేయడం (అసిస్టెడ్ సూసైడ్, వైద్యాన్ని నిలిపివేయడం ద్వారా (పాసివ్) ఇవీ ముఖ్యంగా వినిపించేవి. వేర్వేరు దేశాల్లో ఈ చట్టాలు అనేక పరిమితులకు లోబడి ఉన్నాయి. కొన్నిచోట్ల అసలు కారుణ్య మరణం అన్న మాటే వినిపించడానికి వీల్లేదు. మరో విషయం ఏమిటంటే.. ఎదుటి మనిషి బాధలో ఉన్నాడు కదా అని చంపడాన్ని ఏ దేశంలో అయినా హత్యగానే పరిగణిస్తారు.మన చట్టం మాత్రం ‘గౌరవప్రదమైన మరణం’ అనే హక్కు కింద, పాసివ్ కారుణ్య మరణాన్ని మాత్రమే అంగీకరిస్తుంది, అది కూడా అరుదైన సందర్భాలలో. దానికి సదరు రోగి అంగీకారం ఉండాలి, తన భావాన్ని వ్యక్తం చేసే పరిస్థితిలో రోగి లేనప్పుడు తన సమీప బంధువులన్నా కారుణ్య మరణానికి అంగీకరించాలి. అసలు రోగి పరిస్థితి కోలుకోలేని విధంగా ఉంది అన్న విషయాన్ని వైద్యబృందాలు కూడా నిర్ధారించాలి.

తొలి కేసు హరీష్ రాణా!
ఢిల్లీకి చెందిన హరీష్ ఇంజినీరింజ్ చదువుతున్న సమయంలో, నాలుగో అంతస్తు పైనుంచి కింద పడ్డాడు. ఆ ప్రమాదంలో అతని మెదడు బాగా దెబ్బతిన్నది. శరీరం మొత్తం చచ్చుబడిపోయింది. 13 ఏళ్లుగా ట్యూబ్ ద్వారానే ఆహారం అందించే పరిస్థితి. ఇక తమ కుమారుడు ఆ స్థితి నుంచి కోలుకోలేడని తెలిసిన తల్లిదండ్రులు కారుణ్య మరణాన్ని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హరీష్ శరీరం కొంతమేరకు స్పందిస్తున్నది కాబట్టి కారుణ్య మరణాన్ని అంగీకరించాలా వద్దా? అని ఇటు హైకోర్టు అటు సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. చివరికి అతనికి వైద్యం అందించినా ఫలితం ఉండదనే విషయం తేలాక, మార్చి 11న కారుణ్య మరణానికి అంగీకారం తెలుపుతూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు హరీష్‌కు వైద్యబృందం చికిత్స నిలిపివేయడంతో ఆయన మార్చి 24న కన్నుమూశాడు.
వందల ఏళ్ల వివాదం!
కారుణ్య మరణానికి పాశ్చాత్యులు పెట్టిన పేరు యూథనేసియా. గ్రీక్ పదాల నుంచి పుట్టిన ఈ మాటకు నిజంగానే ప్రాచీన గీక్, రోమన్లలో చెలామణీ ఉండేది. అనాథలు, బలహీనులను యూథనేసియా పేరుతో రాజ్యమే మరణానికి పంపేది. బాధ తట్టుకోలేని రోగులకు హెంలాక్ లాంటి విషాన్నిచ్చి వైద్యులే ప్రాణాలు తీసేవారు. ప్లేటో లాంటి తత్వవేత్తలు కూడా దీనికి మద్దతు పలికేవారు. ఇది ఏ స్థాయికి చేరుకుందంటే వైద్య పితామహుడిగా పేర్కొనే హిపొక్రటిస్ వైద్యులతో చేయించే వాగ్దానంలో ‘ప్రాణాంతకమైన మందుని కానీ, సలహాని కానీ ఏ రోగికీ ఇవ్వను’ అని చేర్చేంతగా!రాజ్యాల తర్వాత రాజ్యాంగాలు వచ్చినా యూథనేసియా వాదవివాదాల మధ్యే నడిచింది. 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ తత్వవేత్త, నేత ఫాన్సిస్ బేకన్.. కారుణ్య మరణం ద్వారా రోగి బాధను అంతమొందించడం వైద్యుడి బాధ్యత అనేశారు. కారుణ్య మరణానికి చట్టబద్ధత సాధించాలనే లక్ష్యంతో బ్రిటన్, అమెరికాల్లో సంస్థలు ఏర్పడ్డాయి. క్రమంగా అమెరికా, నెదర్లాండ్స్, బెల్జియంలాంటి దేశాల్లో వేర్వేరు స్థాయులలో యూథనేసియా అమల్లోకి వచ్చింది.

Karuynaharish
దాటగలమా!
ఏ పరిస్థితుల్లో అయినా కారుణ్య మరణానికి సిద్ధపడటం అనేది బాధాకరమైన విషయమే. భారంగా ఉన్న కుటుంబ సభ్యులను వదిలించుకోవడానికి ఇది దారి చూపిస్తుందనే భయమూ ఉంది. కోమాలాంటి అవస్థలలో ఉన్న రోగులు ఎప్పటికైనా తిరిగి బయటికి వస్తారనే ఆశ ఉంటుంది. ఎంత దీనస్థితిలో ఉన్నా, కళ్ల ముందు ఉన్నాడులే అనే అభయమూ ఉంటుంది.యూథనేసియా వీటికి పుల్‌స్టాప్ పెట్టేస్తుంది. ఇదంతా కాదు! అసలు యూథనేసియా వరకూ వెళ్లే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయనే ప్రశ్నా వినిపిస్తున్నది.
క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రోగాలకి ఇంకా మెరుగైన చికిత్సలు రావాల్సి ఉంది. ప్రపంచంలో జరుగుతున్న యూథనేసియా మరణాల్లో క్యాన్సర్ రోగులే 60 శాతం ఉన్నారంటే.. ఈ దిశగా ఎంత మార్పు రావాలో మరి!
మన దేశంలో వైద్యం, మందులకు ఇస్తున్న ప్రాధాన్యం పాలటివ్ కేర్‌కి ఇవ్వడం లేదు. అసలా పదమే ఇంకా సమాజానికి పూర్తిగా పరిచయం కాలేదు. మరణాంతకమైన సమస్యలు ఉన్నవారిలో నొప్పినీ, ఆందోళననీ తగ్గించి.. వారికి ఉన్న పరిధిలో ప్రశాంతంగా, ఆరోగ్యంగా జీవించేలా చేసే విభాగమే పాలటివ్ కేర్. ఐక్యరాజ్యసమితి ప్రకారమే లోకంలో 40 శాతం మందికి ఈ పాలటివ్ కేర్ అవసరం ఉంది. కానీ, కేవలం 14 శాతం మందికి మాత్రమే ఆ సేవ దక్కుతున్నది. ఇక మన దేశంలో అయితే కేవలం 4 శాతం మందే ఈ సేవలకు వెళ్తున్నారు. ఫలితంగా మరణమే మేలనే అభిప్రాయం ఏర్పడుతున్నది. ఖర్చుతో కూడుకున్న పాలటివ్ కేర్ సేవలు పొందేందుకు, మరింతమంది వైద్యులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
జాగ్రత్తగా లేకపోతే వృద్ధాప్యమే అన్నింటికంటే పెద్ద రోగంగా మారుతుంది. పైగా ఇన్నాళ్లూ కష్టపడ్డాం కదా, ఇక కాలు కదపకూడదు అనే నిర్లిప్తత చురుకుదనాన్ని చంపేస్తున్నది. వృద్ధాప్యంలో ఎలా ఉండాలి, అప్పటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే విషయంలో సాయం అందించే విభాగాన్ని జెరియాటిక్స్ అంటారు. మన దేశంలో ఈ సేవలు కూడా అందుబాటులో ఉండటం లేదు. వైద్యుల దగ్గర నుంచి సమాజం వరకూ అసలు జెరియాటిక్స్ శాస్ర్తాన్ని ఇంకా ముఖ్యమైందిగా పరిగణించడం లేదు. ఫలితంగా చేతులు కాలి.. మరణమే మేలనే భావనకు చేరుకుంటున్నారు.
దశాబ్దాల వివాదాల తర్వాత కారుణ్య మరణానికి అనుకూలంగా మొట్టమొదటి తీర్పు వెలువడింది. కానీ, ఈ చట్టం గురించి, అది అమలు కావాల్సిన పరిస్థితుల గురించి ఇంకా అవగాహన రాలేదు. రాబోయే రోజుల్లో మరిన్ని అభ్యర్థనలు వస్తాయి. మరిన్ని చర్చలు జరుగుతాయి. కానీ, జీవితం కంటే చావే మేలనే పరిస్థితి ఎప్పటికీ, ఎవ్వరికీ రాకూడదనే కోరుకుందాం.

ధర్మసందేహమే
మన సంప్రదాయంలో కారుణ్య మరణం గురించి పస్తావన దాదాపుగా కనిపించదు. ప్రాయోపవేశం, సల్లేఖనం, సజీవ సమాధి.. ఇలా దేహకార్యం పూర్తయిన తర్వాత మోక్షం కోసం చేసే క్రతువులు మాత్రమే కనిపిస్తాయి. కారణం స్పష్టం. బలవన్మరణంతో కర్మఫలం పూర్తికాదని పెద్దల నమ్మకం. దేహం అనుభవించే బాధ కూడా కర్మఫలితమే అని అంటారు. ఇస్లాం, క్రైస్తవ మతాల్లోనూ కారుణ్య మరణానికి మద్దతుకనిపించదు.
కారుణ్యం కాదు క్రూరత్వం
నా వంశం, నా పుట్టుక అనే మాటలకు అహంకారం తోడైతే సాటి మనిషే హీనుడిలా, బలహీనుడిలా కనిపిస్తాడు. దానికి సాక్ష్యమే నాజీ మారణహోమం. 1939లో ఓ జర్మన్ పిల్లవాడు తీవ్రమైన వైకల్యంతో జన్మించాడు. తన తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు హిట్లర్ స్వయంగా ఆ పిల్లవాడికి కారుణ్య మరణం ఇవ్వమని తన వ్యక్తిగత వైద్యులకు పురమాయించాడు. కానీ, ఆ చర్య అక్కడితో ఆగలేదు. ఆర్యుల రక్తం పవిత్రమైందనీ, తమ జాతిని ఎప్పటికప్పుడు బలపర్చుకోవాలని భావించిన హిట్లర్.. మానసిక, శారీరక వైకల్యం ఉన్న జర్మన్ పిల్లలను కూడా వేల సంఖ్యలో చంపించాడు. ఓ అంచనా ప్రకారం దాదాపు ఎనిమిది వేల మంది పిల్లల్ని తమ తల్లిదండ్రుల నుంచి బలవంతంగా లాక్కుని చంపారు. పిల్లల సంఖ్యే ఇలా ఉంటే ఇక పేదరికం, బలహీనత, ఒంటరితనం లాంటి
సమస్యలతో ఉన్న పెద్దల పరిస్థితి ఊహించుకోవచ్చు.
జీవాలకీ
గుర్రం రేసులో ఓడిపోయింది.. కాల్చి చంపేసేవాళ్లు. ఇంట్లో కుక్క ముసలిదైపోయింది.. విషం పెట్టేసేవాళ్లు. ఒకప్పుడు యానిమల్ యూథనేసియా చాలా సహజంగా ఉండేది. ఇప్పుడైతే జంతువుల కారుణ్య మరణాల విషయంలో కూడా కఠినమైన చట్టాలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో నిపుణుడైన పశువైద్యుడే దీన్ని నిర్వహించాలి. అయితే దీనికి ఓ మినహాయింపు కనిపిస్తూ ఉంటుంది. రేబిస్కి భయపడి స్థానిక అధికారులు, నాయకులు వీధికుక్కలను చంపిస్తూ ఉంటారు. కొన్నాళ్ల క్రితం జగిత్యాలలో మూడు వందల కుక్కలని చంపిన ఘటన సంచలనంగా మారింది. ఇవన్నీ చట్టవిరుద్ధమే. కుక్కల బెడద ఎంత తీవ్రంగా ఉన్నా, కోర్టు అనుమతి లేకుండా వాటిని చంపడమంటే శిక్షకు సిద్ధపడటమే.
కొన్ని చిక్కుముడులు
తన భర్త ఆమె కారుణ్య మరణాన్ని కోరుకుంటున్నాడు.. తల్లిదండ్రులు దాన్ని వ్యతిరేకించారు. అమెరికాలో జరిగిన టెరి షియావో అనే రోగి విషయంలో జరిగిన గొడవ ఇది. ఆ దేశపు పార్లమెంట్ మొదల్కొని అత్యన్నత న్యాయస్థానం వరకూ ఈ కేసు మీద మల్లగుల్లాలు పడ్డాయి.
అరులియా బొవెర్స్ అనే నెదర్లాండ్స్ మహిళ డిప్రెషన్లో ఉన్న కారణంగా కారుణ్య మరణాన్ని కోరుకుంది. ఇది అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. మానసిక సమస్యలు ఉన్నవారు మరీ ముఖ్యంగా చిన్నవయసు వారికి కారుణ్య మరణాన్ని కల్పించడం ఎంతవరకు నైతికం అన్న వివాదం నడిచింది.
కారుణ్య మరణాన్ని అంగీకరించే దాదాపు అన్ని దేశాల్లోనూ అది మేజర్లకే పరిమితం. కానీ ఏ వయసు వారైనా యూథనేసియాకు అర్హులే అని చట్టం చేసిన తొలి దేశం బెల్జియం. ఇది చట్టబద్ధమైన ఆత్మహత్యలకు దారితీస్తున్నదనే అపవాదు ఉంది. ఆ దేశంలో జరిగే మరణాల్లో కారుణ్య మరణాలది 3 శాతం కావడమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నది.
గౌరవప్రదమైన మరణం
మన రాజ్యాంగంలో ఆర్టికల్ 21 గౌరవప్రదంగా జీవించే హక్కు కోసం భరోసా ఇస్తుంది. బతుకే కాదు మరణం కూడా గౌరవప్రదంగా ఉండాలి కదా! ఈ విషయం మీదే common cause అనే సంస్థ కోర్టులో కేసు వేసింది. మరణమే మేలనిపించే అవస్థలో ఉన్నవారికి గౌరవంగా మృత్యువును కల్పించాలని వాదించింది. ఈ సమయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కారుణ్య మరణాలకి కీలకంగా మారింది.
డాక్టర్ డెత్
ఏ వైద్యుడు అయినా రోగి ప్రాణాలు నిలపాలి అనుకుంటాడు. కానీ ప్రాణాల కంటే చావు మీదే ఎక్కువ ఆసక్తి చూపించిన వైద్యుడు ఒకరున్నారు. అతనే అమెరికాకు చెందిన కెవోర్కియన్. చిన్నతనంలో ఎన్నో కష్టాల మధ్య పెరిగిన కెవోర్కియన్కి దేవుడంటే నమ్మకం పోయింది. చావు తప్పనిసరి అనే దృక్పథం ఏర్పడింది. ఉరిశిక్ష పడిన ఖైదీలను మానవ ప్రయోగాలకు వాడుకోవచ్చు కదా, చనిపోయిన ఖైదీల అవయవాలను ఇతరులకు అమర్చవచ్చు కదా.. లాంటి వాదనలు వినిపించేవారు. ఇక డాక్టర్ అయ్యాక.. కారుణ్య మరణాలను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. 1990 నుంచి 1998 మధ్యకాలంలో కెవోర్కియన్ 130 మరణాలకు కారణమయ్యాడు. వీరిలో దాదాపు 60 శాతం సందర్భాలలో కారుణ్య మరణం అవసరమే లేదని తేలింది. కొన్నిసార్లు కుంగుబాటులో ఉన్నవారిని కూడా కౌన్సెలింగ్ వైపు కాకుండా మరణం వైపు మళ్లించినట్టు బయటపడింది. ఇలాంటి ఓ నాలుగు సందర్భాలలో హత్యారోపణలతో బోనెక్కాల్సి వచ్చినా.. తక్కువ శిక్షతో బయటపడ్డాడు. కెవోర్కియన్ పేరుతో చాలా సినిమాలు, వీడియో గేమ్స్ పాత్రలు వచ్చాయి. కొందరికి తను ఆదర్శం. మరెందరికో భయం. యూథనేసియా మీద కఠినమైన చట్టాలు లేకపోతే ఏం జరుగుతుంది అనే భయం!
మరణం కోసం ప్రయాణం
మెరుగైన వైద్యం కోసం జరిగే ప్రయాణాలు విన్నాం. కానీ, కారుణ్య మరణం కోసం జరిగే Euthanasia Tourism ఓ బాధాకర వాస్తవం!
కళ్లు చెదిరే ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన స్విట్జర్లాండ్ ఈ విలయానికి ముఖ్యమైన గమ్యస్థానం కావడం విచిత్రం. అక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలే ఈ యూథనేసియా నిర్వహిస్తాయి. నామమాత్రపు రుసుముతో వాటికి దరఖాస్తు చేసుకుంటే చాలు. అతి తీవ్రమైన అనారోగ్యం (terminally ill) ఉండాలని కానీ, స్విస్ పౌరుడు అయి ఉండాలని కానీ నిబంధన లేకపోవడంతో చుట్టుపక్కల దేశాలవారు ఇక్కడికి వెళ్లి కారుణ్య మరణానికి సిద్ధపడుతుంటారు.
అమెరికాలో పాసివ్ యూథనేసియా చట్టబద్ధమే. అయితే వైద్యుడి సహాయంతో జరిగే (physician-assisted suicide) రాష్ర్టాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. కాలిఫోర్నియా,
కొలరాడో లాంటి రాష్ర్టాలకి ఇలాంటి కారుణ్య మరణాల కోసం ఇతర రాష్ర్టాల వారు వెళ్తుంటారు. అయితే ఇది స్విట్జర్లాండ్ అంత తేలిక కాదు. నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. కంబోడియా, మెక్సికో లాంటి దేశాల్లో కూడా యూథనేసియా కోసం పర్యటనలు జరుగుతూ ఉంటాయి కానీ, వాటికి చట్టబద్ధత లేదు.
…? కె.ఎల్.సూర్య