లండన్ : ఆరోగ్యంగా నిండు నూరేండ్లు సంతోషంగా జీవించాలని కోరుకోని వారుండరు. ఆరోగ్యం, దీర్ఘాయువు గురించి మనం మాట్లాడుకున్న ప్రతి సందర్భంలో శారీరక వ్యాయామం, సరైన ఆహారం గురించే మాట్లాడుకుంటాం. కానీ నలుగురితో కలివిడిగా ఉంటూ కష్టసుఖాలు పంచుకుంటూ ఉంటే కలకలం బతికేయవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది.
పొగతాగడం, మద్యపానం, ఒత్తిడి, బద్ధకం వంటి అలవాట్లను వదిలించుకోవడంతో పాటు సమాజంలో అందరి తలలో నాలుకలా ఉంటూ చుట్టూ మనుషులతో కలివిడిగా ఉండటం అంతే కీలకమని పరిశోధకులు తేల్చారు. మన సామాజిక సంబంధాలు, నలుగురితో మనం ఎలా మసలుతున్నామనేది మన ఆరోగ్యంపై దీర్ఘాయువు, జీవనశైలిపై పెను ప్రభావం చూపుతుందని పీఎల్ఓఎస్ మెడిసిన్ రీసెర్చ్ జర్నల్లో ప్రచురితమైన పరిశోధన స్పష్టం చేసింది.
వ్యక్తి మొక్క సామాజిక అనుబంధం నాణ్యత, గాఢత ప్రభావం వారి మానసిక ఆరోగ్యంతో పాటు తీవ్ర రోగాలు మరణానికి దారితీసేందుకు సంబంధం ఉందని పీఎల్ఓఎస్ నివేదిక పేర్కొంది. ఒంటరిగా జీవించే వారిలో దీర్ఘాయువు, ఆరోగ్య నిష్పత్తి బాగా పడిపోయిందని పరిశోధకులు ఈ అధ్యయనంలో గుర్తించారు. సామాజిక సంబంధాలు బలంగా ఉన్న వారిలో దీర్ఘాయువు 50 శాతం వరకూ పెరుగుతుందని పరిశోధకులు ఈ అధ్యయనంలో కనుగొన్నారు.