గువహటి : ఏడెనిమిది నెలలుగా తాను పొదుపు చేసిన కాయిన్స్‌ను షోరూంలో కుమ్మరించి న్యూ స్కూటర్‌ను కొనుగోలు చేసిన అసోం వ్యక్తి సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాడు. బర్పెట జిల్లాలో స్టేషనరీ షాపును నిర్వహించే వ్యక్తి కొద్ది నెలలుగా కాయిన్స్‌ను పోగు చేస్తూ సంచీ నిండా నాణేలతో నింపాడు.ఆపై కాయిన్స్ బ్యాగ్‌ను షోరూంకు తీసుకువెళ్లి కొత్త స్కూటర్‌ను సొంతం చేసుకున్నాడు. యూట్యూబర్ హిరక్ జే దాస్ అతడి స్టోరీని ఫోటోలతో సహా ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
ఆయన కల సొంతం చేసుకోవడానికి చాలా డబ్బు అవసరమైనా…కొన్ని సార్లు చిన్న చిన్న మొత్తాలను పొదుపు చేస్తూ కల సాకారం చేసుకోవచ్చని దాస్ రాసుకొచ్చారు. కాయిన్స్‌ను షోరూం సిబ్బంది లెక్కించి ప్లాస్టిక్ బాస్కెట్స్లో ఉంచిన దృశ్యాలతో కూడిన వీడియోను కూడా దాస్ పోస్ట్ చేశాడు. కాయిన్స్ తీసుకువచ్చిన వ్యక్తి పత్రాలపై సంతకం చేసి వెహికల్ కీస్ అందుకోవడంతో ఈ వీడియో ముగుస్తుంది.
గత నెలలో కర్నాటకలోని టుంకూర్లో ఓ వ్యక్తి చేతిలో చిల్లిగవ్వ లేకుండా మహాంద్రా షోరూంకు రావడంతో అక్కడి సేల్స్ ఎగ్జిక్యూటివ్ నువ్వు ఎస్యూవీ కొనే రకానివేనా అంటూ ఎద్దేవా చేశాడు. ఆపై అరగంటలో రూ పది లక్షలతో అక్కడికి వచ్చిన కస్టమర్ తన డ్రీమ్ కారును బుక్ చేసుకున్నాడు. అయితే ఆయన కోరుకున్న కారును షోరూం డెలివరీ చేయకపోవడంతో తనను అవమానించినందుకు షోరూం నిర్వాహకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. ఈ అంశాన్ని పరిష్కరిస్తామని ఈ వ్యవహారంపై స్పందించిన మహీంద్ర గ్రూప్ చీఫ్ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.