Success Story : ఎవరూ ఊహించని రీతిలో చెరకు రసంతో టీ, పానీపూరి, జిలేబీ వంటి రుచికరమైన ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ తయారుచేయవచ్చని అంబాలాకు చెందిన విపన్ సరీన్ అనే ఇంజనీర్ చాటిచెప్పారు. ఈ వినూత్న ఉత్పత్తులతో రైతుల రాబడిని పెంచడమే కాకుండా వారి ఆలోచనలను, మార్కెట్‌ను కొత్తపుంతలు తొక్కించారు. చెరుకు వ్యాపారంతో హర్యానా రైతులను ఆయన వాణిజ్యవేత్తలుగా తీర్చిదిద్దారు. చిన్ననాటి నుంచి రసాయనాలు లేని ఆర్గానిక్ కూరగాయలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే తన కలను నెరవేర్చుకునేందుకు విపన్ వేసిన అడుగులు ఇప్పుడు హర్యానా రైతుల స్దితిగతులనే మార్చాయి.
ఆర్గానిక్ కూరగాయల ధరలు ఎరువులు, రసాయనాలతో పండించిన కూరగాయల కంటే ధర కంటే ఎక్కువ కావడంతో రైతులు ఈ కూరగాయలను పండించడం, మార్కెట్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పసిగట్టాడు. దీంతో 80-20 మోడల్‌ను తెరపైకి తీసుకువచ్చాడు. రైతులు తమ భూముల్లో 80 శాతం చెరకు పండిస్తే 20 శాతం భూమిలో ఆర్గానిక్ కూరగాయల సాగు చేపట్టేలా ప్రోత్సహించాడు. ఆర్గానిక్ కూరగాయలను తక్కువ ధరకు సరఫరా చేయడంలో వచ్చిన లోటును చెరకు పంటతో కవర్ చేసుకునేలా ప్లాన్ చేశాడు. రైతుల రాబడిని మరింత పెంచేందుకు ఆయా ఉత్పత్తులకు అదనపు విలువ జోడించాడు.
చెరకు నుంచి బెల్లం, పంచదార తయారుచేసేందుకు రైతులకు భారీ యంత్రాలు అవసరం కావడంతో వాటి స్ధానంలో వ్యాల్యూ యాడెడ్ ఉత్పత్తుల దిశగా ప్రోత్సహించాడు. చెరకు నుంచి చెరకు రసం, జిలేబి, పానీపూరి, టామరిండ్ చట్నీ వంటి ఉత్పత్తులను తయారు చేసేలా కార్యాచరణ రూపొందించాడు. రైతుల ఉన్నతి కోసం 2020లో విపన్ మరో ఇద్దరితో కలిసి సెలబ్రేటింగ్ పార్మర్స్ ఎడ్జ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కంపెనీ ఏర్పాటు చేశాడు.
రైతుల ప్రయోజనం కోసం సోషల్ మీడియా వేదికగా పలు స్టార్టప్ కంపెనీలతో చేతులు కలిపాడు. రైతుల ఉత్పత్తుల మార్కెటింగ్, కోల్డ్ స్టోరేజ్, ఉత్పత్తుల రవాణాకు ఇన్నోవేటివ్ ఐడియాలతో వీరు ముందుకొచ్చారు. రాబోయే రోజుల్లో వేలాఇ మందిని మైక్రో ఎంట్రప్రెన్యూర్లుగా మలిచేందుకు విపన్ సన్నాహాలు చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా పది లక్షల మంది రైతులకు చేరువై వారి పురోగతికి సాయపడాలని విపిన్ ప్రణాళికలు రూపొందించుకున్నారు.