Singapore : ‘స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ’ సప్తమ వార్షికోత్సవం ఏప్రిల్ 25న వైభవంగా జరిగింది. శివకృష్ణ దేవాలయం ఫంక్షన్ హాలు వేదికగా ఆద్యంతం కన్నులపండువగా వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరలయ సంస్థ విద్యార్ధుల సంగీత, కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఆహూతులను అలరించారు. కుమారి శ్రీ విద్య పంతువరాళి రాగంలో “ఎన్నగాను రామభజన” త్యాగరాజ కీర్తనను హృద్యంగా ఆలపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
ప్రొఫెసర్ శ్రీ బి.వి.ఎస్. చౌదరి, శ్రీమతి రాజ్యలక్ష్మి చౌదరిగార్ల సమక్షంలో జరిపిన సప్తమ వార్షికోత్సవ వేడుకకు
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు ముఖ్య అతిధిగా విచ్చేశారు. స్వరలయ వ్యవస్థాపక అధ్యక్షురాలు, గురు శేషుకుమారి సంగీత ప్రదర్శనలో ఆలపించిన త్యాగరాజ కీర్తన “ప్రక్కల నిలబడి”, ఒక “మీరా భజన్”, విద్యార్థులతో కలిసి చేసిన జానపద గీతం ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు అందుకున్నాయి.

అనంతరం తెలుగు విశ్వవిద్యాలయం గ్రేడ్, యూనివర్సిటీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన సంగీత విద్యార్ధులకు వీసీ నిత్యానంద రావు అర్హతా పత్రాలు, ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేషు కుమారి సంగీత ప్రస్థానాన్ని ప్రశంసించారు. ‘చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అయినా చిన్నతనం నుంచీ సంగీతం పట్ల ఉన్న ఆసక్తి, అనురక్తి కర్నాటక సంగీత రీతులను, లోతులను కొలిచేలా, సంగీత కళను భావితరాలకి అందించేలా ఆమెను నడిపిస్తున్నాయి అని ఆయన అభినందించారు. స్వరలయ విద్యార్ధులు భవిష్యత్తులో కర్నాటక సంగీతరంగంలో తమవైన విజయాలు సాధించాలని నిత్యానంద రావు ఆకాంక్షించారు.

హార్మనీ, హ్యూస్ అధ్యక్షురాలు శ్యామల ప్రసంగిస్తూ.. 2025లో తిరుపతిలో అన్నమాచార్య 500వ జయంతి ఉత్సవాలలో చేసిన సంగీత కచేరీ, శేషుకుమారి వంశీ-సీల్వెల్ ఫౌండేషన్ వారి మంగళంపల్లి బాలమురళీకృష్ణ అవార్డ్ అందుకోవడం స్వరలయసంస్థ సాధించిన కొత్త మైలురాళ్లని కొనియాడారు. గురు శేషు కుమారిని “సింగపూర్ గాన కోకిల”గా అభివర్ణిస్తూ, ఆమె శిష్యులు ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శ్యామల ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదే సందర్భంలో కుమారి మనోజ్ఞ అనే గాత్ర సంగీత విద్యార్ధి మాట్లాడుతూ.. కర్నాటక గాత్ర సంగీతాన్ని ఒక O-level ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకుని పరీక్షలు రాసేందుకు MOE (సింగపూర్ విద్యాశాఖ) తాను అనుమతి సాధించడం విశేషమనీ, ఇది తన గురువు ఇచ్చిన స్ఫూర్తి, మార్గదర్శకత్వం వల్లనే సాధ్యమైందనీ చెప్పారు. సంగీతాన్ని ఒక సబ్జెక్టుగా తీసుకోవడంతో ఇటు సంగీతంలో కృషి, అటు చదువుకునే సమయాన్ని సమర్ధవంతంగా వాడుకోవడం వీలవుతోందని ఆ విద్యార్థి తెలిపారు.

ఈ సంవత్సరం స్వర లయ ఆర్ట్స్ తన కార్యకలాపాలను విస్తరించి, గురు కృష్ణ శృతి మార్గదర్శకత్వంలో కూచిపూడి నృత్యాన్ని ప్రవేశపెట్టినట్లు శేషుకుమారి వివరించారు. సప్తమి వార్షికోత్సవ వేడుకలో మరో ప్రత్యేక ఆకర్షణగా, గురు శేషుకుమారి తాళం, రాగం నేర్పించేందుకు వినూత్నమైన సంగీత ఆటలను ప్రవేశపెట్టారు. వీటిని ప్రత్యక్షంగా వేదికపై నిర్వహించడం ద్వారా.. సంగీత శిక్షణలో ఒక కొత్త పోకడను పరిచయం చేశాయి.

యూటీఐఏఈసీ చైర్మన్ శ్రీ రాయ్, ట్రెజరర్ వీ. అడేశ్ బాబు, కళ, శివ కృష్ణ ఆలయ చైర్మన్, మేనేజర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ సాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు కవుటూరి రత్నకుమార్, కాకతీయ సబ్బు, సింగపూర్ తెలుగు వనితలు సమూహం నుండి క్రాంతి, జయ, దీపు, రేఖ, రాణి, గాయత్రి వంటి అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది.

పిల్లల ఉత్సాహభరితమైన ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించి, వేడుకను విజయవంతం చేశాయి. ముఖ్యంగా.. సౌజన్య చక్కటి వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. స్వర లయ ఆర్ట్స్ సింగపూర్లో భారతీయ సాంప్రదాయ సంగీతం, నృత్య సంప్రదాయాలను ప్రోత్సహిస్తూ, అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతోంది.
