హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ‘ప్రాంతాలుగా విడిపోదాం. అన్నదమ్ములుగా కలిసి ఉందాం’ అని ఉద్యమకాలంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఉద్భోద ఇప్పటికీ ఎందరికో స్ఫూర్తినిస్తున్నది. జూన్ 1న అమెరికాలోని డాలస్లో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై సెల్ నిర్వహించనున్న సభకు రాయలసీమ ఎన్నారైలు మద్దతు ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా డాక్టర్ పెప్పర్ ఎరినాలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం అయ్యేందుకు సాటి తెలుగువారిగా తాము కూడా తోడ్పాటునందిస్తామని రాయలసీమ ఎన్నారై విభాగం ప్రకటించింది.
ఈ మేరకు రాయలసీమ ఎన్నారై సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ దర్గా నాగిరెడ్డి, చందు చింతల, కృష్ణారెడ్డి కొడూరు, శివ అన్నపురెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధులు సోమవారం సంఘీభావం ప్రకటించారు. తమకు సంఘీభావం ప్రకటించిన రాయలసీమ ఎన్నారై ప్రతినిధులకు బీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల, బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మహేశ్ తన్నీరు కృతజ్ఞతలు తెలియజేశారు. అమెరికాలో మొదటిసారిగా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ సభపై అమెరికా వ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని మహేశ్ తన్నీరు చెప్పారు.
డాలస్ సభ నేపథ్యంలో అమెరికాలోని పలు ప్రాంతాల్లో సన్నాహక సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. సభ సన్నాహక సమావేశాల్లో బీఆర్ఎస్ ఎన్నారై విభాగం వేగం పెంచింది. సోమవారం కూడా సన్నాహక సమావేశాలు జరిగాయి. న్యూజెర్సీలో మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గాదరి కిశోర్, క్రాంతికిరణ్ చంటి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, కొణతం దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
బే, హ్యూస్టన్ ఏరియాలో వీరితోపాటు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్దిరెడ్డి, నోముల భగత్ హాజరవుతారని మహేశ్ బిగాల, మహేశ్ తన్నీరు తెలిపారు. డాలస్ సభను విజయవంతం చేయడం తెలంగాణ బిడ్డలుగా తమ విద్యుక్త ధర్మమని పేర్కొంటూ పలువురు ఎన్నారైలు మద్దతు ప్రకటించారు. వారిలో రావు కాల్వల, సురభి శ్రీనివాస్, అభిలాశ్ రంగినేని, అన్వేశ్రెడ్డి, కిర ణ్ మిర్యాల, శ్యామ్, హృషీకేశ్రెడ్డి, మనో జ్ ఏనుగంటి, సత్యం, యాదగిరి ఉన్నారు.