ఎన్నారైలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఖతార్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగోని తీవ్రంగా ఖండించారు. ఎన్నారైలకు ప్రతినిధులమని చెప్పుకుంటున్నవారు.. ఫ్రీ పాస్‌ల కోసం, పనికిరాని ప్రజావాణిల కోసం, ముందు సీట్లలో కూర్చునే ప్రొటోకాల్ పాసుల కోసం తన్నుకునే పీసీసీ ఎన్ఆర్ఐలు కనీసం స్పందించకపోవడం ఆక్షేపనీయమని అన్నారు. శ్రమజీవుల కష్టాలను అలుసు చేస్తూ విదేశాల్లో కష్టపడి పనిచేసేవారిని బాత్రూమ్లు కడుక్కునే వారు అని కించపరచడం రేవంత్ రెడ్డి అజ్ఞానానికి పరాకాష్ట అని విమర్శించారు.
లక్షల మంది ఎన్ఆర్ఐల శ్రమను, వారి ఆత్మగౌరవాన్ని అవమానించే అధికారం రేవంత్ రెడ్డికి ఎవరిచ్చారని శ్రీధర్ అబ్బగోని ప్రశ్నించారు. పొట్టకూటి కోసం అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, యూరప్ చలుల్లో, గల్ఫ్ దేశాల ఎడారి ఎండల్లో కడుపు మాడ్చుకొని తమ కుటుంబాల కోసం కష్ట పడుతున్న కార్మికులు , విద్యార్థుల కష్టాలు నీకు తెలుసా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. స్వయంకృషితో ఎదిగి, దేశానికి విదేశీ మార్పిడిని అందిస్తున్న మేధావులను ఎగతాళి చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన “మరుగుజ్జు” బుద్ధితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. మహాత్మా గాంధీ కూడా ఒకప్పుడు ఎన్ఆర్ఐ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ వంటి వారు కూడా విదేశాల్లో చదువుకొని, పనులు చేసుకున్న వారేనని మర్చిపోవద్దన్నారు. కష్టపడి పనిచేయడం గౌరవమని భావించే సంస్కృతి నీకు లేకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు.
తెలంగాణ సమాజం ఎప్పుడూ శ్రమను గౌరవిస్తుందని.. కానీ నువ్వు శ్రమజీవులను హేళన చేస్తున్నావని శ్రీధర్ అబ్బగోని అన్నారు. నీ రాజకీయ అవసరాల కోసం NRI లను కించ పరుస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతట తామే ఎవరిపైనా ఆధార పడకుండా, భవిష్యత్తు కోసం వెళ్లిన విద్యార్థులను, గల్ఫ్ వర్కర్లను కుటుంబ అవసరాల నిమిత్తం వేల కోట్ల రూపాయల రెమిటెన్స్‌లను పంపుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్నది ఎన్ఆర్ఐలే అని స్పష్టం చేశారు. చదువుకున్న విద్యార్థులను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను సైతం నీ వ్యాఖ్యలు తీవ్రంగా గాయపరిచాయని అన్నారు. నీ అహంకారపూరిత మాటలు నీ వ్యక్తిత్వాన్ని బయటపెడుతున్నాయి తప్ప, ఎన్ఆర్ఐల విలువను తగ్గించలేవని అన్నారు. ఏ పనైనా సొంతంగా చేసుకోవడం గర్వకారణమన్నారు. నీలాంటి వారిపై ఆధారపడటం కంటే అది వెయ్యి రెట్లు మేలు. నీ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు నీకు బుద్ధి చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు.
గోడలకు పెయింట్లు వేసే కార్మికుడి శ్రమలో ఉన్న పవిత్రత నీ రాజకీయాల్లో లేదని రేవంత్ రెడ్డిపై శ్రీధర్ అబ్బగోని మండిపడ్డారు. దేశం కాని దేశంలో భాష తెలియకపోయినా బతుకు పోరాటం చేసే ప్రతి ఒక్కడూ వీరుడే అని తెలిపారు. మేధావులను, శ్రామికులను గౌరవించడం నేర్చుకోండని రేవంత్ రెడ్డికి హితవుపలికారు. విదేశాల్లో ఉన్న వారిని కించపరచడం అంటే భారతీయతను కించపరచడమే అని అన్నారు. గల్ఫ్ బాధితుల ఓట్లతో గెలిచి, ఈరోజు వారినే ఎగతాళి చేయడం నీకు శ్రామిక శక్తి పై ఉన్న అవగాహన తెలియజేస్తుంది.