హైదరాబాద్ : తెలంగాణను ఎవరైనా చిన్నచూపు చూస్తే అది ఒక్క రాష్ట్రాన్ని కాదు, నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినట్టేనని బీఆర్ఎస్ ఎన్నారై యూఎస్ఏ నాయకులు అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా–పాకిస్తాన్ విభజనతో పోల్చడం అనేది అజ్ఞానం, అహంకారానికి నిదర్శనమన్నారు. తెలంగాణ ఉద్యమం అంటే ఏమిటో తెలియని వారు చరిత్రపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.
రక్తంతో, కన్నీళ్లతో సాధించుకున్నది తెలంగాణ రాష్ట్రం. అది ఎవరి తాతల జాగీరు కాదు అని స్పష్టం చేశారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోవడం ఎంత పెద్ద లోటో ఈ సంఘటన స్పష్టంగా చూపించిందన్నారు. తేజస్వి వ్యాఖ్యలకు బీజేపీ క్షమాపణ చెప్పాల్సింది పోయి సమర్థించడం, అదే బీజేపీ అసలు స్వభావం అన్నారు. మంత్రి కిషన్ రెడ్డి, అలాగే ఎప్పుడూ అతిగా మాట్లాడే బండి సంజయ్ ఈ వ్యాఖ్యలను ఖండించకుండా సమర్థించడం వాళ్ల అవగాహనలేమికి నిదర్శమన్నారు. పార్లమెంట్లో బీజేపీకి ఎనిమిది మంది, కాంగ్రెస్కు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా తెలంగాణ గౌరవం కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి నోరుమెదకపోవడం సిగ్గుచేటన్నారు. తేజస్వి సూర్య వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
లేకపోతే తెలంగాణ ప్రజల ఆగ్రహం ఏమిటో రాజకీయంగా చూపిస్తామన్నారు.