భీమ్‌గల్, నవంబర్ 5 : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ఆయా పాఠశాలల్లో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల కల్పన పనులను నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భీమ్‌గల్ పట్టణంలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, పల్లికొండ జడ్పీహెచ్ఎస్ను సందర్శించి పనుల వివరాలను అధికారులకు అడిగి తెలుసుకున్నారు. పనులు మందకొడిగా సాగుతుండడాన్ని గమనించిన కలెక్టర్ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని ఎక్కడా రాజీ పడవద్దని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. విద్యార్థుల ప్రయోజనాలతో ముడిపడిన పనులు అయినందున సొంత పనులుగా భావిస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించాలని గుత్తేదార్లకు హితవు పలికారు. భీమ్‌గల్ ఉర్దూ మీడియం అప్ప ర్ ప్రైమ రీ పాఠశాలల్లో అంగన్వాడీ చిన్నారుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పాఠశాలల్లోనే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఎసీ) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు ఎలక్ట్రీషియన్ హౌస్ వైరింగ్‌లో యువతులకు కుట్టుమిషన్ శిక్షణ అందిస్తుండగా కలెక్టర్ ఈ కేంద్రాన్ని సందర్శించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీవో రాజేశ్వర్ ఉన్నారు.
లక్ష్మీ నారసింహుడిని దర్శించుకున్న కలెక్టర్
లింబాద్రి గుట్టపై వెలసిన శ్రీలక్ష్మీనారసింహుడిని కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం దర్శించుకున్నా రు. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్ నింబాచల క్షేత్రాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ధర్మకర్త నంబి లింబాద్రి కలెక్టర్‌కు స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. బ్రహ్మోత్సవాలకు జిల్లా నలుమూలాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నందున ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుండా సదుపాయాలు కల్పించామని కలెక్టర్ పేర్కొన్నారు. అంతకుముందు భీమ్‌గల్ పట్టణంలో కొనసాగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట అధికారులు,ప్రజాప్రతినిధులు ఉన్నారు.