ఏర్గట్ల, మార్చి 27: మండలంలోని తొర్తిలో గ్రామస్తులు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామంలోని వేంకటేశ్వరాలయం వెనుక ఉన్న కొత్తప్లాట్ కాలనీలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నది. కొంతకాలంగా మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కావడంలేదు. ఈ నేపథ్యంలో నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘తాగునీటి కోసం భగీరథ ప్రయత్నం’ శీర్షికన గురువారం కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు స్పందించారు.
గ్రామంలోని కొత్త ప్లాట్ కాలనీలో మిషన్ భగీరథ ఏఈ స్వరాజ్, ఎంపీవో శివ చరణ్ పర్యటించారు. నీటి సమస్య గురించి ఇంటింటికీ తిరుగుతూ కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమస్యాత్మక ప్రాంతాల్లో పైపులైన్‌ను పంచాయతీ, మిషన్ భగీరథ సిబ్బంది పరిశీలించారు. రెండు రోజుల్లో సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.