అభివృద్ధిలో దూసుకు పోతున్న తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష గట్టింది. ఏ రాష్ర్టానికి లేని ఆంక్షలు మన రాష్ర్టానికే విధిస్తూ వివక్ష చూపుతున్నది. రైతాంగాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసే కుట్రలకు పాల్పడుతున్నది. కేంద్రం తీరుతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రూ.కోట్ల విలువైన ధాన్యం ముక్కి పోతున్నది. ధాన్యం సేకరణపై మోదీ సర్కారు అనేక కొర్రీలు పెట్టింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ వడ్లు కొనుగోలు చేశారు. ఉమ్మడి జిల్లాలో రూ.1,545 కోట్ల విలువైన 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నారు. ఇది ఓర్వలేని మోదీ సర్కారు.. రాష్ట్రం నుంచి బియ్యం సేకరణను నిలిపి వేసింది. ఇప్పటికే మిల్లింగ్ చేసిన టన్నుల కొద్దీ బియ్యాన్ని తీసుకోవడం లేదు. మిగతా ధాన్యాన్ని మిల్లింగ్ చేయలేక రైస్ మిల్లర్లు సతమతమవుతున్నారు. రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన వడ్లు రైసుమిల్లుల్లో ముక్కి పోతున్నా కేంద్రం చలించడం లేదు. రైతుల ప్రయోజనాలు, రైస్ మిల్లుల ఉనికి కోసం కేంద్రంతో పోరాడాల్సిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ .. తనకేపట్టనట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం.
నిర్లక్ష్యానికి నిదర్శనం..
ఈ చిత్రంలో కనిపిస్తున్న ధాన్యం బస్తాలు బిచ్కుంద మండలంలోని కోలవర్ రైస్మిల్లులోనివి. కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరణను నిలిపివేయడంతో వర్షానికి వడ్లు తడిసి మొలకెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైస్‌మిల్లుకు అప్పగించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి పంపించాల్సి ఉండగా, కేంద్రం నిర్లక్ష్యంతో ఇలా బస్తాల్లోనే వడ్లు మొలకెత్తాల్సిన పరిస్థితి వచ్చిందని రైస్‌మిల్ యజమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి బియ్యం ఎగుమతికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. – బిచ్కుంద, జూలై 19
నిజామాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మోదీ ప్రభుత్వానికి రైతులంటే గిట్టదు. కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేయడం మినహా అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పిన మోదీ.. ఇంధన ధరలను అమాంతం పెంచి పెట్టుబడి ఖర్చులను డబుల్ చేశారు. సాగుకు అందుతున్న ఉచిత కరెంట్‌ను అడ్డుకునేలా దొడ్డిదారిన విద్యుత్ చట్టాలు తెచ్చేందుకు యత్నించి వెనుకడుగేశారు. రైతులను నిలువునా ముంచేందుకు నల్ల చట్టాలను తెచ్చి.. చివరకు క్షమాపణలు కోరారు. ఇలా ఒకటేమిటి ఎనిమిదేండ్ల పాలనలో రైతులు ఏనాడూ బాగు పడింది లేదు. పైగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాల్లో కుటిల రాజకీయాలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. మర ఆడించిన బియ్యంపై రెండేండ్లుగా పేచీలు పెడుతూ కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతున్నది. ఈ దుస్థితిలో అన్నదాత ఇబ్బంది పడొద్దని.. సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. రూ.వేల కోట్లు వెచ్చించి ఆదుకోగా, ప్రస్తుతం మిల్లర్ల నుంచి భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) బియ్యం సేకరించడంలేదు. దీంతో వర్షాలకు ధాన్యం మొలకెత్తి మురిగిపోతున్నాయి. అయినప్పటికీ చలనం లేకుండా కేంద్ర సర్కారు కర్కశంగా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మోదీ పైశాచిక ఆనందం..
దేశంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు కుటిల రాజకీయం నడుస్తున్నది. బీజేపీయేతర రాష్ర్టాలపై కక్షపూరితమైన మోదీ వైఖరి స్పష్టంగా కనిపిస్తున్నది. రాజకీయ లబ్ధి కోసం జాతి ప్రయోజనాలను సైతం లెక్కచేయకుండా పణంగా పెట్టడం స్వతంత్ర దేశంలో ఇదే మొదటిసారి అంటూ ఆయా రంగాల నిపుణులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణలో పండించిన పంటలను కొనుగోలు చేయడంలో కొంత కాలంగా బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నది. బాయిల్డ్ రైస్, రా రైస్ పేరిట దొంగ నాటకాలు ఆడింది. తాజాగా బియ్యం సేకరణనే నిలిపేయడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఓ వైపు భారీ వానలతో తడిసి ముద్దవుతున్న ధాన్యపు రాశులన్నీ మొలకలెత్తి తీవ్ర నష్టం వాటిల్లుతున్నా.. అన్నదాత ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం కనీసం చలించడం లేదు. తమ రాజకీయ లబ్ధి కోసం లక్షలాది మంది రైతుల ఉసురుపోసుకోవడానికి సైతం బీజేపీ సిద్ధపడడం సిగ్గుచేటని పలువురు విమర్శిస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సుమారు 300కు పైగా రైస్ మిల్లుల్లో 45 రోజులుగా లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్ నిలిచిపోయింది. వాటిని వ్యాపారులు కాపాడలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతలోనే వానలు.. వరదలుగా రావడంతో ప్రతిచోటా వడ్ల బస్తాలనీ తడిసి ముక్కిపోతున్నాయి.
అర్వింద్.. స్పందించవేమి!
గతేడాది వానకాలం, యాసంగి సీజన్లలో కేంద్రం అవలంబించిన విధానాలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇతర పంటల సాగును ప్రోత్సహించింది. ఈ సమయంలో నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ మాత్రం అందుకు విరుద్ధంగా రైతులను రెచ్చగొట్టారు. వరినే సాగు చేయాలంటూ ప్రచారం చేశారు. తీరా ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర సర్కారు చేతులెత్తేయడంతో.. మళ్లీ సీఎం కేసీఆర్ ముందుకువచ్చి వడ్లను సేకరించారు. మిల్లులకు తరలించిన ధాన్యాన్ని మర ఆడించాక కేంద్రం ఆధీనంలో ఉన్న ఎఫ్‌సీఐ బియ్యం సేకరణకు ఇప్పుడు ససేమిరా అంటున్నది. దీంతో లక్షలాది మెట్రిక్ టన్నుల బస్తాల్లోకి తడి చేరి ముక్కిపోతున్నాయి. కండ్ల ముందు ఇంత నష్టం జరుగుతున్నప్పటికీ అర్వింద్ కనీసం స్పందించకపోవడం శోచనీయం. రైతుల ప్రయోజనం, రైస్ మిల్లర్ల నష్టాలను పరిగణలోకి తీసుకుని కేంద్రంతో సంప్రదించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఏమీ పట్టనట్టుగా వ్యవహరించడంతో అర్వింద్ వైఖరి మరోసారి బట్టబయలయ్యింది. ఆయనకు ఓట్లేసి గెలిపించిన నిజామాబాద్ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రాంతానికి లాభం చేకూర్చే ఉద్దేశమే లేదనడానికి ఇంతకన్నా ఉదాహరణ లేందటూ ఎంపీపై జనం మండిపడుతున్నారు.
వేల కోట్లు వెచ్చించిన తెలంగాణ ప్రభుత్వం..
రైతుకు కనీస మద్దతు ధరను కల్పించాలనే ఏకైక కారణంతో ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ధాన్యాన్ని సేకరించింది. ఒకవైపు కరోనా కష్టాలు, మరోవైపు కేంద్ర సహకారం లేకపోయినా.. అన్నదాత పండించిన ప్రతి గింజనూ సీఎం కేసీఆర్ కొనుగోలు చేసి వారి కన్నీళ్లు తుడిచారు. దళారుల దందాకు చెక్ పెట్టి ప్రభుత్వమే రైతుకు వెన్నుదన్నుగా నిలిచింది. నిజామాబాద్ జిల్లాలో యాసంగిలో ధాన్యం సేకరణకు 457 కేంద్రాలను ఏర్పాటు చేసి రూ.1148 కోట్ల విలువ చేసే 5లక్షల 85వేల 962 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. మొత్తం 82వేల 464 మంది రైతులకు మద్దతు ధరను కల్పించారు. కామారెడ్డి జిల్లాలో ప్రతిపాదనలకు అనుగుణంగా 344 కేంద్రాలు ప్రారంభించారు. రూ.397 కోట్ల విలువ చేసే 2లక్షల 3వేల 668 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 38వేల 782 మంది రైతుల నుంచి సేకరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్నదాతకు ఇబ్బంది కలుగకుండా రూ.1545 కోట్లతో 7లక్షల 89వేల 630 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయ్యింది. మొత్తం 1,21,246 మంది రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి డబ్బులు కూడా అందించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో సేకరించిన వేల కోట్ల రూపాయల ధాన్యం మిల్లింగ్‌ను నిలిపేయడంతో భారీ వర్షాలకు లక్షల బస్తాల్లో వడ్లు మొలకెత్తుతున్నాయి. అయినా కేంద్రం నుంచి కనీస స్పందన కనిపించడంలేదు.