నిరుపేదలు కూడా ఆత్మగౌరవంతో బతకాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం ఫలాలు అర్హులకు చేరుతున్నాయి. గూడులేని పేదల సొంతింటి కల సాకారం అవుతున్నది. సమైక్యరాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాల హయాంలో జరిగిన అక్రమాలు, అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. సొంత జాగా ఉండి ఇంటిని నిర్మించుకునేవారికి ప్రభుత్వమే రూ.5లక్షలను మంజూరు చేసింది. సర్కారు నిధులతో నిర్మించుకున్న భవనాల్లో పేదలు సగౌరవంగా జీవిస్తుంటే… కండ్లుమండిన ప్రతిపక్షాలు విషప్రచారం చేస్తున్నాయి. వాటికి సమాధానమే నవీపేట మండలంలోని పోతంగల్, జన్నేపల్లి, అబ్బాపూర్(ఎం)లో నిర్మించిన ఆత్మగౌరవ సౌధాలు.
– నవీపేట, జూలై 25
పేదల చిరకాల వాంఛ.. ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే సొంతింటి కల నెరవేరింది. ఇల్లులేని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు పేద ప్రజలకు అందేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. పైరవీకారుల ప్రమేయం లేకుండా, పారదర్శకంగా ఇండ్లను అందించడంతో లబ్ధిదారుల్లో సంతోషం వెల్లివిరిసింది. బోధన్ నియోజకవర్గం నవీపేట మండలంలో మూడు గ్రామాల్లో డబుల్ ఇండ్ల లబ్ధిదారులను పలుకరించగా.. వారు వెల్లడించిన విషయాలు ప్రతిపక్షాలు చేస్తున్న విషప్రచారాలకు చెక్ పెట్టాయి. ఎవరికీ రూపాయి ఇయ్యకుండానే.. మమ్మల్నీ, మా బతుకుల్ని చూసిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేసి పుణ్యం కట్టుకున్నారని ధన్యవాదాలు తెలిపారు.
– నవీపేట, జూలై 25
పేదోడి సొంతింటి కలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారు. అగ్గిపెట్టెల్లాంటి ఇండ్లల్లో పేదలు ఉండకూడదని, రెండు పడకల గదులకు ప్రాధాన్యమిచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేపట్టిన డబుల్ బెడ్రూం పథకం నిరుపేదలకు వరంగా మారింది. నవీపేట మండలంలోని పోతంగల్, జన్నేపల్లి, అబ్బాపూర్(ఎం) గ్రామాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆమేర్ ప్రత్యేక చొరవతో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకొని పేదలు నివాసముంటున్నారు. పేదలు సంతోషంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని జీర్ణించుకోలేని కాంగ్రెస్, బీజేపీలు విష ప్రచారానికి తెరలేపాయి. వారి ప్రచారాలన్నీ అసత్యాలని మూడు గ్రామాల లబ్ధిదారులు స్పష్టం చేస్తున్నారు. ఎవరికీ నయా పైసా ఇవ్వకుండా పారదర్శకంగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నామని లబ్ధిదారులు తప్పుడు ప్రచారాలకు చెక్పెట్టారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షలు మంజూరు చేయగా, ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు మూడు విడుతల్లో జీఎస్టీ మినహా పూర్తి డబ్బులను అధికారులు అందజేశారు. పోతంగల్ గ్రామంలో 36, జన్నేపల్లిలో 39, అబ్బాపూర్(ఎం)లో 25 మంది లబ్ధిదారులు సొంతింటి కలను బీఆర్ఎస్ సర్కారు కృషితో సాకారం చేసుకున్నారు.
ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ కృషి..
డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి అర్హులను ఎంపిక చేసేలా ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. పారదర్శకంగా ఎంపిక ఉండాలని అధికారులను ఆదేశించడంతో పోతంగల్, జన్నేపల్లి,అబ్బాపూర్(ఎం) గ్రామాల్లో పేద ప్రజలను ఈ పథకానికి ఎంపిక చేశారు. దీంతో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసి అందజేశారు. రెండు నెలల క్రితమే జన్నేపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే షకీల్ డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. ఈ గ్రామాలతోపాటు నవీపేట మండలంలోని పలు గ్రామాల్లో సైతం సొంత స్థలం ఉన్న పేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేసి పేదల మన్ననలు పొందారు.
కిరాయి ఇంట్లో ఇబ్బందిపడ్డాం..
కొన్నేండ్లుగా కిరాయి ఇంట్లోనే ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తారని చెప్పడంతో ఎలాగో ఇల్లు వస్తదని ఎదురుచూశాం. ఏడాది క్రితం మా గ్రామానికి 36 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు కాగా మమ్మల్ని కూడా ఎంపిక చేశారు. ప్రభుత్వం విడుతల వారీగా ఇచ్చిన డబ్బులతో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టుకున్నాం. సొంతింటి కలను నెరవేర్చిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటాం.
– తోకల పద్మ, పోతంగల్, నవీపేట
పాత ఇంట్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశాం.
మా అత్త, మామ, నా కుటుంబంతో చాలా రోజుల వరకు పాత ఇంట్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశాం. వానకాలం వచ్చిందంటే ఇంట్లోకి పాములు కూడా వచ్చేవి. తెలంగాణ సర్కార్ వచ్చినంక డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరైంది. ఎవరికీ ఒక్క పైసా లంచం ఇవ్వకుండా ఇల్లు కట్టుకున్నందుకు ఆనందంగా ఉన్నది. జీవితాంతం సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. ప్రస్తుతం కొత్త ఇంట్లో చాలా సంతోషంగా గడుపుతున్నాం.
– గైని రజిత, అబ్బాపూర్(ఎం), నవీపేట
సొంతింటి కల నెరవేరింది..
ఎన్నో ఏండ్ల నుంచి సొంతిల్లు కట్టుకోవాలని తపన ఉండేది. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో కుదరదలేదు. కిరాయి ఇంట్లోనే పిల్లలతో కాలం వెళ్లదీశాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ సార్ పేద ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేశారు. మా సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటున్నాం. ఏ రంది లేదు. చాలా సంతోషంగా ఉన్నది.
– లావణ్య, జన్నేపల్లి
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
సొంతింటి కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్ సార్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం. నా పేరు మీద ఇల్లు మంజూరు కావడంతో చాలా సంతోషం అనిపించింది. ఇల్లుకట్టుడు షురూ చేసిన తర్వాత విడుతల వారీగా బిల్లులు మంజూరు చేశారు. పైసలు ఎట్ల వచ్చాయో అట్ల ఇల్లు పనులు పూర్తిచేశాం. కొత్తగా కట్టిన ఇంట్లో పిల్లలతో కలిసి ఆనందంగా ఉంటున్నాం. ఇప్పుడు ఇల్లు లేదనే బెంగ లేదు.
– గైని సునంద, అబ్బాపూర్(ఎం), నవీపేట
ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు..
మాది నిరుపేద కుటుంబం. కూలి పనులు చేస్తే కానీ జీవనం గడవడం లేదు. కొన్నేండ్లుగా కిరాయి ఇండ్లలోనే కాలం వెళ్లదీశాం. నాకు సొంత స్థలం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేసింది. ప్రభుత్వం అందజేసిన పైసలతో ఇల్లు కట్టుకున్న. మొత్తం మూడు వాయిదాల్లో రూ.4లక్షలు వచ్చాయి. అధికారులో మా ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చారు. ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న సొంతింటి కలను సీఎం కేసీఆర్ నెరవేర్చిండు. ఆయన సల్లంగ ఉండాలే..
– పుష్ప, జన్నేపల్లి
ఇల్లు కడతామని అనుకోలేదు..
భవిష్యత్తులో ఇల్లు కడతామని కలలో కూడా అనుకోలేదు. చాలా సంవత్సరాల నుంచి కిరాయి ఇంట్లో ఉన్నాం. నా భర్త పనిచేస్తేనే ఇల్లు గడిచేది. దీంతో కొత్తగా ఇల్లు కట్టుకోవడం చాలా కష్టమని భావించాం. అదే సమయంలో రాష్ట్ర ప్రభు త్వం డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేసింది. దీంతో ప్రభుత్వం ఇచ్చిన పైసలతో మాకున్న చిన్న ప్లాట్లో ఇల్లు కట్టుకున్నాం. సొంతింటి కలను సాకారం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
– లక్నోవర్ స్పందన, పోతంగల్, నవీపేట
పైసా అడగలేదు..
నా భర్త చికెన్ సెంటర్ నడుపుతాడు. వచ్చిన డబ్బులతో కుటుంబ పోషణ సాగుతున్నది. ఉండడానికి సరైన ఇల్లు లేకపోవడంతో ఇబ్బందిగా గడిపాం. కిరాయి ఇంట్లో చాలా సంవత్సరాలు ఉన్నాం. సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన తర్వాత మా ఊరి కోడలు, ఎమ్మెల్సీ కవిత కృషితో మా గ్రామానికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. దీంతో రాంకిషన్రావు సారు, అధికారులు, నాయకులు గరీబోళ్లు ఎవరో తెలుసుకొని పైసా అడగకుండానే డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేశారు. ఇంటి పనులు షురూ చేసిన తర్వాత మూడు విడుతలుగా బిల్లులు వచ్చాయి. ఇప్పుడు మా పిల్లలతో సంతోషంగా కొత్తింట్లో ఉంటున్నాం.
– షేక్ సులేఖ, పోతంగల్