భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం దేశ వ్యాప్తంగా పెనుసంచలనం. ఒక వైపు రైతుల గుండెల్లో సంతోషం.. మరోవైపు దోపిడీ శక్తులు, నియంతృత్వ పాలకులకు గట్టి దెబ్బ. దేశానికి నాయకత్వం వహించగల అన్ని అర్హతలూ ఉన్న కేసీఆర్ నిర్ణయంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ప్రజాపక్షపాతి, దేశభక్తుడు, అభివృద్ధి ప్రదాత అయిన కేసీఆర్ను ఆశీర్వదించేందుకు దేశ ప్రజలంతా సిద్ధమవుతున్నారు. మేధావులు, రైతులు, కార్మికులు, యువకులంతా బీఆర్ఎస్కే జై కొడతారని ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు నిపుణులు, యువకులు నమస్తే తెలంగాణతో అభిప్రాయం పంచుకొన్నారు.
బోధన్, డిసెంబర్ 11: భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం దేశ రైతాంగానికి పండుగలాంటిది. భారతదేశమంటేనే రైతాంగం.. బీఆర్ఎస్ ఆవిర్భావంతో ఈ దేశ రైతుల దశ మారనున్నదనడానికి సంకేతం. తెలంగాణ ఆవిర్భావం అనంతరం అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రాష్ట్రంలోని రైతులకు ఎంతో గౌరవప్రదమైన స్థానం ఇచ్చారు. 24 గంటల కరెంట్, ధాన్యం కొనుగోళ్లతోపాటు పెట్టుబడుల కోసం రైతుబంధు, అలాగే రైతుబీమా ప్రతి రైతుకూ ఇచ్చి వారి జీవన ప్రమాణాలను పెంచారు. దీన్నే దేశంలోని రైతులు కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ అధినేతగా రేపటి రోజున వీటిని ఆయన దేశవ్యాప్తంగా అమలుచేస్తారన్న నమ్మకం ఉంది. తెలంగాణ మాదిరిగానే దేశవ్యాప్తంగా ఈ విషయంలో ఆయన నూరుశాతం సక్సెస్ అవుతారు.
– పూదోట రవికిరణ్, పీఆర్టీయూ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, బోధన్
బోధన్, డిసెంబర్ 11: బీఆర్ఎస్ ఆవిర్భావం దేశానికి శుభపరిణామం. బీజేపీ పాలకుల నియంతృత్వ, నికృష్ట పాలన నుంచి విముక్తి కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు, ఇతర కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకే ప్రధాని మోదీ పాలిస్తున్నారు. ఇలాంటి గుజరాత్ మోడల్ వద్దని ప్రజలు ఘోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఆవిర్భావమన్నది ఒక విప్లవాత్మక పరిణామం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం. ఢిల్లీ సింహాసనాన్ని కేసీఆర్ అధిరోహించి తీరుతారు.
– పల్నాటి సమ్మయ్య, న్యాయవాది, బోధన్
బోధన్, డిసెంబర్ 11: దేశ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర ఎంతో అవసరం. కేంద్రంలో ఉన్న బీజేపీ.. తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతున్నది. కేంద్రం చేపడుతున్న రైతు, ప్రజావ్యతిరేక విధానాలను దేశవ్యాప్తంగా ఎండగట్టేందుకు గులాబీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైందే. బీఆర్ఎస్ పార్టీకీ దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుంది. దేశ రాజకీయ వ్యవస్థ ముఖచిత్రం బీఆర్ఎస్ ఆవిర్భావంతో మారడం ఖాయం. దేశంలోని సమస్యలు, ప్రజల కష్టాలకు కారణమైన నియంతృత్వ పాలకులకు ఇక కాలం చెల్లింది.
– వై. సాయప్ప, విశ్రాంత ఎంపీడీవో, బోధన్
బోధన్, డిసెంబర్ 11: బీఆర్ఎస్ ఆవిర్భావం దేశానికి కొత్త రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకురానున్నది. బంగారు తెలంగాణ దిశగా మన రాష్ర్టాన్ని తీర్చిదిద్దినట్లే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మోడల్ అమలుకు ఈ దేశం నోచుకోనున్నది. దేశంలోని ఆయా ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం. బీఆర్ఎస్ ఆవిర్భావించడంతో దేశంలోని దోపిడీ శక్తులకు, కుట్రలు, కుతంత్రాలతో పెత్తందారీతనం చేస్తున్న విధ్వంసక శక్తులకు గట్టి దెబ్బ తగులుతుంది. మేధావులు, రైతులు, కార్మికులంతా బీఆర్ఎస్కు జై కొడతారనడంలో సందేహం లేదు. – తాళ్ల ఇంద్రకరణ్, న్యాయవాది, బోధన్
పిట్లం, డిసెంబర్ 11: బీఆర్ఎస్ ఆవిర్భావం దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక అధ్యాయం. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ సత్తా చూపిస్తారు. దేశ సమైక్యత, సమగ్రత కాపాడతారు. భారత రాజకీయ ముఖచిత్రంపై ఆయన బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తారు.
– సి.విజయ్, యువకుడు, పిట్లం
డిచ్పల్లి, డిసెంబర్ 11 : విజయదశమి రోజున పురుడు పోసుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల కమిషన్ ఆమోదముద్ర వేయడం అభినందనీయం. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడం గొప్ప విషయం. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవు. మన పథకాలన్నీ దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ని స్థాపించడం శుభపరిణామం.
– శ్రీకాంత్, రాంపూర్, డిచ్పల్లి
భీమ్గల్, డిసెంబర్ 11:గతంలో అనేక ప్రభుత్వాలను చూశాను. కానీ, రైతుల అభ్యున్నతికి పాటుపడిన ప్రభుత్వం మాత్రం ఒక్కటీ లేదు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులకు మంచి రోజులు వచ్చాయి. అనేక సంక్షేమ పథకాలతో రైతును రాజుగా చేసిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ రాకతో అనేక మార్పులు వస్తాయి.
-గంగారపు లింబన్న, సినీయర్ నాయకుడు, భీమ్గల్
నిజాంసాగర్, డిసెంబర్ 11: ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఉంటేనే దేశ ప్రజలు ధైర్యంగా.. సంతోషంగా ఉంటారు. ఎన్నో అద్భుతమైన ప్రజా సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేసి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. బీజేపీ పాలనలో దేశంలోని అన్నివర్గాల ప్రజలు సమస్యలతో అల్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తే బాగుంటుంది. దేశాన్ని కూడా అగ్రగామిగా నిలిపే సత్తా ఆయనలో ఉంది.
– దుర్గారెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్, నిజాంసాగర్
ఏర్గట్ల,డిసెంబర్ 11 : టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం చాలా సంతోషకరమైన విషయం. తెలంగాణలో యువకులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్న కేసీఆర్ దేశ వ్యాప్తంగా యువకులకు అండగా ఉంటారు. తెలంగాణలో సాధిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలవుతాయి.
-తాళ్ల అరవింద్ యువకుడు, బట్టాపూర్, ఏర్గట్ల