Nizamabad CP Sai Chaitanya | వినాయక్ నగర్, నవంబర్ 5: లంచం అనేది సమాజాన్ని పూర్తిగా దెబ్బతీస్తుందని, లంచం తీసుకోవడం పెద్ద నేరమని, లంచానికి వ్యతిరేకంగా ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య అన్నారు. అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఏసీబీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో లంచానికి వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు చౌరస్తా నుండి నిర్వహించిన ఈ ర్యాలీని సీపీ సాయి చైతన్య జెండా ఊపి ప్రారంభించారు.
విద్యార్థులతో నిర్వహించిన ఈ అవగాహన ర్యాలీ కోర్టు చౌరస్తా, తిలక్ గార్డెన్ చౌరస్తా, భగత్ సింగ్ చౌరస్తా, అక్కడనుండి తిరిగి బస్టాండ్ ముందు నుండి తిలగడం మీదుగా జిల్లా కోర్టు చౌరస్తా వద్ద ముగిసింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎవరైనా లంచం అడుగుతే అలాంటి వారిపై ఫిర్యాదు చేసేందుకు ఏసీబీ ఆధ్వర్యంలో క్యూఆర్ కోడ్ పద్ధతిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బాధితులు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు.
సమాజంలో లంచాన్ని ప్రోత్సహించడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు అందకుండా పోతాయని, దీన్ని గ్రహించి ప్రతీ ఒక్కరూ అవినీతికి వ్యతిరేకంగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వా రెడ్డి, ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్, ఇన్స్పెక్టర్ నగేష్, వన్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తో పాటు ఇతర సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.