బాన్సువాడ రూరల్, జూలై 22: ‘మంచం పట్టిన బోర్లం’ క్యాంపు అనే శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనానికి వైద్యాధికారులు స్పం దించారు. బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు గ్రామం లో పలువురికి జ్వరం, కీళ్లనొప్పులు, విషజ్వరాలు ప్రబలడంతోపాటు ఒకరికి చికున్‌గున్యా నిర్ధారణ అయ్యింది. దీంతో హన్మాజీపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కీళ్లనొప్పులు, జ్వరంతో బాధపడుతున్న వారికి వైద్యపరీక్షలు చేసి కావాల్సిన మందులను ఉచితంగా అందచేశారు.
వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఇంటింటికీ తిరుగుతూ బాధితుల వివరాలను సేకరించారు. గ్రామంలో వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు, దోమల నివారణకు థీమోపస్ ద్రావణాన్ని మురికి కాలువలు, ఇంటి పరిసరాల్లో పిచికారీ చేయించారు. ఎంపీహెచ్వో సుధాకర్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బోర్లం క్యాంపులో ప్రత్యేక వైద్య శిబిరాన్ని చేశామని, ఇంటింటికీ తిరుగుతూ 14మంది రోగుల రక్త నమునాలను సేకరించినట్లు తెలిపారు. గ్రామంలో ఒకరికి చికున్ గున్యా నిర్ధారణ కావడంతో అప్రమత్తమై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వైద్య శిబిరంలో హెచ్‌ఈవో సాయిలు, జీపీ సెక్రటరీ పరిపూర్ణ, వైద్య సిబ్బంది హిమబిందు, కారోబార్ వినయ్‌కుమార్, శివయ్య, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.