బాన్సువాడ, జనవరి 18 : బాన్సువాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం పరిశీలించారు. ఎలక్ట్రిక్ బగ్గీలో పర్యటిస్తూ అభివృద్ధి పనులతోపాటు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కల్కి చెరువు సమీపంలో ఏర్పాటు చేస్తున్న పార్కు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ.. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకే పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. బాన్సువాడ కల్కి చెరువును రూ.7 కోట్లతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని తెలిపారు. పట్టణ ప్రజల కోసం చెరువు పక్కనే రూ. 4కోటతో పార్కును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పార్కు అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టడంపై సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం పలుకాలనీల్లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్పీకర్ వెంట మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, నాయకులు రమేశ్, ఆమేర్ చావూస్, చందూర్ సర్పంచ్ సాయిరెడ్డి, వార్డు ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.