Pulse Polio | భిక్కనూరు, జూన్ 28 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భిక్కనూరు పరిధిలోని అన్ని గ్రామాల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ముమ్మరంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ జి.వి. రమణ, జాయింట్ డైరెక్టర్ (క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్), జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వెంకటి, సునీల్ రాజ్ సీహెచ్‌వో తదితరులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అధికారులు భిక్కనూరు బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ టీమ్‌ను, ఎస్సానపల్లి, పెద్దమల్లారెడ్డి గ్రామాల్లోని పోలియో బూత్‌లను పరిశీలించారు. అలాగే హైరిస్క్ ప్రాంతంగా గుర్తించిన పౌల్ట్రీ ఫారంలో ఉన్న చిన్నారులకు జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి.వి. రమణ స్వయంగా పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమం నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, హైరిస్క్ ప్రాంతాల్లోని పిల్లలను కూడా వదలకుండా ప్రతీ చిన్నారికి పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.