నిజామాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):వేసవిలో వన్యప్రాణులకు తగినంత నీటిని అందించడమే కాకుండా వేటగాళ్ల బారి నుంచి వాటిని కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. వన్యప్రాణులను వేటాడేందుకు ప్రయత్నించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని, అడవుల్లోని నీటి గుంటలను క్షుణ్ణంగా పరిశీలించాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, నీటిగుంటల వద్ద వలలు, ఉచ్చులు, విద్యుత్ తీగలేమైనా ఉంటే వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. నైరుతీ రుతుపవనాలు ప్రారంభమయ్యే వరకు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని సర్క్యూలర్లు జారీ చేశారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో అడుగడుగునా ట్రాకింగ్, ఇతర రక్షణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేసవిలో నీటి వనరులు ఎండిపోవడంతో వన్యప్రాణులు అడవుల నుంచి బయటికి వస్తున్నట్లు సమాచారం ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రతి గ్రిడ్‌లో కనీసం 2కిలోమీటర్ల వ్యాసార్థం కలిగిన నీటి వనరును ఏర్పాటు చేయాలని సూచించారు. గతంలో నిర్మించిన సాసర్ల పిట్లలో నీటిని నింపాలని, ట్యాంకర్ల ద్వారా నీరు రవాణా చేయాలని తెలిపారు.
359చోట్ల నీటి జాడలు…
మండుతున్న ఎండలతో అటవీ ప్రాంతాల్లోని కుంటలు, చెక్‌డ్యాములు, చెరువులు, వాగులు ఎండిపోయాయి. ఈ సమయంలో నీటి వసతి లేక వన్యప్రాణులు అల్లాడుతుంటాయి. కొన్ని జంతువులు నీటి కోసమే జనావాసాలు, పొలాల్లోకి వస్తుంటాయి. వాటి అవసరాలను ముందుగానే గుర్తించిన అటవీశాఖ వివిధ రూపాల్లో నీటిని అందించేందుకు చర్యలు చేపట్టింది. ఎక్కడా సమస్య తలెత్తకుండా ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అటవీ విస్తీర్ణం మొత్తం 86,627.43 హెక్టార్లలో ఉండగా అందులో చిరుతలు, జింకలు, ఎలుగుబంట్లు, హైనా లు, నెమళ్లు, అడవి పందులు, నక్కలు, ముంగీసలు, పాములు, ఇతర పక్షిజాతులున్నాయి. నిజామాబాద్ డివిజన్ పరిధిలో 53,022.13 హెక్టార్లు, ఆర్మూర్ డివిజన్ పరిధిలో 33,605.30 హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది. అటవీ విస్తీర్ణాన్ని పర్యవేక్షించేందుకు బీట్ ఆఫీసర్లు ఉన్నారు. వారే రోజూ తమకు కేటాయించిన ప్రాంతంలోని వన్యప్రాణులకు తాగునీటిని అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి 9కిలో మీటర్లకు ఒక నీటి వనరు తప్పనిసరిగా ఉండాలి. అలా లేకపోతే అక్కడ కృత్రిమంగా వనరులను ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం రూ.15వేలు వెచ్చిస్తూ నేలపై సాసర్ ఆకారంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా అడవుల్లో సహజ సిద్ధమైన కుంటలు, సిమెంట్‌తో నిర్మించిన సాసర్ పిట్లు మొత్తం 359ఉన్నాయి. 285 సాసర్ పిట్లు ఉండగా, 74 సహజ సిద్ధంగా ఏర్పడిన నీటి కుంటలున్నట్లుగా అటవీ అధికారులు వెల్లడించారు.
అడుగడుగునా కందకాలు..
అటవీ ప్రాంతంలో బోర్లు తవ్వారు. కొన్నిచోట్ల ఇవి సోలార్‌తో పనిచేస్తున్నాయి. గుంతల్లో నీటిని నింపడంతో వాటికి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. తరచుగా అటవీ ప్రాంతాల్లో వాటి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. సాసర్ పిట్లలోనూ నీటిని సమృద్ధిగా నింపుతున్నారు. పరిసరాలు సైతం పచ్చగా ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. అడవుల సంరక్షణతోపాటు రక్షణ కోసం ఏర్పాటు చేసిన కందకాలు ఆక్రమణకు అడ్డుకట్ట వేస్తున్నాయి. పరిసర ప్రాంతాల్లోని రైతులు తరచుగా తమ వ్యవసాయ పొలాలను దున్నుతూ అటవీ ప్రాంతాలను అన్యాక్రాంతానికి గురిచేస్తున్నారు. దీంతో తరచుగా అటవీ శాఖ, అన్నదాతల మధ్య చిచ్చు రగులుతున్నది. ఇది స్నేహపూరిత వాతావరణాన్ని దెబ్బతీస్తోందని భావించిన అధికారులు ఆక్రమించుకోకుండా ఉండేందుకు కందకాలను ఏర్పాటు చేశారు. దీంతో క్రమేపీ ఆక్రమణకు తెరపడింది. మరోవైపు పల్లెల్లో ఇండ్ల నిర్మాణం జరిగినా, వివాహాలు జరిగినా నేరుగా అడవుల్లోకి వెళ్లి కర్రలను యథేచ్ఛగా నరికివేసి తీసుకెళ్లేది. వాహనాలు వెళ్లేందుకు అనువుగా లేకపోవడంతో చాలా వరకు పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఓవైపు అటవీ సంపదకు, మరోవైపు మూగ జీవాలకు మనుషుల నుంచి ఎదురవుతున్న ముప్పును తప్పించేందుకు అటవీశాఖ ఈ ఏర్పాట్లు చేస్తున్నది.
గోదావరి తీరం.. హరిణ విహారం
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సమీపంలో ప్రకృతి అందాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. నందిపేట ప్రాంతాన్ని ఆకుకొని ఉన్న గోదావరి తీరంలో జింకలు గంతులేసి ఆడుతూ చూపరుల మనసులను దోచేస్తున్నాయి. చుట్టూ పచ్చని పంట పొలాలు ఆహ్లాదాన్ని పంచుతుండగా, మరోవైపు అలల సవ్వడులతో శ్రీరాంసాగర్ జలాలు.. వీటి మధ్యలో జింకల ఆటలు కనువిందు చేస్తున్నాయి. గోదావరి తీరంలో నిజామాబాద్‌కు చెందిన వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ క్యాతం సంతోష్‌కుమార్ ఈ చిత్రాలను తన కెమెరాలో బంధించారు.
మూగజీవాల దాహార్తికి ఇబ్బంది లేదు
నిజామాబాద్ జిల్లాలోని 86వేల హెక్టార్లలో ఆవరించి ఉన్న అటవీ ప్రాంతంలో సమృద్ధిగా నీటి జాడలున్నాయి. ఇందులో కృత్రిమంగా నిర్మించినవి, సహజ సిద్ధంగా ఏర్పడిన నీటి కుంటలు, చిన్నపాటి చెరువులు నెలకొన్నాయి. గతంలో వారానికోసారి సాసర్ పిట్లలో నీళ్లు నింపి మూగజీవాల దప్పికను తీర్చేది. ఎండలు తీవ్రంగా ఉండడంతో ప్రభుత్వ ఆదేశాలతో వారానికి రెండుసార్లు సాసర్ పిట్లల్లో నీళ్లను నింపి జంతువుల దప్పికను తీరుస్తున్నాం.
– సునీల్ ఎస్.హీరామత్, నిజామాబాద్ జిల్లా అటవీ అధికారి