e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home నిజామాబాద్ మూలమెరిగి మూలికా వైద్యం

మూలమెరిగి మూలికా వైద్యం

మూలమెరిగి మూలికా వైద్యం
  • మొక్కల ఔషధంతో వ్యాధులు పరార్‌
  • కరోనా నేపథ్యంలో నాటువైద్యానికి ప్రాముఖ్యత
  • నిజామాబాద్‌ జిల్లాలో వ్యాధులు నయం చేస్తున్న మూలికా వైద్యులు

-మాక్లూర్‌ / సిరికొండ/ ఖలీల్‌వాడీ, జూన్‌ 24:మూలికా వైద్యం.. ఒకప్పుడు అది ప్రాచీన వైద్యం.. ఇప్పుడిదే ట్రెండింగ్‌.. కరోనా మహమ్మారి పుణ్యమా అని కొన్ని రకాల రుగ్మతలకు మూలికా వైద్య విధానంలోనే పరిష్కారాలు దొరుకుతుండడంతో ఆదరణ పెరుగుతున్నది. మూలికా వైద్యానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రకృతి శరీరధర్మంపై చూపే ప్రతికూల ప్రభావాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి మూలవాసులు మూలికలనే ఆశ్రయించేవారు. ఆధునిక జీవితంలోనూ మూలికలు అంతర్భాగంగా మారిపోతున్నాయి. మూలికా వైద్యంతో మొండి రోగాలు నయం అవుతాయనేది కొందరి నమ్మకం. ప్రధానంగా పచ్చకామెర్లు, పాము, తేలుకాటు, ఎముకలు విరిగిన వారితోపాటు దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, చర్మవ్యాధులకు మొక్కల నుంచి తయారు చేసిన పసరుమందులు అద్భుతంగా పని చేస్తాయని విశ్వసిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో సైతం పలువురు మూలికావైద్యుల వద్ద ఇప్పటికీ పసరు మందులు తాగేందుకు జిల్లాలు, రాష్ర్టాలు దాటి వస్తుంటారు ప్రజలు.

నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం అమ్రాద్‌ గ్రామానికి చెందిన గణపతిరావు, విజయలక్ష్మి దంపతులు నాటువైద్యంతో పచ్చ పసిరికలు, తెల్ల పసిరికల(కామెర్ల)ను తగ్గిస్తున్నారు. సుమారు వందేండ్లుగా వీరి వంశస్థులు పచ్చకామెర్లకు మందు తయారు చేస్తున్నారు. దవాఖానల్లో సైతం నయం కాని ఈ వ్యాధికి ఆవు లేదా మేక పాలలో కలిపిన పసరుతో నయం చేస్తున్నారు. వారంలో మూడు రోజులు ఆకులతో చేసిన మందును పంపిణీ చేస్తారు. ఐదు వారాలు మందు తీసుకోవడంతోపాటు పత్యం(నిబంధనలు) పాటించాలని సూచిస్తారు. అమ్రాద్‌ గ్రామస్తులకు ఉచితంగా, ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి వచ్చే వారికి ఐదు వారాలకు కేవలం రూ.100 ఫీజు తీసుకుంటారు. ఈ మందు కోసం హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల ప్రజలతోపాటు మహారాష్ట్రలోని ధర్మాబాద్‌, ముంబైవాసులూ వస్తుంటారు.

- Advertisement -

ఆయుర్వేద మందులతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు నిజామాబాద్‌ నగరంలోని మూలికావైద్యుడు శ్రీహరి. ఎనిమిది సంవత్సరాలుగా లలితాంబికా సేవా ట్రస్టు ద్వారా అనేక రోగాలకు ఆయుర్వేద మందులను తయారు చేస్తూ ప్రజలకు అందిస్తున్నారు. రోగనిరోధక శక్తి పెరుగుదలతో సర్వరోగాలు దూరమవుతాయని చెబుతున్నారు. మోర్తాడ్‌ మండలం తిమ్మపూర్‌ గ్రామానికి తాత లక్ష్మిరాజ్యం, తండ్రి కృష్ణభూషణ్‌ల నుంచి ఈ వైద్య విధానాన్ని నేర్చుకున్నాడు. తరతరాల నుంచి ఈ వైద్యం ద్వారా కీళ్లనొప్పులు, వాపులు, చికున్‌గున్యా, స్వైన్‌ఫ్లూ తదితర రోగాలకు ఈ మందు ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెంచి వ్యాధిని నయం చేస్తున్నారు. కొరియర్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రల్లోని పలు ప్రాంతాలతోపాటు మన రాష్ట్రంలోని పలువురు బాధితులకు మందులను పంపిస్తుంటారు. ఇంట్లో ఉండే, మనకు కనబడే ప్రకృతి వనాలతోనే ఈ మందును తయారు చేయడం విశేషం.

బోన్‌ ‘సెట్‌’ చేస్తారు

నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని పెద్దవాల్గోట్‌ గ్రామం ఎముకలు అతికించే నాటువైద్యానికి ప్రసిద్ధి. షేక్‌ బాబన్‌సాబ్‌ వంశస్థులంతా నాటువైద్యం చేస్తూ విరిగిన ఎముకలను అతికిస్తున్నారు. ప్రస్తుతం బాబన్‌సాబ్‌ వంశానికి చెందిన లియాఖత్‌ అలీ, ఖదీర్‌, ఇమ్రాన్‌ నాటువైద్యంతో ప్రజలకు సేవలందిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 20 శాఖలు ఏర్పాటు చేశారు. వైద్య విధానం కొత్త పుంతలు తొక్కుతున్నా పట్టణ, గ్రామీణ ప్రజలు ఇప్పటికీ వీరి సేవలను పొందుతుడడం గమనార్హం.తెల్లని ఖాదీ వస్త్రం, చండురం, నాటుకోడి గుడ్డు, వెదురు బొంగుల పుల్లలు వినియోగించి పట్టీ కడతారు. దీంతోపాటు ఎముకలు అతికించే ఔషధ మొక్క చుర్ణం,నువ్వుల నూనె ఔషధంగా ఇస్తారు. మటన్‌ కిమా, ఆకుకూరలను ఎక్కువగా తినాలని చెబుతారు. పుల్లని పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తారు.

పూర్వీకుల నుంచి నేర్చుకున్నాం
నాటువైద్యాన్ని పూర్వీకుల నుంచి నేర్చుకున్నాం. మా తాత బాబన్‌సాబ్‌ మొదలుకొని మేమంతా ఎముకల వైద్యాన్ని కొనసాగిస్తున్నాం. ఔషధ మొక్కలతో మందును ఇస్తూ ప్రకృతి సిద్ధంగా లభించే వాటినే మా వైద్యంలో ఉపయోగిస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆదరణ తగ్గలేదు. ఎముకల చికిత్స కోసం పొరుగు రాష్ర్టాల నుంచి మా వద్దకు వస్తున్నారు.
-లియాఖత్‌ అలీ,నాటువైద్యుడు

మందు తయారీ..

కొన్ని ఆకులను(చెప్పకూడదు) దంచి పసరును తయారు చేస్తారు. ఆ పసరును ఆవు లేదా మేకపాలలో కలిపి పసిరికలు(కామెర్లు) సోకిన వారికి తాగిస్తారు. ఉదయం పూట పరిగడుపున (ఖాళీ కడుపు) మాత్రమే సేవించాల్సి ఉంటుంది. ఈ మందు తాగే ముందు నీరు, చాయ్‌, పాలు ఇలా ద్రవ రూపంలో ఏదీ తీసుకోవద్దని చెబుతారు. పసిరికలు (తెల్ల, పచ్చ కామెర్లు) సోకినవారు మందు తీసుకున్న సమయంలో నూనెతో తయారు చేసిన పదార్థాలు తినకూడదు. వంకాయ, ఆలుగడ్డ, పసుపుతో తయారు చేసే వంటలు, నాన్‌వెజ్‌ తినొద్దు. పత్యం పాటించకపోతే పసిరికలు కాలేయానికి చేరి ప్రాణాపాయం తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతున్నారు గణపతిరావు, విజయలక్ష్మి.

మూలికా హల్వా తయారు చేసే విధానం
తమలాపాకులు, తెల్ల జిల్లేడు పూలు, తేనే, తాటిబెల్లం, లవంగాలు, కరక్కాయ, ఉసిరి, వేపాకు, వెల్లిరసం, పసుపు, మద్దిచెక్క చూర్ణాలతో హల్వా తయారు చేస్తారు. దీని ద్వారా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. దగ్గు, తెమడ తదితర ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.

స్నానపు నీటితోనూ..
ఆయిల్‌ ఆకు, నీలగిరి ఆకు, తక్కెళ్లాకు, బొబ్బిలి చెక్క, (తుమ్మ) , పసుపు, వేపాకులను నీటిలో మరగబెట్టాలి. ఆ నీటితో రోజూ స్నానం చేస్తే సర్వరోగాలు పోతాయి.

ఇంట్లో వైద్యంతో రోగాన్ని తరిమేయచ్చు
ఎనిమిది సంవత్సరాలుగా ఈ వైద్యం చేస్తున్నా. ప్రజలకు ఉచితంగా మందులు అందిస్తున్నా. లాలజలంతో శారీరక పోషక రసాయనాలను మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచుకునేందుకు మంచి ఆహారం తీసుకోవాలి. భూమిలో నుంచి వచ్చిన ప్రకృతి సహజ సిద్ధమైన ఔషధంతోనే ఈ మందులను తయారు చేస్తాం. దాతలు ముందుకు వస్తే ప్రజలకు మరింత సేవలందిస్తా. మందులు కావాల్సిన వారు 96187 53294 నంబర్‌ను సంప్రదించవచ్చు.
-శ్రీహరి,మూలికా వైద్యులు

మందు మంచిగా పని చేస్తుంది
పసిరికలు తగ్గేందుకు ప్రైవేటు దవాఖానకు వెళ్తే వేలల్లో ఖర్చు అవుతుందని చెప్పారు. ఐదు వారాలపాటు పసరు మందు తాగడంతో పసిరికలు తగ్గాయి. పసరు మందు తాగితే ఆకలి వేస్తుంది. జీర్ణవ్యవస్థ కూడా మంచిగా పని చేస్తుంది. లోజ్వరం ఉంటే తగ్గిపోతుంది. గ్రామస్తులకు ఉచితంగానే మందు ఇస్తారు. ఎక్కడెక్కడి నుంచో పసరు మందు తాగేందుకు వస్తారు.
-మాస్టర్‌ సుజాత, అమ్రాద్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మూలమెరిగి మూలికా వైద్యం
మూలమెరిగి మూలికా వైద్యం
మూలమెరిగి మూలికా వైద్యం

ట్రెండింగ్‌

Advertisement