ఖలీల్‌వాడి, సెప్టెంబర్ 28 : పిడికెడు గుండె మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. గుండె మనకు అత్యంత కీలకమైన అవయవం. గుండె ఆరోగ్యంగా ఉంటే.. మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యకరమైన ఆహారం, శరీరానికి వ్యాయామం, దురలవాట్లకు దూరంగా ఉండడం గుండె ఆరోగ్యానికి రాచబాట వేస్తాయి. సమయానికి నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, పొగాకును మానుకుంటే చాలు మీకు గుండెపోటు వచ్చే ప్రమాదం తప్పినట్లే. అస్థిరంగా రొమ్ము నొప్పి, రక్తపోటు అధికమవడం, గుండె పని విధానంలో అసాధారణంగా ఉండడం లాంటివి కనిపించగానే వైద్యుడిని సంప్రదించాలి. నేడు (గురువారం) ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సభ్యులు గుండె వ్యాధులు, వాటికి కారణాలు, జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నది. పొగాకు వినియోగం, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక స్తబ్ధత, మద్యం తాగడాన్ని నియంత్రించడం ద్వారా కనీసం 80శాతం గుండె సంబంధిత మరణాలను తగ్గించవచ్చని పేర్కొన్నది.
ఆహార నియమాలు పాటించక..
చిన్నతనంలో ఆహార నియమాలు పాటించకపోతే ఎదిగే వయస్సులోనే గుండెజబ్బులు ఎదురయ్యే ప్రమాదముంది. విద్యార్థులు జంక్‌ఫుడ్, స్నాక్స్‌ను ఇష్టంగా తింటుంటారు. టిఫిన్ మొదలు రాత్రి భోజనం వరకు పిల్లల ఆహారంలో జంక్‌ఫుడ్ ఉంటున్నది. అలాంటివి తినడం ద్వారా కొలెస్ట్రాల్ శాతం పెరిగి రక్తనాళాల్లో పేరుకుపోతుంది. ఐదు నుంచి పదేండ్ల వయస్సులో జంక్‌ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్‌కు అలవాటుపడిన వారిలో 15 నుంచి 20 ఏండ్లు వచ్చే సరికి రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడుతున్నట్లు నివేదికలే చెబుతున్నాయి. ప్రతి వెయ్యి మంది పిల్లల్లో ఒకరికి విద్యార్థి దశలోనే గుండె జబ్బుకు బీజం పడుతున్నది.
ఇతర జబ్బులతో ముప్పు
మధుమేహం, అధిక బరువు, కిడ్నీ, కాలేయం వంటి జబ్బులతో బాధపడుతున్న వారిలో ఎక్కువగా గుండెజబ్బుల బారిన పడుతున్నారు. అందులో మధుమేహం, హైపర్ టెన్షన్ ఉన్న 20 నుంచి 30 ఏండ్ల వయస్సు వారే. వారిలోనూ రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడడం, కండరాలు ఉబ్బడం వంటి సమస్యలు ఉంటున్నాయి. చిన్న వయస్సులోనే యాంజియోగ్రామ్ చేయడం, స్టంట్లు వేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
సరిగా నిద్రలేకపోతే..
టీవీ, సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తూ చాలా మంది అర్ధరాత్రి వరకు నిద్రపోవడం లేదు. ఉదయం పూట పడుకోవడం ద్వారా హార్మోన్లు దెబ్బతింటున్నాయి. పడుకునే వేళలో పనిచేయడం, పని చేసే సమయాల్లో పడుకోవడం ద్వారా గుండె పనితీరులో తేడా ఉంటోంది. రాత్రిళ్లు మెలకువతో ఉండే వారికి గుండె జబ్బులు అధికంగా ఉంటున్నాయి.
గుర్తించడం ఇలా..
ఛాతినొప్పి వచ్చి అది కనీసం 20 నిమిషాల తర్వాతైనా తగ్గకపోతే.. మీకు గుండెపోటు వచ్చినట్లే అంటున్నారు డాక్టర్లు. ఎడమ దవడ, భుజం మీదుగా నొప్పి వస్తూ.. చేతికి విస్తరిస్తూ ఉంటే.. వెంటనే దవాఖానకు తీసుకెళ్లాలి. ఆలస్యమైతే.. ప్రమాద తీవ్రత పెరుగుతుంది.
అలర్ట్ అవ్వాలి..
ఛాతినొప్పి ఎక్కడ వస్తుందో అక్కడ నొక్కినప్పుడు నొప్పి ఎక్కువవుతూ ఉంటే.. అలాగే ఒకవైపు తిరిగితే నొప్పి పెరుగుతూ, మరోవైపు తిరిగితే నొప్పి తగ్గుతూ ఉంటే అది గుండెపోటు కాకపోవచ్చు. అందువల్ల హార్ట్ఎటాకా కాదా అనే దానిపై త్వరగా అలర్ట్ అవ్వాలి
యువకులే ఎక్కువ
హృద్రోగ నిపుణుల వద్దకు వచ్చే బాధితుల్లో యువకులే ఎక్కవగా ఉంటున్నారు. 20 నుంచి 40 ఏండ్లలోపు వారు అధికం, 18 నుంచి 20ఏండ్ల వారూ ఉన్నారు. 20 నుంచి 40 ఏండ్ల వారిలో 40శాతం మంది వరకు గుండెజబ్బు బాధితులు ఉంటున్నారు. ధూమపానం అలవాటే ఇందుకు కారణమవుతున్నది.
టీనేజర్లకు స్మోకింగ్ ఎఫెక్ట్
యువతలో స్మోకింగ్ ప్రభావం ఎక్కువగా ఉంది. చిన్న వయస్సులోనే కొలెస్ట్రాల్ శాతం పెరిగి రక్తనాళాల్లో రక్తం సరఫరాకు అవరోధం కలుగుతున్నది. చిన్న వయస్సులోనే కొంతమంది పిల్లలకు గుండెకు రంధ్రాలు ఏర్పడతాయి. చికిత్స అందిస్తే టీనేజీలో గుండెజబ్బు రాదు. లేకుంటే పుట్టుకతో గుండెజబ్బులు ఉన్న కొందరిలో ఆ ప్రభావం టీనేజీలో కనిపిస్తుంది. దీంతో అకస్మాత్తుగా చనిపోయే ప్రమాదమూ ఉంది. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు గుండెజబ్బులు సంక్రమించే అవకాశాలున్నాయి.
-డాక్టర్ రవికిరణ్, గుండె వైద్య నిపుణులు, నిజామాబాద్
విపరీతమైన ఒత్తిడి
విద్యార్థులు విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఉదయం 5 గంటలకే మొదలవుతున్న చదువులు అర్ధరాత్రి వరకు సాగుతున్నాయి. నిద్రపోయే సమయం తక్కువగా ఉంటోంది. నాలుగు గోడల మధ్య బాల్యం నలిగిపోతున్నదని వైద్యులు పేర్కొంటున్నారు. మార్కులు రావాలి, ర్యాంకులు సాధించాలనే తాపత్రయంతో తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యాన్ని సరిగా పట్టించుకోవడం లేదని వైద్యులు చెబుతున్నారు.