మెండోరా, సెప్టెంబర్ 10 : రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు వరద గేట్ల ద్వారా నీటిని విడుదల చేపట్టారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఎస్సారెస్పీలోకి 1,08,540 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో సాయంత్రం ప్రాజెక్టు 22 వరదగేట్లను ఎత్తి గోదావరిలోకి 99,840 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ సీజన్లో ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 326.236 టీఎంసీల వరద వచ్చి చేరిందన్నారు. దీంతో గోదావరిలోకి, లక్ష్మి, సరస్వతి, వరద, కాకతీయ కాలువలకు 256 టీఎంసీల మిగులు జలాలను విడుదల చేశామన్నారు. వరద కాలువ, గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదల నిలిపివేసినట్లు ఏఈఈ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా శనివారం సాయంత్రానికి పూర్తిస్థాయి నీటి మట్టంతో నిండుకుండలా ఉందన్నారు.
నిజాంసాగర్‌కు భారీ ఇన్‌ఫ్లో
వరద గేట్ల ద్వారా 80వేల క్యూసెక్కుల నీటి విడుదల
నిజాంసాగర్, సెప్టెంబర్10: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి 34,200 క్యూసెక్కుల వరద వస్తుండడంతో ప్రాజెక్టు ఎనిమిది గేట్ల ద్వారా శనివారం 80,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈ శివకుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా, శనివారం సాయంత్రం 1404.75 అడుగుల (17.44 టీఎంసీలు) వద్ద ఉన్నదని పేర్కొన్నారు. ఎనిమిది వరద గేట్ల ద్వారా 80,800 క్యూసెక్కుల నీటిని మంజీరలోకి విడుదల చేస్తుండగా మరో 800 క్యూసెక్కులు ప్రధాన కాలువ ద్వారా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇన్‌ఫ్లోకు అనుగుణంగా నీటి విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
రెండో సారి పొంగిన పోచారం
నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 10: మండలంలోని పోచారం ప్రాజెక్టు రెండోసారి పొర్లుతున్నది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నది. ఎగువ ప్రాంతాలైన గాంధారి, లింగంపేట్ మండలాల్లో వర్షాలు కురవడంతో 10,900 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.820 టీఎంసీల (1464 ఎంసీఎఫ్‌టీ)తో ఉంది. పోచారం ప్రధాన కాలువ ద్వారా 60 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా, 5207 క్యూసెక్కులు పొంగి ప్రవహిస్తోంది.