విద్యానగర్, జనవరి 5: కామారెడ్డి పట్టణ మాస్టర్‌ప్లాన్ ఖరారు విషయంలో రైతుల అభిప్రాయాలు, అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రైతులు నష్టపోయే విధంగా తమ ప్రభుత్వం ఎలాంటి పని చేయదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ప్రజల కోణంలోనే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో గురువారం జరిగిన పట్టణ ప్రగతి సదస్సులో కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదనలపై మంత్రి ఆరా తీశారు. అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ ఇంకా ఖరారు కాలేదని, ప్రస్తుతం ముసాయిదా దశలోనే ఉందని స్పష్టం చేశారు. రైతులు, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా తెలంగాణ ప్రభుత్వం పని చేయదన్నారు. ప్రస్తుత మాస్టర్‌ప్లాన్ ముసాయిదా మాత్రమేనని, ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. రైతులకు అభ్యంతరాలు ఉంటే తప్పకుండా ముసాయిదాలో మార్పులు చేస్తామన్నారు. మాస్టర్‌ప్లాన్ ఖరారులో రైతుల అభ్యంతరాలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి కేటీఆర్.. అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజలకు అనుకూలమైన రీతిలో మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని స్పష్టం చేశారు.
కామారెడ్డి మున్సిపల్‌కు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ అవార్డు
కామారెడ్డి మున్సిపల్‌కు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ (ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ) అవార్డు లభించింది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో గురువారం నిర్వహించిన పట్టణ ప్రగతి సదస్సులోరాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే,మున్సిపల్ కమిషనర్ దేవేందర్ ఈ అవార్డును అందుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ప్రజలు బహిరంగ మూత్ర విసర్జన చేయకుండా ఉండడం, కామారెడ్డిలోని 14 మరుగుదొడ్లు వినియోగించడం, సెప్టిక్ ట్యాంక్ శుద్ధి చేసే కర్మాగారం ఉండడం తదితర అంశాలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.