గాంధారి/లింగంపేట/ధర్పల్లి/బోధన్ రూరల్/నిజాంసాగర్/నాగిరెడ్డిపేట/ఎల్లారెడ్డి రూరల్/సిరికొండ, మార్చి 21: గాలివాన హోరెత్తించింది. రైతాంగానికి ‘అకాల’ నష్టం మిగిల్చింది. ఉమ్మడి జిల్లాలో గురు, శుక్రవారాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కొన్నిచోట్ల వడగండ్లు పడడంతో పంటలు దెబ్బ తిన్నాయి. వడ్లతో పాటు మామిడి కాయలు నేలరాలాయి. పిడుగులు పడి ఐదు జీవాలు మృత్యువాత పడ్డాయి. అకాల వర్షంతో కొం దరు రైతులు నష్టపోతే, మరికొందరికి మాత్రం లాభం చేకూరినట్లయింది. నీళ్లు లేక ఎండిపోతున్న వరి పైర్లకు ప్రస్తుత వాన జీవం పోసిందని రైతులు చెబుతున్నారు.
గాంధారి మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రా మాల్లో శుక్రవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అరగంటకుపైగా దంచికొట్టడంతో రోడ్లు జలమయమయ్యాయి. రాంలక్ష్మణ్పల్లిలో శౌరయ్యకు చెందిన మూడెకరాల మక్కజొన్న నేలకొరిగింది. కోత కోసిన మక్కజొన్న మెదలు తడిసి పోయా యి. నాగిరెడ్డిపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో జోరు వర్షం కురిసింది. విద్యార్థులు, వ్యాపారులు, వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు.
లింగంపేట మండలంలో పిడుగులు పడి రెండు గేదెలు, మూడు గొర్రెలు మృతి చెందాయి. బోనాల్, బాణాపూర్, బాయంపల్లి, మెంగారం, శెట్పల్లి, పోతాయిపల్లి, కోమట్పల్లి, లింగంపల్లి తదితర గ్రామాల్లో వర్షం కురిసింది. పిడుగు పడి లింగంపల్లి గ్రామంలోని సాకలి సాయిలు, గాలెం నారాయణకు చెందిన గేదేలు మృతి చెందగా, పోతాయిపల్లిలోని ఎర్రం రాజయ్యకు చెందిన మూడు గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
సిరికొండ, ధర్పల్లి మండలాల్లో వడగండ్లు పడ్డాయి. దీంతో ధాన్యం నేలరాలింది. పొలాల్లో రాలిన వడ్లను చూసి అన్నదాతలు కన్నీరుమున్నీరయ్యారు. ధర్పల్ల్లి మండలం వాడి, మద్దుల్ తండాల్లో వడగండ్ల వానతో వరి పైర్లు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు రాలిపోయాయి. గాలి దుమారానికి వాడి గ్రామంలో వేప చెట్లు విరిగి పడ్డాయి. పంట చేతికొచ్చే సమయంలో ఇలా అకాల వర్షం వెంటాడడంతో రైతు లు ఆందోళన చెందుతున్నారు. బోధన్ మండలంలో గురువారం రాత్రి కురిసిన ఈదురుగాలులతో వరి పైర్లు దెబ్బ తిన్నా యి. బండార్పల్లి గ్రామ శివారులో చేతికొచ్చిన వరి పంట నేలకొరిగింది. ఎల్లారెడ్డి మండలంలో శుక్రవారం సాయం త్రం ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు వీచాయి. మండల పరిధిలోని తిమ్మారెడ్డి గ్రామశివారులో బలమైన ఈదురు గాలులకు ఓ విద్యుత్ స్తంభం ట్రాన్స్ఫార్మర్పై పడిపోయింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభంతోపాటు ఓ చెట్టు కూడా కూలిపోవడంతో పంట దెబ్బతిన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, కొద్ది రోజులుగా దంచికొడుతున్న ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు.. ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం ఉపశమనం కలిగించింది. ఆకాశం మేఘావృతం కావడం, చల్లని గాలులు వీయడంతో ఎండ తీవ్రత తగ్గిపోయింది.