ఆదర్శంగా నిలుస్తున్న కొడిచెర్ల స్కూల్
60 నుంచి 137కు చేరిన విద్యార్థుల సంఖ్య
మన ఊరు-మన బడి’పై గ్రామస్తుల హర్షం
పేదలకు తప్పనున్న ఫీజుల భారం
కోటగిరి, ఫిబ్రవరి 7: ఆంగ్లమాధ్యమ నిర్వహణతో ఆ పాఠశాల ముఖచిత్రమే మారిపోయింది. గతంలో విద్యార్థులు లేక వెలవెలబోయిన పాఠశాల నేడు నాలుగింతలు పెరిగిన అడ్మిషన్లతో కళకళలాడుతున్నది. నిపుణులైన ఉపాధ్యాయులు, పైసా ఖర్చు లేని ఇంగ్లిష్ మీడియం బోధనతో విద్యార్థులు చదువుల్లో రాణిస్తున్నారు. ఆర్థికభారం తొలగిపోవడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో కొనసాగుతూ.. ‘మన ఊరు-మన బడి’ సంకల్పానికి మోడల్‌గా నిలుస్తున్నది కోటగిరి మండలంలోని కొడిచెర్ల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల.
ఆ పాఠశాలలో అన్ని సౌకర్యాలున్నా విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉండేది. ఆంగ్ల మాధ్యమం కోసం ఆ గ్రా మ విద్యార్థులు ప్రైవేట్ బాట పట్టారు. బడిలో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది. దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. గతంలో కేవలం 60లోపు ఉన్న విద్యార్థుల సంఖ్య నేడు 137కు చేరింది. కోటగిరి మండలానికి కూతవేటు దూరం లో ఉన్న కొడిచెర్ల గ్రామంలోని సర్కార్ బడి ఉపాధ్యాయుల కృషి, ఆంగ్ల మాధ్య మంలో బోధనతో ఆయువు పోసుకుంటున్నది. రెండేండ్లలో సుమారు 45 మంది విద్యార్థులు ప్రైవేటులో అడ్మిషన్ రద్దు చేసుకొని ప్రభుత్వ బడిలో చేరారు.
మనఊరు – మనబడితో మరిన్ని వసతులు..
ప్రభుత్వం ప్రారంభించనున్న మన ఊరు – మన బడి కార్యక్రమంతో సర్కారు పాఠశాలలకు మరిన్ని వసతులు సమకూరనున్నాయి. నీటి వసతితో కూడిన మరుగుదొడ్లు, విద్యుద్ద్దీకరణ, తాగునీటి సరఫరా, ఫర్నిచర్, పాఠశాలకు రంగులు, భవన మరమ్మతులు, చాక్‌బోర్డులు, ప్రహరీలు, వంట గది, శిథిలమైన గదుల స్థానంలో కొత్తవి నిర్మించనున్నారు. ఈ పనులకు సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతలను పాఠశాల నిర్వహణ కమిటీ(ఎస్ఎంసీ)లకు అప్పగిస్తారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి 40శాతం నిధులు, పంచాయతీరాజ్, ఎస్సీ,ఎస్టీ సబ్ప్లాన్ల నుంచి ‘మన ఊరు-మన బడి’ అమలుకు నిధులు కేటాయిస్తారు. రాబోయే రోజుల్లో అన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతుల నిర్వహణకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తారు.
తల్లిదండ్రుల కల సాకారం చేస్తున్నాం..
తమ పిల్లలకు ఆంగ్లం రావాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఆ కలను ఏడేండ్ల నుంచే మేము మా పాఠశాలలో సాకారం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తుండడంతో అన్ని ప్రభుత్వ పాఠశాలలు నూతన ఒరవడిని సృష్టిస్తాయి. పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించాలంటే ఆంగ్లంపై పట్టు ఉండాలి. మా పాఠశాలలో ప్రతి విద్యార్థి ఇంగ్లిష్‌లో మాట్లాడేలా సమష్టిగా కృషి చేస్తున్నాం. –నహీద్ సుల్తానా, పాఠశాల హెచ్ఎం, కొడిచెర్ల