ఆ ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే..
టీఆర్ఎస్ కమ్మర్పల్లి మండల నాయకులు
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పంపిన లేఖల ప్రదర్శన
కమ్మర్పల్లి, ఫిబ్రవరి 12 : కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న సమయంలోనూ రైతుబంధు ఇచ్చి రైతులకు అండగా నిలిచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్ బద్దం రాజేశ్వర్ అన్నారు. దీనిని గమనించకుండా కొందరు నాయకులు కోడి గుడ్డు మీద ఈకలు పీకిన చందంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మండలకేంద్రంలోని రైతువేదిక భవనంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బాల్కొండ నియోజకవర్గ రైతుల ఖాతాల్లో పెట్టుబడి డబ్బులు జమఅయిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. రైతుబంధు ద్వారా ఇప్పటివరకు నియోజకవర్గంలో ఎంతమంది రైతులకు, మొత్తం ఎన్ని కోట్ల పెట్టుబడి సాయం అందిందో తెలిపే లేఖలను రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తమకు పంపారని చెప్పారు. ఈ సందర్భంగా ఆ లేఖలను వారు ప్రదర్శించారు. కమ్మర్పల్లి మండలంలో ఇప్పటివరకు 63 కోట్ల 57 లక్షల ఒక వెయ్యి 235 రూపాయల రైతుబంధు సాయం రైతులకు అందిందని వివరించారు. ఇందుకుగాను సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు ద్వారా రైతులకు రూ.50 వేల కోట్ల పంట పెట్టుబడి సాయం అందించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. నియోజకవర్గంలో ఎస్సారెస్పీ పునర్జీవం, కాకతీయ, వరద కాలువలను మూడు కాలాల పాటు నిండుగా ఉంచడం, ఎత్తిపోతల పథకాలు అందించడం తదితర పనులను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చేపట్టడాన్ని జీర్ణించుకోలేని కొందరు నాయకులు విమర్శిస్తున్నారని అన్నారు. విమర్శలు మానుకొని చేసిన అభివృద్ధిని గమనించాలని హితవు పలికారు.
సమావేశంలో సర్పంచ్ గడ్డం స్వామి, ఎంపీటీసీ సభ్యుడు మైలారం సుధాకర్, కో-ఆప్షన్ సభ్యుడు అజ్మత్ హుస్సేన్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అరుణ్ రెడ్డి, నాయకులు ఏనుగు గంగారెడ్డి, లోలపు సుమన్, బోడ దేవేందర్, మోహన్‌నాయక్, సంతోష్ నాయక్, రేణి విజయ్, సుభాష్ గౌడ్, సర్పంచులు ఏనుగు రాజేశ్వర్, మారు శంకర్, ఎంపీటీసీ సభ్యులు గంగాధర్ నాయక్, సామ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.