కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి పిలుపు
నిజామాబాద్‌సిటీ/ కామారెడ్డి టౌన్, ఫిబ్రవరి 12: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకుతీసుకెళ్లాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. శనివారం వారు హైదరాబాద్ నుంచి నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు నారాయణరెడ్డి, జితేశ్ వీ పాటిల్‌తో ‘మన ఊరు- మన బడి’కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు కేజీటు పీజీకి అడుగులు పడుతున్నాయన్నారు. తొలివిడుతగా మూడో వంతు పాఠశాలల్లో మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని అమలుచేయాలని, దీని ద్వారా 60శాతం మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. అవసరమైన చోట మరమ్మతులు, అదనపు గదుల నిర్మాణం, ల్యాబోరేటరీ, లైబ్రరీ, ప్రహరీ, కిచెన్‌షెడ్స్, నీటి వసతి, విద్యుత్, ఫర్నిచర్, డిజిటల్ విద్యాబోధనకు సంబంధించిన పనులు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 9123 పాఠశాలలను గుర్తించినట్లు తెలిపారు. తొలివిడుతలో రూ.3,497 కోట్లు వెచ్చిస్తున్నట్ల చెప్పారు. వందమంది విద్యార్థులకు పైగా ఉన్న పాఠశాలలను తొలివిడుత జాబితాలో ఎంపిక చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. విరాళాలు అందించేందుకు ముందుకు వచ్చే ఎన్ఆర్ఐలు, పూర్వ విద్యార్థులు, ఇతర దాతలను ప్రోత్సహించాలన్నారు. వారి ఆర్థిక సహాయంతో బడులను మరింతగా అభివృద్ధి చేసుకోగలుగుతామన్నారు. దాతలు రూ.పది లక్షలు విరాళం అందిస్తే తరగతి గదికి వారి పేరు పెట్టవచ్చని, రూ.25లక్షలు విరాళం అందిస్తే పాఠశాలల్లోని ఓ విభాగం మొత్తానికి వారి పేరు పెట్టాలని సూచించారు. కామారెడ్డిలో ఏర్పా టు చేసిన వీసీలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డీఈవో రాజు, జడ్పీ సీఈవో సాయాగౌడ్ పాల్గొన్నారు. నిజామాబాద్‌లో కలెక్టర్ నారాయణరెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా పాల్గొన్నారు. వీసీ అనంతరం నిజామాబాద్ కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘మన ఊరు- మన బడి’అమలుకు ఎంపికైన పాఠశాలల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న వసతులు గుర్తించి పూర్తి సమాచారంతో జాబితాను అందించాలని ఆదేశించారు.