కామారెడ్డి/మాచారెడ్డి/దోమకొండ/ భిక్క నూరు/రాజంపేట్, ఫిబ్రవరి 2: ఆడబిడ్డలు ఉన్న పేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం బాసటగా నిలుస్తున్నదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంతోపాటు మాచారెడ్డి, రాజంపేట్, దోమకొండ, భిక్కనూరు మండలాల లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అడబిడ్డల పెండ్లి చేసే తల్లిదండ్రులకు ఈ పథకం ద్వారా ఆర్థికభారం తగ్గుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, మాచారెడ్డి తహసీల్దార్ శ్వేత, జడ్పీటీసీ తిర్మల్గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కామారెడ్డి, ఫిబ్రవరి 2 : జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పలువురు దివ్యాంగులకు ఉపకరణాలు, త్రిచక్ర వాహనాలతోపాటు ఆర్థికసాయం అందజేశారు. వీటిని కామారెడ్డి పట్టణంలోని క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే కాటిపల్లి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దివ్యాంగులు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి ప్రోత్సహిస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి బాబయ్య, సీడీపీవో రోచిష్మ, ఫీల్డ్ రేంజ్ ఆఫీసర్ నరేశ్ పాల్గొన్నారు.