మోర్తాడ్, మే 8: బాల్కొండ నియోజకవర్గంలో నేడు జరగనున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ, అధికారిక కార్యక్రమాలను భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేశామని, తదుపరి తేదీని మళ్లీ ప్రకటిస్తామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపి, సామాన్యులను బలితీసుకున్న నేపథ్యంలో భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందేనని పేర్కొన్నారు. ఒక భారతీయుడిగా ఈ చర్యను సమర్థిస్తూ గర్విస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదనే సందేశం ఇస్తూ, భారత సైన్యం వీరోచిత పోరాటాన్ని యావత్ భారతావని అభినందిస్తున్నదని తెలిపారు. ఉగ్రవాదం పై భారత సైన్యం చేస్తున్న పోరులో పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరం ఏకమై మద్దతుగా నిలబడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఏర్పడిన యుద్ధవాతావరణం దృష్ట్యా బాల్కొండ నియోజకవర్గంలో నేడు జరగాల్సిన పలు అభివృద్ధి ప్రారంభోత్సవ, అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.