నిజామాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;జూనియర్ పంచాయతీ కార్యదర్శుల్లో ఆనందం వెల్లివిరిస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రకటనతో వారిలో అంతులేని ఉత్సాహం కనిపిస్తున్నది. క్రమబద్ధీకరణ కోసం కొంత కాలంగా ఎదురు చూస్తున్న జేపీఎస్‌లకు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం తీపికబురు అందించారు. రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించారు. క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయనున్నది. కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేసి రెగ్యులరైజేషన్ ప్రక్రియ చేపట్టనున్నది. సర్కారు నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలోని 809 మందికి లబ్ధి జరిగే అవకాశముంది.త్వరలోనే తమ ఉద్యోగాలు రెగ్యులర్ కానుండడంతో జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్నారు. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని జేపీఎస్‌లు చెబుతున్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు.
రాష్ట్రంలోని పల్లెలు దేశంలో అభివృద్ధికి నమూనాగా మారుతున్నాయి. ఏటా జాతీయ స్థాయిలో అనేక గ్రామాలకు అవార్డులు సైతం వరిస్తున్నాయి. ఇందుకు సీఎం కేసీఆర్ దూరదృష్టితో పల్లెలు సరికొత్తగా రూపాంతరం చెందుతుండడమే కారణం. పల్లె ప్రగతి పేరిట చేపట్టిన కార్యక్రమాలతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. ఇందులో సర్కారు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ అమలు చేయడంలో పంచాయతీ సిబ్బంది పోషిస్తున్న పాత్ర కూడా ఉంది. పల్లె ప్రగతి అమలుకు ముందే జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం నియమించింది. వీరంతా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తూ గ్రామాల అభివృద్ధిలో పాత్రదారులవుతున్నారు. వీరు కొంత కాలంగా తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ సర్కారును కోరడంతో.. సీఎం కేసీఆర్ శుభవార్తను అందించారు. త్వరలోనే జూనియర్ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించడంతో జేపీఎస్‌లు ఆనందోత్సవాల్లో మునిగితేలుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమ ఉద్యోగాలకు భరోసా దక్కుతోందని చెబుతున్నారు. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామంటూ ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు.
ఉమ్మడి జిల్లాలో 809 మంది జేపీఎస్‌లు…
నిజామాబాద్ జిల్లాలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 391 మంది ఉన్నారు. 30 మంది అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పంచాయతీ సెక్రటరీలుగా పనిచేస్తున్నారు. సీనియర్ పంచాయతీ సెక్రటరీలు 117 మంది ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో 418 మంది జూనియర్ పంచాయతీ సెక్రటరీలున్నారు. 51 మంది అవుట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలున్నారు. మరో 50 మంది వరకు సీనియర్ పంచాయతీ సెక్రటరీలు వివిధ గ్రామాల్లో పనిచేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ప్రయోజనం చేకూరనున్నది. నిజామాబాద్‌లో 391 మంది, కామారెడ్డిలో 418 మంది కలుపుకొని మొత్తం 809 మంది ఉద్యోగాలు క్రమబద్ధీకరణకు నోచుకోనున్నాయి. వీరంతా మూడున్నరేండ్ల క్రితమే ప్రభుత్వ నియామక సంస్థ నిర్వహించిన అర్హత పరీక్ష ద్వారా నియామకం అయ్యారు. వీరిలో కొద్ది మంది ఎప్పటికప్పుడు ఇతరత్రా ఉద్యోగాల్లో చేరడంతో పోస్టులు ఖాళీ అయ్యాయి. ప్రతిష్టాత్మకమైన పల్లె ప్రగతి కార్యక్రమంపై ఖాళీల ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో అర్హత పరీక్షలో మెరిట్‌ను ప్రాతిపదికన తీసుకొని ఎప్పటికప్పుడు కొత్త వారికి అవకాశాలు కల్పించారు. తద్వారా గ్రామాల్లో పరిపాలన వ్యవస్థ కుంటుపడకుండా పంచాయతీ రాజ్ శాఖ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకున్నది.
కలెక్టర్ నేతృత్వంలో కమిటీలు…
సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో జిల్లాస్థాయిలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల రెగ్యులరైజేషన్ కోసం కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఈ కమిటీలు జేపీఎస్‌ల పనితీరును సమీక్షించడంతోపాటు కలెక్టర్లు నివేదికను రూపొందించి ప్రభుత్వానికి పంపుతారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాను సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో త్వరలోనే మార్గదర్శకాలు విడుదల అయ్యే అవకాశాలున్నాయి. జేపీఎస్‌ల పనితీరు మదింపునకు జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీలు కలెక్టర్ల ఆధ్వర్యంలోనే పనిచేస్తాయి. జిల్లా కమిటీలో స్థానిక సంస్థలకు పనిచేస్తున్న అదనపు కలెక్టర్, జిల్లా అటవీ శాఖ, జిల్లా ఎస్పీ లేదంటే పోలీస్ కమిషనరేట్‌లో డీసీపీ స్థాయి అధికారిని సభ్యులుగా నియమించనున్నారు. ఈ కమిటీపై రాష్ట్ర స్థాయి నుంచి ప్రభుత్వ కార్యదర్శి లేదంటే పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు పరిశీలకులుగా పని చేస్తారు. రాష్ట్ర స్థాయిలో పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీని నియమిస్తారు. జిల్లా కమిటీ పంపించిన ప్రతిపాదనను రాష్ట్ర కమిటీ పరిశీలన చేసి తుది నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేస్తుంది. నివేదికలను పరిశీలించిన తర్వాత రెగ్యులరైజేషన్‌కు లైన్‌క్లియర్ అవుతుంది.
జేపీఎస్‌ల జోష్…
నెల రోజుల క్రితం కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వారం రోజుల క్రితమే గ్రామ రెవెన్యూ సహాయకులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. తాజాగా జూనియర్ పంచాయతీ సెక్రటరీలను సైతం క్రమబద్ధీకరించబోతున్నట్లుగా వెల్లడించడంతో వేలాది కుటుంబాల్లో సీఎం కేసీఆర్ భరోసాగా నిలిచారు. ఇచ్చిన మాటను నెరవేర్చడంతోపాటు చిరు ఉద్యోగులకు బాసటగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. గ్రామస్థాయిలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కృషిచేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలను క్రమబద్ధీకరించడంతో పరిపాలన మరింత మెరుగవ్వనున్నది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజేషన్ చేస్తామని సీఎం చేసిన ప్రకటన నేపథ్యంలో జేపీఎస్లంతా ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు క్షీరాభిషేకాలు నిర్వహించి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
సీఎంకు జీవితాంతం రుణపడి ఉంటాం..
గ్రామాల్లో పనిచేసే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినందుకు చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ సార్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. గ్రామ రూపురేఖలు మార్చడంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నాలుగేండ్లుగా పని చేస్తూ వస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందేలా తమవంతు కృషిచేశాం.
– అనిత, జేపీఎస్, కొడిచెర్ల, మండలం పొతంగల్
ప్రత్యేక ధన్యవాదాలు..
ఉద్యోగాలు రెగ్యులరైజ్ అవుతాయన్న మా కలలను సీఎం కేసీఆర్ నిజం చేశారు. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కేసీఆర్ సారు తీసుకున్న నిర్ణయంతో చాలా సంతోషంగా ఉంది. మరింత ఉత్సాహంగా పని చేస్తాం. సీఎం కేసీఆర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– స్వప్న , జేపీఎస్, కొత్తపల్లి, మండలం కోటగిరి
చాలా ఆనందంగా ఉంది..
సీఎం కేసీఆర్ సారు మా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయడంపై ధన్యవాదాలు తెలుపతున్నాం. జేపీఎస్‌ల క్రమబద్ధీకరణకు విధివిధానాలను రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది.
– ప్రియాంక, జేపీఎస్, దేవునిగుట్టతండా, మండలం కోటగిరి
క్రమబద్ధీకరణ ప్రకటన హర్షణీయం..
గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దడంలో మేము చేసిన కృషిని ప్రభుత్వం గుర్తించింది. పథకాలతోపాటు వివిధ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలను అందజేస్తున్నాం. పచ్చదనంతోపాటు పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తూ గ్రామాలను సుందరీకరించాం. సీఎం కేసీఆర్ మా కష్టాన్ని గుర్తించి ఉద్యోగాల క్రమబద్ధీకరణ ప్రకటన చేయడం హర్షణీయం.
– ఉమాకాంత్, పంచాయతీ కార్యదర్శి ఎత్తొండ, మండలం కోటగిరి
కష్టాన్ని గుర్తించారు..
జేపీఎస్‌లను రెగ్యులరైజ్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినందుకు జీవితాంతం రుణపడి ఉంటాం. నాలుగేండ్ల నుంచి పల్లెలో ఎన్నో పనులు చేశాం.మా కష్టాలను సీఎం కేసీఆర్ గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయం తీసుకొని, మా జీవితాలకు భరోసా కల్పించారు.
– ప్రతాప్, పంచాయతీ కార్యదర్శి కల్లూర్, మండలం పొతంగల్