సిరికొండ, డిసెంబర్ 16 : ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదల ఉంటే విజయాలు సొంతమవుతాయని నిరూపిస్తున్నారు ఆ పల్లెటూరు విద్యార్థులు. గ్రామాభివృద్ధి కమిటీ, యువత ప్రోత్సాహంతో వ్యాయామ ఉపాధ్యాయుడు నాగేశ్ శిక్షణలో మెళకువలు నేర్చుకుంటూ ఉన్నత స్థానంలో నిలుస్తూ మంచి ఫలితాలు సాధించి ఆ గ్రామానికే వన్నె తెస్తున్నారు. జాతీయ క్రీడ ఏది అని అడిగితే టక్కున హాకీ అని చెబుతాం. నిజామాబాద్ జిల్లాలో హాకీకి కేరాఫ్ ఏ పాఠశాల అంటే తూంపల్లి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ పాఠశాలలో ప్రస్తుతం 170 మంది విద్యార్థులు చదువుతున్నారు. 170 మంది విద్యార్థులు హాకీ ఆడతారు. ఆ పాఠశాలలో వందకు వంద శాతం మంది విద్యార్థులు హాకీ క్రీడాకారులే.
హాకీ అంటేనే తూంపల్లి..
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామం మారుమూల ప్రాంతం. మొదట ఈ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు హాకీ అంటే తెలియదు. అలాంటి విద్యార్థులు నేడు రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు రాణిస్తున్నారు. ఈ పాఠశాలకు 2015లో పీఈటీగా సడక్ నాగేశ్ వచ్చారు. ఆయన హాకీ క్రీడాకారుడు కావడంతో ఉదయం, సాయంత్రం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించి మెళకువలు నేర్పించారు. దీంతో విద్యార్థులు హాకీలో చలాకీలుగా మారారు. అప్పటి నుంచి నేటి వరకు ఎక్కడ టోర్నీ జరిగినా తూంపల్లి విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచి పాఠశాలకు ఎన్నో పతకాలను సాధించారు. తూంపల్లి క్రీడాకారులు లేని హాకీ జట్టు లేదు. హాకీ అంటేనే తూంపల్లి.. తూంపల్లి అంటేనే హాకీ అనేంత పేరు సంపాదించారు. తూంపల్లి పాఠశాల నుంచి ఎనిమిదేండ్లలో వారి ప్రతిభ చెప్పలేనిది. 68సార్లు జాతీయస్థాయిలో, 268సార్లు రాష్ట్ర స్థ్థాయి పోటీల్లో పాల్గొన్నారు. స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా హాకీ అకాడమీలో ఎనిమిది మంది, స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ తెలంగాణ హాకీ అకాడమీకి ఏడుగురు ఎంపికయ్యారు. బాలురతో సమానంగా బాలికలు రాణిస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో పూర్వ విద్యార్థులు ఆర్మీ, కానిస్టేబుల్, పీఈటీలుగా ఉద్యోగాలు సాధించడం విశేషం.
దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాలి
తూంపల్లి పాఠశాల నుంచి ఎంతో మంది విద్యార్థులు హాకీ పోటీల్లో పాల్గొన్నారు. 68సార్లు జాతీయస్థాయిలో పాల్గొన్నారు. స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా హాకీ అకాడమీలో అమ్మాయిలు సైతం అబ్బాయిలతో సమానంగా పోటీపడి ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. జాతీయ, రాష్ట్రస్థాయిలో పాల్గొని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సైతం సాధించారు. ఈ పాఠశాలలో 170 మంది విద్యార్థులుంటే 170మంది హాకీ ఆడతారు. ఎప్పటికైనా తూంపల్లి విద్యార్థులు దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి గ్రామానికి, మండల, జిల్లా, రాష్ట్ర, దేశానికే పేరు తేవాలని ఆకాంక్షిస్తున్నా.
-సడక్ నాగేశ్, పీఈటీ, జడ్పీహెచ్ఎస్, తూంపల్లి
విజేతలుగా నిలుస్తున్నాం..
వ్యాయామ ఉపాధ్యాయుడు ఉద యం, సాయంత్రం సాధన చేయిస్తున్నారు. ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో ప్రతి టోర్నీలో ఉత్తమ ప్రతిభను కనబరుస్తూ విజేతలుగా నిలుస్తున్నాం. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై పతకాల ను సాధిస్తున్నాం. పీఈటీ, వీడీసీ, యూత్, గ్రామస్తులు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారు.
– బానావత్ వినీత, హాకీ క్రీడాకారిణి, తూంపల్లి
స్పోర్ట్స్ కోటాలోనే ఉద్యోగం..
హాకీని ఇష్టం, పట్టుదలతో ప్రతి రోజూ నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరూ నాకు ఎంతో సహకరించారు. హాకీ ఆడడంతో నేను శారీరకంగా,మానసికంగా దృఢంగా ఉన్నాను. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎన్నో పతకాలు సాధించాను. నాకు స్పోర్ట్స్ కోటాలో ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నది.
-పొడేండ్ల రంజిత్, ఆర్మీ ఉద్యోగి, జాతీయ స్థాయి హాకీ క్రీడాకారుడు