ఆర్మూర్, జనవరి13: సీఎం కేసీఆర్ పాలన మైనార్టీలకు స్వర్ణయుగం అని పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో డొంకేశ్వర్ గ్రామానికి చెందిన మైనార్టీలు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, 2014 నుంచి బడ్జెట్లో మైనార్టీల కోసం నిధుల కేటాయింపులు పెంచుతూ వస్తున్నదని తెలిపారు.
2022 ఆర్థిక సంవత్సరంలో రూ.1724.69 కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్రంలోని 204 మైనార్టీ గురుకులాల్లో లక్షా30వేల560 మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే వారి కోసం ఓవర్సిస్ స్కాలర్షిప్ అందిస్తున్నదని, ఇప్పటికే సుమారు 2,725 మంది విద్యార్థులకు రూ.20లక్షల చొప్పున అందజేసినట్లు తెలిపారు. మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని ఆయన సూచించారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొంది ఆర్మూర్ ప్రాంత ప్రజలకు మరిన్ని సేవలను అందిస్తానన్నారు.
పార్టీలో చేరిన వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటామని భరోసా ఇచ్చారు. డొంకేశ్వర్‌లో మైనార్టీ ఫంక్షన్ హాల్‌కు రూ.పది లక్షలు మంజూరు చేస్తున్నానని, త్వరలో ‘నమస్తే డొంకేశ్వర్’ నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ నిర్వహిస్తానని చెప్పారు. కేసీఆర్ దయతో డొంకేశ్వర్ వాసుల 30 ఏండ్ల కల సాకారం అయ్యిందని, మండలంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.